మనకెందుకులే అనుకుంటే...

శకుని, దుర్యోధనుడు ఆడిన కపట జూదంలో ధర్మరాజు బలిపశువుగా మారిపోయాడు. సకల సంపదలు, సోదరులతో సహా అర్ధాంగిని కూడా ఒడ్డి ఓడిపోయాడు. ధర్మజుడి ఈ దుస్థితిని అవకాశంగా తీసుకుని దుర్యోధనాదులు ద్రౌపది పరాభవానికి పూనుకున్నారు.

Published : 22 Sep 2022 00:47 IST

కుని, దుర్యోధనుడు ఆడిన కపట జూదంలో ధర్మరాజు బలిపశువుగా మారిపోయాడు. సకల సంపదలు, సోదరులతో సహా అర్ధాంగిని కూడా ఒడ్డి ఓడిపోయాడు. ధర్మజుడి ఈ దుస్థితిని అవకాశంగా తీసుకుని దుర్యోధనాదులు ద్రౌపది పరాభవానికి పూనుకున్నారు. ఆ పన్నాగంలో భాగంగా దుశ్శాసనుడు సభ్యత, సంస్కారాలు మరచి అమానుషంగా ఆమెని జుట్టుపట్టుకుని దారుణంగా సభామందిరానికి ఈడ్చుకొచ్చాడు. ఆ దుర్మార్గుడి దాష్టీకానికి పాండవ పత్ని చెదిరిన జుట్టుతో, వెలవెలబోయిన ముఖంతో కన్నీటిపర్యంతమైంది. భీష్ముడు, ధృతరాష్ట్రుడు వంటి కురువంశ మహామహులందరి వైపు దీనంగా చూస్తూ ‘పెద్దలారా! మీరంతా చూస్తుండగానే  ఈ దుశ్శాసనుడు నాపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. కండకావరంతో ఇలా ప్రవర్తించటం న్యాయమేనా? ధర్మాలన్నీ తెలిసిన మీరు దీన్ని సమర్థిస్తారా?’ అంటూ ఆవేదనతో నిలదీసింది. జరుగుతున్న ఘోరాన్ని కళ్లప్పగించి చూస్తున్నారే కానీ, ఒక్కరూ నోరుమెదపలేదు. చివరికి దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు ధర్మబద్ధుడై ప్రతిస్పందించాడు. ‘పక్షపాతం లేని బుద్ధిమంతులంతా పాంచాలి అడిగిన ప్రశ్నపై సమాలోచించాలి. మనకెందుకు లెమ్మని ఊరకుంటే అందరికీ అది నరకహేతువవుతుంది’ అన్నాడు. కానీ వికర్ణుడి మాటను ఎవరూ లెక్కచేయ లేదు. పరోక్షంగా దుర్యోధన, దుశ్శాసనాదు లను ప్రోత్సహిస్తున్నట్లుగా మౌనం వహించారు. కళ్ల ముందు జరుగుతున్న అధర్మాన్ని, అన్యాయాన్ని అడ్డుకోకపోతే తీవ్రపరిణామాల్ని ఎదుర్కోక తప్పదనడానికి కురుక్షేత్రమే సాక్ష్యం. అందుకే ‘అధర్మం ధర్మాన్ని చెరపట్టగా తీర్పుకోసం వస్తే, నిర్లక్ష్యంచేసిన సభ్యులకూ అధర్మ పీడన తప్పదు. భయంతోనో, బెరుకుతోనో అధర్మాన్ని గనుక అడ్డుకోకపోతే అందులో పావుభాగం సభ్యులకు, మరో పావు భాగం పాలకులకు, మిగిలిన సగభాగం కర్తకు సంక్రమిస్తుంది’ అని మహాభారతం స్పష్టం చేసింది. ఇది నేటికీ వర్తిస్తుంది. మన ఎదుట జరిగే అన్యాయాలు, అక్రమాలను మనకెందుకులే అనుకునే ఉదాసీన ధోరణి లేదా బాధ్యతా రాహిత్యం మానవత్వానికే విఘాతం. కనుకనే కౌరవుల పక్షపాతాన్ని ప్రతిఘటిస్తూ, స్థితప్రజ్ఞతకు సాకారమైన శ్రీకృష్ణ భగవానుడు ‘సారపు ధర్మమున్‌ విమల సత్యము పాపముచేత బొంకుచేబారము పొందలేక చెడబారినదైన యవస్థ, దక్షు లెవ్వారలుపేక్ష సేసిరది వారల చేటగు..’ అంటూ హెచ్చరించాడు. ‘దౌష్ట్యంతో ధర్మం, అసత్యంతో నిజం గట్టెక్కలేని దుస్థితిలో సమర్థులు ఉపేక్షిస్తే, అది వారి తప్పేనని, తుదకు కీడు తప్పదనేది భావం.  

- ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని