దేవతలంతా ఒక్కచోట...

ఆ ఊళ్లో రెండో మూడో కాదు.. ఏకంగా 54 ఆలయాలు ఒకే దగ్గర ఉన్నాయి. అదే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలోని ఓం శక్తిపీఠం. అయిదెకరాల విస్తీర్ణంలో దేశంలోని ప్రముఖ శైవ, వైష్ణవ ఆలయాలు, శక్తిపీఠాల ..

Updated : 16 Dec 2021 04:16 IST

ఊళ్లో రెండో మూడో కాదు.. ఏకంగా 54 ఆలయాలు ఒకే దగ్గర ఉన్నాయి. అదే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలోని ఓం శక్తిపీఠం. అయిదెకరాల విస్తీర్ణంలో దేశంలోని ప్రముఖ శైవ, వైష్ణవ ఆలయాలు, శక్తిపీఠాల నమూనాలను నిర్మించి ఆయా దేవతలను ఇక్కడ కొలువు దీర్చారు. ఆయా ప్రాంతాల్లో ఏ విధమైన పూజలు నిర్వహిస్తారో, ఏయే నైవేద్యాలు నివేదిస్తారో.. అలాగే ఇక్కడ జరుగుతాయి. ఈ పీఠాన్ని దర్శిస్తే సంపూర్ణ భారత ఆధ్యాత్మిక యాత్ర చేసిన అనుభూతి లభిస్తుంది.

గాదరాడకు చెందిన ఒక భక్తుడి సంకల్పానికి దైవానుగ్రహం తోడై ఈ సర్వదేవతాలయం రూపుదిద్దుకుంది. ఇక్కడ 54 మందిరాల్లో 84 దేవతా మూర్తులను ప్రతిష్ఠించారు. 21 కైలాస క్షేత్రాలు, 15 వైకుంఠ క్షేత్రాలు, 18 శక్తిపీఠాలతో మూడు భాగాలుగా ఉంటుంది. కైలాస క్షేత్రాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు శివ పరివార దేవతలు కొలువయ్యారు. శైవాగమాల ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తారు. వైకుంఠ క్షేత్రాల్లో శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, సత్యనారాయణస్వామి, సూర్య భగవానుడు తదితర విష్ణుస్వరూపాలకు ఆలయాలున్నాయి. ఇక్కడ వైఖానస ఆగమం (హిందూ సంప్రదాయాల్లో ఒకటి) ప్రకారం పూజలు జరుగుతాయి. సరస్వతి, లక్ష్మి, గౌరి తదితర శక్తి స్వరూపాలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించారు. కోవెల ప్రాంగణంలో కోనేరు మధ్యలోని 32 అడుగుల అర్ధనారీశ్వర స్వామి విగ్రహం, ఆలయ గోడలపై క్షీరసాగర మథనం, గోవర్థనగిరిని చిటికెన వేలితో ఎత్తిన కృష్ణుడు, గోపికా వస్త్రాపహరణ, శ్రీనివాస కల్యాణ ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణ. ఏడాది పొడవునా వచ్చే పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. కమిటీ సభ్యులు గోశాలను నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి 30 కి.మీ దూరం ఉండే గాదరాడకు బస్సు సౌకర్యం ఉంది.

- ఎ.ఎం.నాగప్రసాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని