కొత్తదనంతో..కోటి ఆశలతో..

కాలం ఎప్పుడూ కొత్తదే. ఆశల రెక్కలు తొడిగినప్పుడే అది మరింతగా చేరువవుతుంది. ముందుకు నడిపిస్తుంది. ఈ నడక ఎక్కడి నుంచి ఆరంభమవ్వాలి, ఆ శుభ ముహూర్తమేది, న్యూఇయర్‌ మనది కాదుగా.. ఇలాంటి సందేహాలెన్నో! నిజానికి కాలం దైవ స్వరూపం. ఏదో ఒక సందర్భంలోనే కాలానికి పవిత్రత ఉండదు.

Updated : 30 Dec 2021 03:58 IST

కాలం ఎప్పుడూ కొత్తదే. ఆశల రెక్కలు తొడిగినప్పుడే అది మరింతగా చేరువవుతుంది. ముందుకు నడిపిస్తుంది. ఈ నడక ఎక్కడి నుంచి ఆరంభమవ్వాలి, ఆ శుభ ముహూర్తమేది, న్యూఇయర్‌ మనది కాదుగా.. ఇలాంటి సందేహాలెన్నో! నిజానికి కాలం దైవ స్వరూపం. ఏదో ఒక సందర్భంలోనే కాలానికి పవిత్రత ఉండదు. న్యూఇయరైనా ఉగాదైనా ఒకటే. కనుక ఆ శుభ సమయాన కాలస్వరూపుడైన దైవాన్ని తలచుకుని ఓ పద్ధతి, ప్రణాళికతో ఏడాది గడపడానికి పథక రచన చేసుకోవడమే ఉత్తమం. ఆ నిచ్చెన మెట్లమీద లక్ష్యాలను చేరుకోవడమే కర్తవ్యం. జీవిత కాలంలో ప్రతి క్షణమూ మంచి చేస్తూ పుణ్యాన్నే సంపాదించాలి. దానికి కారణం...

కాలోహి బలవాన్‌ కర్తా సతతం సుఖ దుఃఖయోః
నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగతః

అని దేవీ భాగవతం పేర్కొంటోంది. కాలం అంటే పుణ్య పాపాలకు తగిన సుఖదుఃఖాలను ప్రసాదించేది. అందుకే కాలం దైవ స్వరూపమైంది. కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే కష్టనష్టాలు, సద్వినియోగం చేసుకుంటే సుఖసంతోషాలు కలుగుతాయి. అదే దైవ ఆగ్రహం లేదా అనుగ్రహం.

ప్రతిక్షణమూ విలువైనదే: విశ్వరూప సందర్శన వేళ తను కాలరూపుడినని గీతాకారుడు వివరించాడు. మధ్వాచార్యులవారి మధురాష్టకంలో ‘మధురాధిపతేరఖిలమ్‌ మధురం’ అన్నట్టు ఆ మధురాధిపతి అయిన కృష్ణుడిలాంటి కాలప్రమాణంలో క్షణంలో లక్షోవంతు కూడా విలువైనదే. చేజారితే తిరిగి రాదు కనుక నిర్లక్ష్యం పనికిరాదు. బద్ధకంతో జరిగేదేదో జరుగుతుందనే నిర్లిప్తత కూడదు. చెయ్యాల్సింది చేసి తీరాల్సిందే. మనమలా ఉంటేనే దైవానికి ఇష్టం.

కాలో స్మిలోక క్షయకృత్‌ ప్రవృద్ధో
లోకాన్‌ సమాహర్తు మిహప్రవృత్తః
ఋతే పి త్వాంన భవిష్యంతి సర్వే
యే వస్థితాఃప్రత్యనీ కేషు యోధాః

అని భగవద్గీతలో కృష్ణుడు తానే కాలమని, కర్తవ్య నిర్వహణే ముఖ్యమని, పని ఆగడం తనకు ఇష్టంలేదనీ అన్నాడు. అందుకే దైవాన్ని గౌరవించేవాళ్లు కాలాన్నీ గౌరవిస్తూ బాధ్యతలు నిర్వర్తించాలేగానీ స్తబ్దత కూడదు.
అనంతమైన కాలంలో ఏది ఆది, ఏది అంతం అని తేల్చడం సాధ్యంకానందున దైవాన్ని అనంతుడన్నారు. కనుక న్యూఇయర్‌ లాంటి ఏ సమయాన్నయినా మంచి పనులకు శ్రీకార దినంగా స్వీకరించవచ్చు.
విశ్వవాప్తంగా ఉన్న మానవాళి కాల విభజనలో తమ స్థితి గతులను బట్టి ఆయా పద్ధతులను అనుసరిస్తుంటారు. ‘ఇది ఈ కాలానికి మొదలు, సంవత్సరాన్ని ఇప్పటినుంచీ ప్రారంభం అనుకుంటున్నాం’ అనుకోవటం ఐచ్ఛికం. అదేమీ తప్పు కాదు. కాలాన్ని వృథా చెయ్యడమే తప్పు. ఎప్పుడు చెయ్యాల్సింది అప్పుడు గాక కాలం మీరిపోయాక చేద్దామనుకోవటం అవగాహనారాహిత్యం, అలసత్వాలకు సంకేతం.
ఒకరి సంవత్సరాది వేరొకరు చేసుకోవచ్చా- అనే సందేహం అవసరం లేదన్నారు పెద్దలు. అన్నీ మంచివే. దేన్నయినా పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోవచ్చు. అది సమాజానికి హితం చేస్తే చాలు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని