ఆ రుధిరం సర్వపాప హరణం

లోకరక్షకుడైన యేసుక్రీస్తును కరడు కట్టిన యూదు మత పెద్దలు అనేక బాధలు పెట్టారు. కొరడా దెబ్బలతో గాయపరిచారు. ముళ్లకొమ్మల కిరీటాన్ని తలపై గుచ్చి గేలిచేశారు. ముఖంమీద ఉమ్మి పిడిగుద్దులతో బాధపెట్టారు. సిలువపై

Updated : 14 Apr 2022 01:30 IST

రేపు గుడ్‌ఫ్రైడే

లోకరక్షకుడైన యేసుక్రీస్తును కరడు కట్టిన యూదు మత పెద్దలు అనేక బాధలు పెట్టారు. కొరడా దెబ్బలతో గాయపరిచారు. ముళ్లకొమ్మల కిరీటాన్ని తలపై గుచ్చి గేలిచేశారు. ముఖంమీద ఉమ్మి పిడిగుద్దులతో బాధపెట్టారు. సిలువపై మరణించేవరకూ హింసించారు. చనిపోయాడో లేదోనని బాకుతో డొక్కలో పొడిచారు. ఈ విషాదాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్త క్రైస్తవులు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. దీన్ని లెంట్‌ అంటారు. అంటే నలభై అని, చిగురించడం అని అర్థం. బైబిల్‌లో 40 రోజులకు ప్రత్యేకత ఉంది. ప్రజాపరిచర్యకు ముందు యేసు ఉపవాస ప్రార్థన చేసింది కూడా 40 రోజులే. యేసు మరణించి తిరిగి లేచిన ఆదివారం ఈస్టర్‌. పునర్జీవాన్ని పొందిన పర్వదినం అది. ఈస్టర్‌ అంటే వసంతం. మోడువారిన జీవితం చిగురించి ఫలిస్తుందని అంతరార్థం. ఈస్టర్‌ చిహ్నాలుగా గుడ్లు, లిల్లీపూలు, సీతాకోక చిలుకలు పంచుకోవడం సంప్రదాయం. 

యేసును అన్యాయంగా, అక్రమంగా సిలువ వేశారన్నది జగమెరిగిన సత్యం. ఒక మహోన్నత వ్యక్తిని మరణశిక్షకు గురిచేసింది రోమా ప్రభుత్వం. నేరారోపణ చేయడమే కానీ నిరూపించలేకపోయింది. న్యాయాధిపతి అయిన పిలాతు యేసును నిర్దోషిగా భావించి తీర్పు ఇచ్చినా ముష్కరమూక సిలువ వేసేవరకూ వదల్లేదు. సిలువవేతకు ముందు రోజును నియమ గురువారం అంటారు. ఆరోజు శిష్యులతో కలిసి చివరి విందును ఆరగించారు. దీన్ని లాస్ట్‌ సప్పర్‌ అంటారు. ఇక్కడే యేసు- విందు సమయంలో తన శరీరానికి గుర్తుగా రొట్టెను, రక్తానికి గుర్తుగా ద్రాక్షరసం స్వీకరించాలని కొత్త నిబంధన ఏర్పరచాడు. ప్రతి చర్చిలోనూ ఆయా సందర్భాల్లో ఈ నియమాన్ని ఆచరిస్తారు. 

గెత్సమనె వనంలో యేసును బంధించి సంకెళ్లు వేసి కిద్రోను లోయ గుండా నడిపించారు. మొదట హన్న అనే ప్రధాన పూజారి (యాజకుడు) సమక్షంలో తీర్పు కోసం నిలబెట్టారు. ఇతను కయపకు మామ. ప్రజల కోసం ఒక వ్యక్తి చనిపోవాలి అనే దుష్ట ఆలోచనను యూదులకు చెప్పాడు యోహాను (18:12-14) అబద్ధపు సాక్ష్యాలు చెప్పించినా ఆధారాలు చూపలేకపోయారు. మార్కు (14:53-65)

చివరికి ‘పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా?’ అని అడిగినప్పుడు యేసు- ‘అవును.. నేనే’ అని చెప్పిన తర్వాత ప్రధాన పూజారి కోపంగా వస్త్రాలు చింపు కున్నాడు. మార్కు (14:55-65) అతడిలోని కోపం, కసి, పగ, ప్రతీకారం వికృతరూపం దాల్చాయి. దుస్తులు చింపుకోవడం పరాకాష్ట అయ్యింది. ఆయన చేష్టలకు రెచ్చిపోయిన మూక యేసయ్య ముఖం మీద ఉమ్మి వేశారు. ముసుగు కప్పి పిడిగుద్దులు గుద్దుతూ ‘ఎవరు కొట్టారో చెప్పుకో’ అంటూ హేళన చేశారు. సిలువ వేయమంటూ కేకలు పెట్టారు. సిలువవేత ఒక క్రూర, అనాగరిక, అస్వాభావిక, అసాధారణ, ఆటవిక శిక్ష. సిలువపై నేరస్తులను చంపే పద్ధతి ఫోనీషియస్‌ వారు మొదలుపెట్టిన శిక్షా విధానం. 

సిలువపై యేసు పలికిన .. 

* వీళ్లంతా తెలియక చేస్తున్నారు, క్షమించు

* నువ్వూ నాతోపాటే పరలోకంలో ఉంటావు (డిస్మస్‌తో అన్నాడు)

* మేరీమాతను చూపి ‘అమ్మ బాధ్యత నీదే’ అంటూ యోహాన్‌కు బాధ్యత అప్పగించాడు.

* నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?

* దాహంగా ఉంది.

* ఈ లోకంలో నేను వచ్చిన పని పూర్తయ్యింది.

* నీ చేతికి నా ఆత్మను అర్పిస్తున్నాను- ఈ చివరి ఏడు మాటలు మన జీవితాల్లో సర్వజీవన ముక్తిమార్గ సోపానాలు. ఆ మాటల్లో జీవితం ప్రతిఫలిస్తుంది. మనిషికి దైవంతో ఉన్న సంబంధం, సమాజంతో ఉన్న బాంధవ్యం, విశ్వవ్యాప్త ప్రేమ, సార్వకాలిక జీవన విధానం కనిపిస్తాయి. న్యాయంగా, జీవించడానికి, అందరి సంక్షేమానికి యేసు ఇచ్చిన కొత్త సందేశం. యేసును సిలువ వేసింది శాంతికి చిహ్నమైన ఆలివ్‌ చెట్టుకు. అది నీతికి సాదృశ్యం.

యేసుతోపాటు మరో ఇద్దరికి ఎందుకు సిలువ వేశారన్నది ఒక ప్రశ్న. నిజానికి యేసు ఒక్కడికే సిలువ వేయాలి. కానీ యేసును యూదుల రాజుగా గుర్తించారు. ఇక్కడ అపహాస్యమైన విషయం ఏమిటంటే.. సిలువపై ‘ఐఎన్‌ఆర్‌ఐ’ అని రాసి హేళన చేశారు. లాటిన్‌లో ‘ఈసు నజరేన రెక్స్‌ ఇవాడీరియం’ అంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు యోహాను 19:19-22. ఈ మాటలు రాయడానికి.. న్యాయాధిపతి అయిన పిలాతు కారణం. యూదుల ప్రధాన పూజారులు అలా మాట్లాడ వద్దని ఎదురుతిరిగినా ‘నేను రాసినదేమో రాసితిని’ యోహాను (19:22) అనే పరిస్థితి వచ్చింది. రాజును శిక్షించేటప్పుడు మరో ఇద్దరు దోషులనూ శిక్షించడం రోమా సంప్రదాయం. కళంకం లేని కారణజన్ముడు, పాప విమోచనుడు, పావనమూర్తి అయిన యేసు మరణంతో లోకానికి కొత్త రక్షణ లభించింది. ఆయన రుధిరం సర్వమానవ పాపహరణం. అందుకే యేసు జీవితాన్ని, సిలువ త్యాగాన్ని స్మరిస్తూ శుభ శుక్రవారం.. గుడ్‌ఫ్రైడేగా ఆచరిస్తారు. దీనికి ముందు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలతో ‘లెంట్‌’ దినాలుగా ఆచరిస్తారు. ఈ నలబై రోజుల దీక్షతో పాపప్రక్షాళన, ప్రశాంతత జీవన్ముక్తి లభిస్తాయని ఆశిస్తారు. ‘ఎవరైనా నా మార్గంలో నడవాలనుకుంటే తనను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని అనుసరించాలి’ అంటూ ఉపదేశించాడు క్రీస్తు. ముక్తిమార్గ జీవనానికి మార్గదర్శనం.

- గుజ్జర్లమూడి కృపాచారి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని