శపించబోతే..

సింధుదేశ రాజు వృద్ధక్షత్రుడికి లేకలేక కలిగిన కుమారుడు జయద్రథుడు. సైంధవుడిగా ప్రసిద్ధుడు. పుట్టగానే బలహీనంగా ఉన్నాడని తల్లిదండ్రులు బాధపడుతుంటే, అతడి తల తెగి చనిపోతాడని పలికింది ఆకాశవాణి.

Updated : 02 Feb 2023 12:54 IST

సింధుదేశ రాజు వృద్ధక్షత్రుడికి లేకలేక కలిగిన కుమారుడు జయద్రథుడు. సైంధవుడిగా ప్రసిద్ధుడు. పుట్టగానే బలహీనంగా ఉన్నాడని తల్లిదండ్రులు బాధపడుతుంటే, అతడి తల తెగి చనిపోతాడని పలికింది ఆకాశవాణి. ఆ తల ఎవరి చేతుల్లోంచి కింద పడుతుందో వారి తల వెయ్యిముక్కలవుతుంది అన్నాడు తపశ్శక్తి గల వృద్ధక్షత్రుడు. కాలక్రమంలో జయద్రథుడు బలం పుంజుకుని పెద్దవాడయ్యాడు. దుర్యోధనాదులతో మైత్రి చేశాడు. వారి చెల్లెలు దుస్సలని వివాహమాడాడు.

ఒకసారి ద్రౌపదిని చూసి మోహించి తనని వివాహం చేసుకోమన్నాడు. ఆమె కోపగించుకుంటే కొంగుపట్టి లాగి రథం ఎక్కించుకుని వెళ్లాడు. సంగతి తెలుసుకున్న పాండవులు సైంధవుణ్ణి వెంటాడి రథానికి కట్టేసి, ద్రౌపదిని విడిపించారు. భీముడు అతణ్ణి చంపబోతే తమ ఇంటి అల్లుడే కనుక చంపొద్దన్నాడు ధర్మరాజు. జయద్రథుడి తల గొరిగించి పాండవదాసుణ్ణని చెప్పుకోమన్నారు.

వమానభారంతో తపస్సు చేశాడతడు. శివుడు ప్రత్యక్షం కాగా పాండవులపై గెలిచేట్టు వరమడిగాడు. అర్జునుడు కాక తక్కినవారిని ఒక్కరోజు మాత్రం గెలవగలవన్నాడు మహాశివుడు. అలా పద్మవ్యూహంలో యుద్ధం చేస్తున్న అభిమన్యుణ్ణి నలుగురు పాండవులు సమీపించకుండా జయద్రథుడు అడ్డుకున్నాడు. అభిమన్యుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహించిన అర్జునుడు మర్నాడు సూర్యాస్తమయం లోపు అభిమన్యుడి మరణానికి కారణమైన జయద్రథుణ్ణి చంపకపోతే తాను చనిపోతానని ఒట్టుపెట్టుకున్నాడు. కౌరవులు అతడు ఎవరి కంటా పడకుండా దాచారు. కృష్ణుడు సుదర్శనచక్రాన్ని సూర్యుడికి అడ్డుపెట్టి చీకటి కమ్మేలా చేశాడు. రాత్రి అనుకుని బయటికొచ్చిన జయద్రథుడి తల నరికాడు అర్జునుడు. కృష్ణుడి సూచనతో ఆ తలని ఆకాశంలో నిలిపి, పాశుపతాస్త్రంతో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్న వృద్ధక్షత్రుడి దోసిలిలో పడేట్టు చేశాడు. అదేమిటో అర్థం కాక కింద పడేసిన వృద్ధక్షత్రుడి తల వెయ్యిముక్కలైంది. అతడే తొందరపాటుతో ఇచ్చిన శాపఫలితమది.

 రాహుల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని