అదే నీవు..అదే నేను!
ఉన్నదొకటే...దాన్ని తెలుసుకుంటే చాలు...భయాలు, బాధలు, కన్నీళ్లు... ఏవీ ఉండవు. అసలు మరణమే ఉండదు. దాన్ని తెలుసుకోవాలంటే...ఏం చేయాలి? నచికేతుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా యమధర్మరాజు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు...
ఉన్నదొకటే...దాన్ని తెలుసుకుంటే చాలు...భయాలు, బాధలు, కన్నీళ్లు... ఏవీ ఉండవు. అసలు మరణమే ఉండదు. దాన్ని తెలుసుకోవాలంటే...ఏం చేయాలి? నచికేతుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా యమధర్మరాజు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. భారతీయ సనాతన సంప్రదాయానికి మూలవస్తువులాంటి సంవాదం అది. దశోపనిషత్తుల్లో ఒకటైన కఠోపనిషత్తులోని ఈ సందర్భం అద్వితీయం. నిత్యస్మరణీయం...
అసలేంటీ ఆత్మ?
అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో
రూపం రూపం ప్రతిరూపో బభూవ!
ఏకస్తథా సర్వభూతాంతరాత్మ
రూపంరూపం ప్రతిరూపో బహిశ్చ!
సృష్టి జరిగే సమయంలో విశ్వంలో తొట్టతొలిగా ఒక అగ్ని ఆవిర్భవించింది. అది అన్ని జీవుల్లో ప్రవేశించింది. ఏ శరీరంలో ఉంటే ఆ రూపంతోనే తన విధిని నిర్వర్తించడం ప్రారంభించింది. సర్వప్రాణులకూ చైతన్యాన్ని కలిగిస్తూ ప్రపంచాన్ని చేతనాత్మకం చేసింది. అదే ఆత్మ లేదా పరమాత్మ. అది తానున్న శరీరం పడిపోగానే మరో శరీరంలోకి చొరబడుతుంది. ఆ ఆత్మకు నాశనం లేదు. తనలో ఉన్న ఆ చైతన్యాన్ని తెలుసుకున్న వాడికి శాంతి దొరుకుతుంది. దయ కలుగుతుంది.
జాగ్రత్త సుమా!
‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్ నిబోధత!
క్షురస్వధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్
కవయో వదంతి!’
ఆత్మ సాక్షాత్కారం కోసం వెళ్లే మార్గం అంత సులువైంది కాదు. అందుకే లేవండి... మేల్కోండి. ఒక ఉత్తమ గురువును ఆశ్రయించి పదునైన కత్తి అంచులా ఉండే ఆ మార్గంలో నడిచేందుకు సిద్ధం కండి. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఉన్న మార్గం పదునైన కత్తి అంచులా ఉండడానికి కారణం ఇంద్రియాలే. సాధన చేద్దాం... ఆత్మను తెలుసుకుందాం అని ప్రయత్నించినప్పుడల్లా మాట వినని గుర్రాల్లాంటి ఇంద్రియాలు మనసును అదుపు తప్పిస్తుంటాయి. మనిషిని అధఃపాతాళానికి తోసేస్తుంటాయి.
చిరునామా ఉందా?
పురమేకాదశద్వార మజస్యావక్ర చేతసః!
అనుష్ఠాన న శోచతి విముక్తశ్చ విముచ్యతే!
ఏతద్వై తత్!
ఇది ఓ పట్టణంలో ఉంటుంది. ఆ పట్టణానికి పదకొండు ద్వారాలుంటాయి. అందులో ఉన్న ఆత్మను తెలుసుకుని ధ్యానించిన వారికి అన్ని రకాల బంధాల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది... ఇంతకీ ఈ పదకొండు ద్వారాలున్న పట్టణం మన శరీరమే. అదే అనశ్వరమైన ఆత్మ నివాసస్థానం. మనం స్థిరంగా ఉండే, అద్భుతమైన ప్రజ్ఞ కలిగిన ఆత్మను దర్శించాలి.
ఎలా ఉంటుంది?
అణోరణీయాన్ మహతో మహీయా
నాత్మాస్య జంతోర్నిహితో గుహాయమ్!
తమక్రతుః పశ్యతి వీతశోకో
దాతు ప్రసాదాన్ మహిమానం ఆత్మనః!
ఆత్మ అణువుకంటే సూక్ష్మంగా, బ్రహ్మాండం కంటే పెద్దదిగా ఉంటుంది. అది ప్రాణుల హృదయాల్లో ఉంది. కోర్కెలు లేని వాడికి దుఃఖం ఉండదు. అలాంటి మనసున్న వాడు మాత్రమే తనలో ఉన్న ఆత్మను సాక్షాత్కరించుకోగలుగుతాడు. అంటే ఇంద్రియాలను జయించి హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం తనలో ఉన్న ఆత్మను దర్శించడానికి తొలి అర్హతగా భావించాలి.
ఎందుకు తెలుసుకోవాలి?
ఆసీనో దూరం ప్రజతి శయనోయాతి సర్వతః!
కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి!
ఆత్మ ఒక జ్యోతిర్మయ స్థితిలో ఉంటుంది. ఇక్కడ ఆనందం ఉండడం, లేకపోవడం... ఏమీ ఉండదు. అది కదలకుండా కూర్చున్నా ఎంతో దూరం ప్రయాణిస్తుంది. పడుకుని ఉన్నా సకల ప్రదేశాలకూ వెళ్లగలుగుతుంది. అసలది లేని చోటే లేదు... ఇంత మహిమాన్వితమైన ఆత్మను తెలుసుకున్నవాడు దానిలాగే అన్నిటికీ అతీతంగా, అద్వితీయంగా ఉండగలుగుతాడు. అసలా ఆత్మ తనలోనే ఉందని, అది జరామరణాలకు అతీతమైందని తెలుసుకున్నవాడు శోకం నుంచి విముక్తి చెందుతాడు.
- యల్లాప్రగడ మల్లికార్జునరావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ