Kotappakodna: బాలవటువు..జ్ఞానప్రదాతగా..

దేశంలో ఉన్న శైవక్షేత్రాల్లో   కోటప్పకొండ విభిన్నమైంది. జ్ఞానప్రదాతయైన శ్రీమేధా దక్షిణామూర్తిస్వామి

Updated : 01 Mar 2022 12:11 IST

కోటప్పకొండలో మేధా దక్షిణామూర్తిగా శివయ్య


నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడేదేశంలో ఉన్న శైవక్షేత్రాల్లో   కోటప్పకొండ విభిన్నమైంది. జ్ఞానప్రదాతయైన శ్రీమేధా దక్షిణామూర్తిస్వామి శివరూపంలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. నిత్యాభిషేకాలు అందుకుంటూ కర్షక పక్షపాతిగా, అజ్ఞానాంధకారాన్ని తొలగించే ఆది గురువుగా భాసిల్లుతున్నారు. ఆత్మజ్ఞానానికి ప్రతీకగా.. త్రికోటేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం  కోటప్పకొండలోని త్రికూటాద్రి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి. క్రీ.శ.1172 నాటికే త్రికోటేశ్వరాలయం ఉందని చోళరాజైన కుళోత్తుంగ మహారాజు సామంతుడు మాంగల్య గోత్రానికి చెందిన మూరాంగి నాయకుడు వేసిన దాన శాసనం వల్ల తెలుస్తోంది. అంతే కాకుండా సిద్ధుమల్లప్ప, శంభుమల్లమ్మ వేసిన శాసనాలు సైతం ఆలయ ప్రాచీనతను వెల్లడిస్తున్నాయి. క్రీ.శ. 6, 7 శతాబ్దాల్లో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు. తర్వాత కాలంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట జమీందారు శ్రీరాజా మల్రాజు వెంకటరాయణం, చిలకలూరిపేటకు చెందిన మానూరి వారు, అమరావతికి చెందిన శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, పెట్లూరివారిపాలెం జమీందార్లు భక్తిశ్రద్ధలతో స్వామికి మాన్యాలు సమర్పించారు. త్రికోటేశ్వరుని దర్శించుకునేందుకు మూడు సోపాన మార్గాలను నరసరావుపేట జమీందారు శ్రీరాజా మల్రాజు నరసింహారాయణం నిర్మించారు. అంతే కాకుండా  అప్పట్లో ఏనుగుల దారి ఒకటి ఉండేది. ఈ క్రమంలోనే ఏల్చూరుకు చెందిన పినపాడు ఏళేశ్వరం అయ్యగారు స్వామికి మంత్ర పునశ్ఛరణసిద్ధి, మొక్కుబడులు, సంతాన కోటేశ్వర యంత్రాలను ప్రతిష్ఠించి, అష్ట దిగ్బంధనం చేసినట్లు వేదపండితులు చెబుతున్నారు. ప్రతిష్ఠ తర్వాత స్వామికి నిత్యసేవలు నిర్వహించే బాధ్యత కొండకావూరు గోత్రికులకు జమీందార్లు ఇచ్చారు. ఈ క్రమంలో అనివార్య కారణాలతో (మైల/ సూతకం సమయంలో) మధ్యలో సేవలు ఆగే పరిస్థితి ఉండేది. దీంతో యడవల్లి, రాజాపేట, గురిజేపల్లి గ్రామాలకు చెందిన ఐదు కుటుంబాలకు అభిషేక బాధ్యతలను అప్పగించారు. అందుకు వారికి 120 ఎకరాలు మాన్యంగా జమీందారు బహూకరించారు. నేటికీ వారి వారసులే స్వామి సేవలో తరిస్తున్నారు. తర్వాత 1986లో ఘాట్‌రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. జగద్గురువు భారతీ తీర్థమహాస్వామి ఆశీస్సులతో రూ.70 లక్షలతో ఆలయ జీర్ణోద్ధరణ చేశారు. 

మేధా దక్షిణామూర్తి విశిష్టత 

శ్రీత్రికోటేశ్వరస్వామి మూలరూపమైన శ్రీమేధా దక్షిణామూర్తి స్వామిని ‘ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైన మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః’ అని ఆదిశంకరులు స్తుతించి తరించారు. శివుని తత్వానికి ప్రథమ గురువు శ్రీమేధా దక్షిణామూర్తి స్వామి. ఆది గురువైన దక్షిణామూర్తి నిర్మలతత్త్వం, ప్రశాంతత మూర్తీభవించిన స్వామి అనుగ్రహంతో సర్వవిద్యలు లభిస్తాయి. సకల విద్యలకు కారణమైన బ్రహ్మ విద్య స్వామి కారణంగానే లభ్యమవుతుంది. యోగాచార్యునిగా, సంగీతాది సకలశాస్త్ర విశారదునిగా స్వామిని ఉపాసించడం పరిపాటి. ఏ దయ వల్ల దుఃఖాలన్నీ పూర్తిగా నశించి శాశ్వతానంద కైవల్యసిద్ధి కలుగుతుందో ఆ భావమే దాక్షిణ్యం. ఆది గురువైన ఈశ్వరుడు మేధా దక్షిణామూర్తిగా నాలుగు చేతులతో ఆయుధాలు, అక్షరాలు, చిన్ముద్ర, వీణ, పుస్తకం ధరించి కనిపిస్తారు. ఇవన్నీ విద్యా లక్షణాలను తెలియజేస్తాయి. అందువల్లే బాల, బాలికలకు అక్షరాభ్యాసాలు కోటప్పకొండలోని శ్రీమేధా దక్షిణామూర్తి స్వామి సన్నిధిలో చేయించడం మంగళకరంగా వేదపండితులు చెబుతున్నారు. 

భక్తిభావంతో దీక్షలు 

జ్ఞాన ప్రధాత మేధా దక్షిణామూర్తి స్వామి కారుణ్యభావనతో సకల దుఃఖాలు తొలగుతాయన్న విశ్వాసంతో పెద్దలు శ్రీమేధా దక్షిణామూర్తి దీక్షలను ప్రారంభించారు. 1979 నవంబరులో కొప్పురపు సిద్ధాంతుల సూచన మేరకు దీక్షలు ప్రారంభించారు. కార్తికమాసంతో ప్రారంభించి అర్ధ నక్షత్రంతో ముగిసే 40 రోజులు దీక్షధారులు సేవించాలి. నియమాలతో పూజించి ఇరుముడులతో స్వామిని చేరి దీక్షలు విరమించాలన్న నియమం ఉంది. అప్పటి నుంచి ఏటా వేలసంఖ్యలో భక్తులు దీక్షలు స్వీకరించి పుణ్యఫలాన్ని పొందుతున్నారు. 

అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి 

సకల విద్యలకు ఆది గురువైన మేధా దక్షిణామూర్తి రూపంలో కొలువు దీరిన కోటప్పకొండలో అక్షరాభ్యాసాలు చేయించడం శుభప్రదమైన అంశంగా పెద్దలు చెబుతారు. ఈ క్రమంలో బాసరలో మాదిరిగా కోటప్పకొండలో కొన్నేళ్ల క్రితం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ప్రారంభించారు. అంతే కాకుండా విజయదశమి, శ్రీపంచమి, అక్షయ తృతీయ పర్వదినాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు చేయించడం పరిపాటిగా మారింది. సాధారణ రోజుల్లో సైతం మేధా దక్షిణామూర్తి స్వామిని పూజించి అక్షరాభ్యాసాలు చేయిస్తారు. 

సకలసిద్ధులకు హోమాలు

కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి కేవలం జ్ఞానప్రదాతగానే కాకుండా కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా భక్తులు భావిస్తారు. అన్ని రకాల దోషాలను సైతం తొలగించే దాక్షిణ్యభావం త్రికోటేశ్వరుని రూపంలో ఇక్కడే దర్శనీయాంశం. స్వామి సంపూర్ణమైన కటాక్షం పొందేందుకు వేదపండితులు శ్రీమేధా దక్షిణామూర్తి హోమాలను నిర్వహిస్తారు,  ప్రతి గురువారం దేవస్థానంలోని యాగశాలలో హోమాలు చేస్తారు. పెద్దసంఖ్యలో భక్తులు హోమాలు చేయించుకుంటారు.

స్థల పురాణం ఇలా.. 

దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞం సందర్భంలో పరమేశ్వరుని సతీమణి దాక్షాయణి అవమానం పొంది దేహత్యాగం చేస్తుంది. దీనికి కోపించిన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యజ్ఞ ధ్వంసం చేయిస్తాడు. సతీవియోగంతో లోకసంచారం చేస్తున్న స్వామి మనసుకి శాంతి లభించలేదు. త్రికూటాద్రికి చేరిన తర్వాత మనసు శాంతించి బాలవటువుగా మారి 12 ఏళ్ల పాటు తపస్సు చేసి మేధా దక్షిణామూర్తిగా అవతరించి దేవతలకు, మునులకు జ్ఞానబోధ చేసినట్లు ఐతిహ్యం.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని