జ్ఞానులనే గమనిస్తారు

మండు వేసవి. గురుశిష్యులు గ్రామాంతరం వెళ్తున్నారు. ఓ కొలనులో నీళ్లు తాగి చెట్టుకింద సేద తీరుతున్నారు. శిష్యుడి దృష్టి కొలనులో విరిసిన తామరపూల మీద పడి ఒకటి కోయబోయాడు.అది చూసిన గురువు

Updated : 10 Mar 2022 05:07 IST

మండు వేసవి. గురుశిష్యులు గ్రామాంతరం వెళ్తున్నారు. ఓ కొలనులో నీళ్లు తాగి చెట్టుకింద సేద తీరుతున్నారు. శిష్యుడి దృష్టి కొలనులో విరిసిన తామరపూల మీద పడి ఒకటి కోయబోయాడు.
అది చూసిన గురువు ‘దానితో నీకేదైనా పనుందా?’ అని అడిగితే, ‘లేదు, అందాన్ని ఆస్వాదించాలని’ అన్నాడు శిష్యుడు.
‘ఆ పని దూరం నుంచే చేయొచ్చు కదా! అప్పుడు నీతోబాటు ఇంకొందరికి కనువిందు చేస్తాయి. తుంచేస్తే తర్వాతి వారు వాటిని ఆస్వాదించలేరుగా! కనుక అవసరం లేనివాటిని వృథా చేయడం మంచిది కాదు’ అన్నాడు గురువు. అది విని శిష్యుడు తనది పొరపాటేనని ఒప్పుకున్నాడు. గురువు చెట్టు కింద చెంగు పరచుకుని విశ్రమించాడు.
ఇంతలో ఒక వేటగాడు వచ్చి కొలనులో నీళ్లు తాగాడు. అంతలోనే స్నానం చేయబోతూ తామరపూలు అడ్డు రాగా వాటిని వేళ్లతో సహా పీకి గట్టుమీదికి విసిరేశాడు.
గురువు నిద్ర లేచాక జరిగిందంతా చెప్పి ‘గురువర్యా! నేను పూవు కోయబోతేనే తప్పన్నారు. మరి వేటగాడు వేళ్లతో సహా పీకేశాడు. అలా చేయొచ్చా?’ అన్నాడు.
గురువు నవ్వి ‘నాయనా! మూర్ఖులు చేసే పనులను ఏవగించుకుంటారే తప్ప ఎవరూ ఏమీ అనరు, అనలేరు. కానీ, జ్ఞానుల విషయం అలా కాదు. వాళ్లను చాలామంది గమనిస్తారు. అనుసరిస్తారు కూడా. పైగా మనకు సమాజం పట్ల బాధ్యత ఉంది. అందుకే నువ్వు అనుచితంగా ప్రవర్తించకూడదని వారించాను. లోక కల్యాణమే మన లక్ష్యం కావాలి’ అన్నాడు.

- కామేశ్వరీ హైందవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని