చాపకింద నీరులా డబుల్‌ మ్యుటెంట్‌
close

ప్రధానాంశాలు

చాపకింద నీరులా డబుల్‌ మ్యుటెంట్‌

తెలుగు రాష్ట్రాల్లో రెండో ఉద్ధృతికి కారణమిదే
కొత్త కేసుల్లో సగం వరకు బి.1.617 వైరస్సే
వ్యాప్తిలో ఉన్న ఎన్‌440కే క్రమంగా కనుమరుగు
జన్యుక్రమ ఆవిష్కరణలో మార్పులను గమనిస్తున్న సీసీఎంబీ శాస్త్రవేత్తలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరగడానికి డబుల్‌ మ్యుటెంట్‌ వైరసే కారణమని అంటున్నారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొవిడ్‌ రెండో ఉద్ధృతి మార్చి నెల మధ్యలో మొదలైంది. దాదాపు నెలన్నరపైగా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్‌ జన్యుక్రమాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు కొత్త విషయాలను గుర్తించారు. కొత్తగా వస్తున్న కేసుల్లో సగం వరకు బి.1.617 వైరస్‌ (డబుల్‌ మ్యుటెంట్‌) రకమే ఉండడంతో ఇతర రాష్ట్రాల డాటాతో పోల్చి చూశారు. మహారాష్ట్రలో రెండో ఉద్ధృతి అన్ని రాష్ట్రాల కంటే ముందు ఫిబ్రవరిలో మొదలైంది. అప్పటివరకు అక్కడ వ్యాప్తిలో ఉన్న ఎన్‌440కే రకం కనుమరుగై డబుల్‌ మ్యుటెంట్‌ విస్తరించింది. దీంతో అక్కడ అనూహ్యంగా కేసులు పెరిగాయి. మన దగ్గర కూడా మార్చి ప్రారంభం వరకు ఎన్‌440కే రకం వ్యాప్తిలో ఉండేది. దీని స్థానంలో నెలన్నర రోజుల్లోనే డబుల్‌ మ్యుటెంట్‌ చాపకింద నీరులా విస్తరించి కేసుల పెరుగుదలకు కారణమైంది. ఈ రెండిటిని పోల్చి విశ్లేషించిన శాస్త్రవేత్తలు కేసుల పెరుగుదలకు డబుల్‌ మ్యుటెంట్‌ కారణమైందని నిర్ధారణకు వచ్చారు. తెలంగాణలో ఇండియన్‌ వేరియంట్‌గా చెబుతున్న బి.1.617 మార్చి, ఏప్రిల్‌లో బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ మొదట్లో మూడో వంతు కేసుల్లో ఎన్‌440కే రకం వైరస్‌ బయటపడగా.. ఇప్పుడది 20 శాతం లోపే ఉందని.. అక్కడ డబుల్‌ మ్యుటెంట్‌ వ్యాపిస్తోందని చెబుతున్నారు. కర్ణాటక, కేరళలో ఎన్‌440కే రకం వైరస్‌ దాదాపు కనుమరుగయ్యే దశలో ఉందని అంటున్నారు. గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లూయంజా డాటా పొందుపర్చిన గణాంకాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని సీసీఎంబీ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర అన్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో బి.1.617, బి.1.1.7, బి1 వ్యాప్తి పెరుగుతోందని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని