పూజలు చేయ పూలు తెచ్చాము...

పూలు లేని పూజకు పరిపూర్ణత రాదు. పూజకి నోచని పూలకు సార్థకత లేదు. పూజది, పూలది అవినాభావ సంబంధం.

Updated : 27 Oct 2022 01:23 IST

నవంబరు 1 తిరుమల పుష్పయాగ మహోత్సవం

పూలు లేని పూజకు పరిపూర్ణత రాదు. పూజకి నోచని పూలకు సార్థకత లేదు. పూజది, పూలది అవినాభావ సంబంధం. మనం ప్రేమతో సమర్పించే పత్రం, పుష్పం, ఫలం, తోయం తనకు ప్రియాతి ప్రియమన్నాడు పరమాత్మ. వాటిలో విరులది విశేషస్థానం. అందుకే భక్తులకు పూలను దేవుడికి అర్పించాలనిపిస్తుందే కానీ ఆఘ్రాణించాలనిపించదు. ఆ భక్తిప్రపత్తులకు ప్రతీక తిరుమలలో చేసే పుష్పయాగం.
కార్తికమాసంలో శ్రవణా నక్షత్రం రోజున ‘పుష్పయాగం’ నిర్వహిస్తారు. ఆరోజు ఆనందనిలయంలో మూలవిరాట్టుకు సుప్రభాత కైంకర్యాలు పూర్తయ్యాక ఉత్సవమూర్తి మలయప్ప స్వామిని పుష్పయాగ మండపానికి తీసుకొచ్చి సుగంధజలాలతో అభిషేకిస్తారు. తర్వాత సుమారు రెండు వేల కిలోల బరువైన, చంపకం, మల్లిక, తులసి, కుముదం, కరవీరం, నంద్యావర్తం, పలాశకర్ణిక, మందార, అతసీ, కేతకీ, వకులార్జున, పున్నాగ, మాధవి, పిండీతకీ, ద్వికర్ణిక, బహుకర్ణిక, కురువ, నాగవృక్ష, కనకం, కర్ణికారం, బంధూకం, కృష్ణతులసి, సూర్యనంద, కకుభోదుంబరం, కంకణి, అగ్రకర్ణిక, కాలనంద అనే 27రకాల పరిమళభరిత పుష్పాలూ పత్రాలతో స్వామిని అర్చిస్తారు.
పుష్పయాగం వల్ల గతమాసం బ్రహ్మోత్సవంలో తెలిసీతెలియక చేసిన దోషాలు ఉపశమిస్తాయంటారు. అన్నమాచార్యులు ‘పూజలందరు చేసేదే పుష్పయాగము’ కీర్తనలో సుమధుర పదాలతో పుష్పయాగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

- బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని