సైంధవుడిలా అడ్డుకోవడమంటే.

దుర్యోధనుడి సోదరి దుస్సల భర్త జయద్రథుడు. అతడికే సైంధవుడు అనే మరో పేరుంది. పాండు పుత్రుల మీద విజయం సాధించేందుకు పద్మవ్యూహం రచించాడు ద్రోణుడు.

Updated : 14 Sep 2023 06:46 IST

దుర్యోధనుడి సోదరి దుస్సల భర్త జయద్రథుడు. అతడికే సైంధవుడు అనే మరో పేరుంది. పాండు పుత్రుల మీద విజయం సాధించేందుకు పద్మవ్యూహం రచించాడు ద్రోణుడు. దాన్ని ఛేదించగల యోధుడు అర్జునుడు మాత్రమే. అతణ్ణి కనుక దూరంగా పంపించేస్తే- మరో యోధుడెవరైనా పద్మవ్యూహంలో చిక్కుకుంటాడన్నది పన్నాగం. అందుకే యుద్ధానికి పిలిచి అర్జునుని దూరంగా తీసుకెళ్లారు సంశప్తకులు.

పద్మవ్యూహం గురించి తెలిసిన అర్జునుడు లేకపోవడంతో అభిమన్యుణ్ణి లోపలికి పంపాడు ధర్మరాజు. తామంతా వెనుకే వచ్చి సహాయపడతా మన్నాడు. కానీ మరెవ్వరూ అనుసరించకుండా అడ్డుకున్నాడు సైంధవుడు. అతడికి పాండవులను అడ్డగించే శక్తి కలగడానికి ఒక కారణముంది. వనవాసకాలంలో ద్రౌపదిని అవమానించాడు సైంధవుడు. దాంతో భీముడు ఆగ్రహించి దారుణంగా కొట్టి ప్రాణాలతో వదిలాడు. అలా భంగపడిన సైంధవుడు పాండవుల మీద కక్ష పెంచుకున్నాడు.  ఆ పగ తీరేందుకు తపస్సు చేసి- ఒక్కరోజైనా పాండవులను అడ్డగించగలిగేలా ఈశ్వరుణ్ణి వరమడిగాడు. అర్జునుణ్ణి తప్ప మిగిలిన వారిని అడ్డగించగలిగేలా వరం ప్రసాదించాడు పరమశివుడు. ఆ వరం వల్లే పద్మవ్యూహంలో మరెవరూ ప్రవేశించకుండా అడ్డుకున్నాడు సైంధవుడు. అందుకే ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు- దాన్ని సాగనీయకుంటే.. ‘సైంధవుడిలా అడ్డుకుంటున్నాడు’- అంటారు.

శరత్‌ చంద్రిక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని