కృష్ణార్పణమస్తు!

దైనందిన జీవితంలో చాలామంది ఏ పని చేసినా ‘కృష్ణార్పణం’ అంటూ ఉంటారు. మనమంతా మంచో చెడో ఏదో ఒక పని చేయకుండా ఉండలేం. చెడ్డపనులు చేస్తే నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా

Published : 19 May 2022 00:22 IST

దైనందిన జీవితంలో చాలామంది ఏ పని చేసినా ‘కృష్ణార్పణం’ అంటూ ఉంటారు. మనమంతా మంచో చెడో ఏదో ఒక పని చేయకుండా ఉండలేం. చెడ్డపనులు చేస్తే నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా జననమరణ చక్రంలో తిరుగుతూ ఉండిపోవలసిందేనా? మోక్షం పొందడానికి మార్గం ఏదైనా ఉందా? అని అందరూ ఆలోచిస్తారు. భగవద్గీతలో ‘అర్జునా! నువ్వేం చేసినా, ఏం తిన్నా, ఎవరికి ఏమిచ్చినా అంతా నాకు సమర్పించు’ అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ ఉపదేశాన్ని లోతుగా పరిశీలిస్తే మూడు ఉపయోగాలున్నాయి. మొదటిది కర్తృత్వ త్యాగం. ‘అన్నీ నేనే చేస్తున్నాను. నావల్లనే ఇదంతా!’ అనే అహంకారం వదిలిపెట్టాలి. ఏ కర్మనయినా భగవంతుడే చేయిస్తున్నాడని నమ్మితే చెడుపనులు చేసేందుకు వెనుకంజ వేస్తాం. రెండోది ఫలత్యాగం. ఏది చేసినా ‘ఇది నా కర్తవ్యం’ అనుకుని చెయ్యాలి. ఫలితం ఎలాంటిదైనా ఉద్వేగాలకు లోనవకూడదు. భగవత్‌ కైంకర్యంగా భావించాలి. మూడోది సంగ త్యాగం.. ‘ఇది నాది. ఏది చేసినా నేనే చెయ్యాలి.. అంతా నాదే. కర్మలన్నీ భగవన్ముఖ వికాసం కోసమని, ఆయన ఆనందమే మన ఆనందమని నమ్మాలి. ఈ మూడు త్యాగాలను త్రికరణశుద్ధిగా అవలంభించాలి. ఏ పని చేసినా దేవునికి నమస్కరించి ‘సర్వం కృష్ణార్పణమస్తు’ అనుకుంటే కైవల్యం సిద్ధిస్తుంది.

- పులిగండ్ల చిదంబరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని