
తాజా వార్తలు
‘పేషెంట్ జీరో’ను ఎప్పటికీ కనుక్కోలేము..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి మూలాల శోధన ప్రారంభమైంది. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ నేతృత్వంలోని నిపుణుల బృందం వుహాన్కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే, కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తి ‘పేషెంట్ జీరో’ను కనుక్కోవడం అసాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. పేషెంట్ జీరోను ప్రపంచం ఎన్నటికీ కనుక్కోకపోవచ్చని డబ్ల్యూహెచ్ఓ వ్యాధుల విభాగం సాంకేతికాధిపతి మారయా వ్యాన్ కోర్కోవ్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ మూలాలను శోధించడం కోసం పది మందితో కూడిన నిపుణుల బృందం వుహాన్లో అడుగుపెట్టిన సమయంలోనే డబ్ల్యూహెచ్ఓ ఈ విధంగా స్పందించడం గమనార్హం. అయితే, సుదీర్ఘ కాలం తర్వాత అక్కడికి చేరుకోవడంపైనా అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తునకు చైనా తొలినుంచి అడ్డుపడుతున్న విషయం తెలిసిందే.
ఇక ప్రపంచవ్యాప్తంగా కొత్తరకం కరోనా వైరస్లు బయటపడుతోన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. వీటిని ఎదుర్కొనేందుకు కరోనా వైరస్ సీక్వేన్సింగ్ను చేపట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అయితే, జెనెటిక్ కోడ్ సీక్వెన్సింగ్ విశ్లేషించడం అన్ని దేశాలకు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది. ఇక కొన్ని దేశాల నుంచి వచ్చేవారికి వ్యాక్సిన్ తీసుకున్నట్లు రుజువు చూపించాలని కోరడాన్ని డబ్ల్యూహెచ్ఓ వ్యతిరేకించింది. ప్రస్తుతం కొన్ని దేశాల్లోనే ప్రారంభమైన టీకా పంపిణీ ప్రక్రియ వచ్చే 100రోజుల్లో అన్ని దేశాల్లో ప్రారంభమవ్వాలని ఆకాంక్షించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్ సమానంగా అందేలా చూడాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి..
కొవిడ్ మూలాలు: ఏడాదైనా మిస్టరీగానే..!
చైనా ‘కరోనా’...జీవాయుధమేనా?