KCR: ప్రచార వ్యూహం ఫలిస్తుంది

ప్రధానాంశాలు

KCR: ప్రచార వ్యూహం ఫలిస్తుంది

హుజూరాబాద్‌ పోరుపై మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచార వ్యూహం విజయవంతమైందని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రజల నుంచి విశేషాదరణ లభించిందని, భారీ మెజారిటీతో పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విజయం ఖాయమని వివరించారు. ప్రచారం మాదిరే పోలింగు ముగిసే వరకు వచ్చే మూడురోజులు ద్విగుణీకృత స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన నేతలకు, శ్రేణులకు నిర్దేశించారు. ప్రచారం, ప్రజాస్పందన, ఆదరణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నేతలను, శ్రేణులను అభినందించారని సమాచారం. బుధవారం ఆయన హుజూరాబాద్‌లోని మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విప్‌ బాల్కసుమన్‌, పార్టీ నేతలు కౌశిక్‌రెడ్డి, బండ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫోన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ‘‘హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రగతి ఆవశ్యకతను, దానికి ప్రభుత్వ పరంగా అండదండలు, సహకారం గురించి చక్కగా వివరించారు. స్థానికుడు, పేదింటి బీసీ బిడ్డ, ఉద్యమకారుడైన పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు అన్ని చోట్లా ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. ప్రజలు ఆయన్నే ఆశీర్వదించి, గెలిపిస్తారు. పోలింగు కీలకం. దీని కోసం నియోజకవర్గంలో బూత్‌ ఏజెంట్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. పోలింగు రోజున అనుసరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేయాలి’’ అని సీఎం సూచించారని తెలిసింది.హుజూరాబాద్‌, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్‌ మండలాలు, హుజూరాబాద్‌, జమ్మికుంట పురపాలికలలోని పలువురు మండల, పట్టణ స్థాయి, గ్రామస్థాయి తెరాస నేతలతోనూ కేసీఆర్‌ మాట్లాడారు. బాగా పనిచేస్తున్నారంటూ వారికి అభినందనలు తెలిపారు. ప్రచారం సందర్భంగా  వారి అనుభవాలను తెలుసుకున్నారు. పార్టీపరంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని