ఆధ్యాత్మికతకు ఆలవాలం ధనుర్మాసం

సూర్యభగవానుడు  ధనుస్సు రాశిలో ప్రవేశించి, కొంతకాలం ఆ రాశిలో ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మార్గశిర మాసంలోనే ధనుర్మాసం సాగుతుంది. పూజలూ, ప్రార్థనలతో ప్రాధాన్యతను సంతరించుకుంది ధనుర్మాసం.

Updated : 14 Dec 2023 03:54 IST

సూర్యభగవానుడు  ధనుస్సు రాశిలో ప్రవేశించి, కొంతకాలం ఆ రాశిలో ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మార్గశిర మాసంలోనే ధనుర్మాసం సాగుతుంది. పూజలూ, ప్రార్థనలతో ప్రాధాన్యతను సంతరించుకుంది ధనుర్మాసం.

 మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే అన్ని మాసాల్లోకీ మార్గశిరమాసం అంటే శ్రీమహావిష్ణువునకు ఎంతో ప్రీతికరమైంది అన్నమాట. ఈ మాసంలో మధుసూదనుడిగా పూజలందుకొంటాడు భక్తవరదుడైన శ్రీమన్నారాయణుడు. ఎవరైతే ఈ మాసంలో విష్ణుపూజ చేస్తారో, వారికి వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుంది. లోకవ్యవహారంగా చూస్తే.. ఇది చలికాలం. ఈ వాతావరణానికి ముడుచుకుపోయి నడుస్తాం. ముఖ్యంగా వృద్ధులకు నడుం వంగిపోతుంది. ధనుస్సులా (విల్లు) వంగేలా చేసే మాసం కాబట్టి ఇది ధనుర్మాసం అయ్యిందంటారు. శ్రీహరి సత్వగుణ సంపన్నుడు. అందుకే ఆ స్వామికి ఇష్టమైన ధనుర్మాసం- సాత్త్విక ఆరాధనలకు పెట్టింది పేరు. ఎన్నో, ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన, కలిగించగలిగిన మాసమిది.

 సూర్యుడు, విష్ణువు ఒక్కరే

శ్రీహరితో పాటు సూర్యదేవుడికి కూడా మహా ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. ఈ మాసంలో సూర్యనమస్కారాలు చేసిన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆదిత్యుడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు అంటున్నాయి పురాణాలు. భానుడు నమస్కార ప్రియుడు. అందువల్ల సూర్యుడికి నమస్కరిస్తే- ఆరోగ్యంతో పాటు విజయాలను అందిస్తాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అగస్త్యమహర్షి వద్ద ఉపదేశం పొంది, ఆదిత్య హృదయంతో సూర్యదేవుణ్ణి ఉపాసించాడు. రావణ వధ చేసి, విజయాన్ని పొందాడు. విశేషించి ధనుర్మాసంలో నిత్యం నమస్కరిస్తే- సూర్యుడు మరికాస్త ఎక్కువగానే అనుగ్రహిస్తాడు. అసలు- సూర్యుడు, విష్ణువు ఒక్కరేనని, సూర్యబింబంలోనే విష్ణుమూర్తి నిలిచి ఉంటాడని వేదాలు చెబుతున్నాయి. అందుకే సూర్యదేవుని- సూర్యనారాయణుడు, ప్రత్యక్ష నారాయణుడు అంటూ వ్యత్యాసం లేకుండా ఆరాధిస్తారు. అందువల్ల ధనుర్మాసం- సూర్య భగవానుడికి, శ్రీహరికి సరిసమానమైన ప్రాధాన్యత కలిగిన మాసం.

మంచి భర్త రావాలని..

జగన్మాత లక్ష్మీదేవి అంశతో గోదాదేవి జన్మించి, శ్రీహరిని ధ్యానించింది. ధనుర్మాస వ్రతం ఆచరించి, జగన్నాయకుడైన ఆ హరిని తన నాయకుడిగా పొందింది. ధనుర్మాసానికి ఇంతటి ఆరాధనా ప్రాధాన్యం కలగడానికి ఇదొక కారణం. ఈ వ్రతాన్ని శ్రీవ్రతం, సిరినోము అంటారు. బ్రహ్మాండ, భాగవత పురాణాల్లో ఈ వ్రతం గురించిన వివరణ వివరంగా ఉంది. లోక కల్యాణం కోసం జగన్మాతాపితలు (జగత్తుకు తల్లిదండ్రులైన గోదా రంగనాయకులు) కల్యాణం చేసుకున్న మాసం ఇది. కనుక సామాన్య మానవులు ఈ మాసంలో వివాహం చేసుకో కూడదనే నియమం ఉంది. ధనుర్మాస వ్రత విధానాన్ని సృష్టికర్త బ్రహ్మదేవుడే- నారద మునీంద్రుడికి చెప్పాడని, ఆ తర్వాత గోదామాత అందిపుచ్చుకుందని పురాణోక్తి. గరుడుని కోరిక ప్రకారం శ్రీమహాలక్ష్మి- సంతానలక్ష్మిగా అనుగ్రహించింది. గరుడుని అవతారమైన విష్ణుచిత్తునికి చిన్నారిగా దొరికి, అతడి వద్దే పెరిగి గోదాదేవిగా పూజలందుకుంటోంది.
గోదాదేవి ‘తిరుప్పావై’ రచించి శ్రీమహావిష్ణువును ఆరాధించింది ఈ మాసంలోనే. ఈ గ్రంథంలోని పాశురాలు పాడుకోవడానికి అనుగుణంగా, లయబద్ధంగా సాగుతాయి. తిరుప్పావై అంటే పవిత్ర వ్రతం అని అర్థం. నేటికీ ధనుర్మాసంలో స్త్రీలు, ముఖ్యంగా పెళ్లి కావలసిన కన్యలు ఈ పాశురాలను పాడి, భగవంతుని ఆరాధిస్తారు. ఫలితంగా తమకు మంచి భర్త లభిస్తాడని విశ్వసిస్తారు.
దైవారాధనకి ధనుర్మాసం ప్రధానమైంది కనుక.. నిత్యం దీపారాధన చేస్తారు. దీపలక్ష్మికి నమస్కరించిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభిస్తారు. కార్తిక స్నానాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, ధనుర్మాస స్నానాలకీ అంతే ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ మాసంలో దానాలు చేస్తే. ఫలితం మోక్షమే. హోమాలు, వ్రతాలు, పూజలు.. ఇలా దైవకార్యాలన్నిటికీ ధనుర్మాసం ఉత్తమమైంది.

ముగ్గుల ఆంతర్యం

ధనుర్మాసంలో రంగవల్లులకు (ముగ్గులు) ఉన్న విశేషం ఏ ఇతర మాసానికీ లేదు. అందాలతో అలరారుతూ కనులకు విందు చేసే ముగ్గులకు పవిత్ర స్థానం ఇస్తారు. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే- మన పండుగలు, దైవకార్యాలు, స్నాన భోజనాది అంశాల్లో అంతర్గతంగా ఇమిడి ఉన్నవి ఆరోగ్య సూత్రాలే. ధనుర్మాసంలో చలి ఉన్నప్పటికీ చల్లనినీటితో స్నానం చేయమంటారు. ఆ నీళ్లలో అంతర్లీనంగా విద్యుత్‌ ఉంటుంది కనుక.. శరీరానికి శక్తి, ఉత్సాహం కలుగుతాయి. ఇక రంగవల్లుల విషయానికి వస్తే.. సున్నంతో ముగ్గులు వేసి, పేడనీటితో కళ్లాపి చల్లి, కుంకుమ, పసుపు అద్దిన గొబ్బెమ్మలను అమర్చడం వల్ల క్రిమి కీటకాలు లోనికి రావు. అలా మన ఆరోగ్యం పదిలం. ముగ్గుల్లో పూలు చల్లడం, గుమ్మాలకు పూలదండలు వేయడంతో ఇల్లూవాకిలి సువాసనా భరితమౌతాయి. బియ్యప్పిండి చీమ లకు ఆహారమవుతుంది. ఇందులో దైవికార్థాన్ని గుర్తించినట్లయితే.. ముగ్గు, పేడ, పూలల్లో లక్ష్మీదేవి ఉంటుందన్నది పెద్దల మాట. అలా సిరి మన వాకిట నడయాడుతూ సంపదలను అనుగ్రహిస్తుంది. ‘పెద్దల మాట చద్దన్నం మూట’ అన్నారు. అనుసరించి ఆనందించడం మన కర్తవ్యం కదా!

రక్షణ కల్పించే భోగిపళ్లు

కొందరు ధనుర్మాసంలోనే బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. అనేక వరుసల్లో దేవతా విగ్రహాలు, వనజీవుల బొమ్మలు, పుష్ప గుచ్ఛాలు, కృత్రిమ జలపాతాలు, మరెన్నో బొమ్మలు అమరుస్తారు. సాయం సంధ్యా సమయంలో బొమ్మలకు హారతిచ్చి వేడుక చేస్తారు. వాయనాలు, తీపి వంటకాలతో ఇంటికి కొత్త కళను, శోభను తెస్తారు. అందం రెట్టింపవడమే కాకుండా దిష్టి పోతుందని నమ్ముతారు.
ధనుర్మాసం భోగి పండుగనాటి వరకే ఉంటుంది. మరునాడు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. కానీ సంక్రాంతి వరకూ ధనుర్మాస ప్రభావం ఉంటుంది. భోగినాడు రేగుపళ్లు, నాణేలు, అక్షింతలతో చిన్నారులకు భోగిపళ్లు పోసి.. హారతిచ్చి ఆశీర్వదిస్తారు. రేగుపళ్లు తలకు తాకితే ఆయురారోగ్యాలు లభిస్తాయని, పిల్లలకు దృష్టి దోషం తగలకుండా రక్షణ కలుగుతుందని నమ్మకం.
ఈ మాసంలో విష్ణు ఆలయాలు పాశుర ఆలాపనలు, నివేదనలు, ప్రసాదాలు, దీపాలంకరణలతో కాంతులీనుతూ ఉంటాయి. నివేదనల్లో కట్టె పొంగలి, చక్ర పొంగలి, పులగం, పులిహోర, పాయసం, దధ్ద్యోదనం తప్పనిసరిగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చేవే. ఇలాంటి ఆహారంతో సత్వగుణం, దైవ కార్యాలతో ప్రశాంతచిత్తం అలవడతాయి. అలాంటి ధనుర్మాసం ఆధ్యాత్మికతకు ఆలవాలం, భక్తుల శరణాగతికి ప్రతీక.
డా.పి.లలితవాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని