ఆన్‌లైన్‌, కరెంట్‌ బుకింగ్‌తో వసతి

శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు సులభంగా, వేగంగా వసతి కల్పించేందుకు తితిదే ఐటీ విభాగం ఇటీవల ‘అకామిడేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ విధానాన్ని అమలులోకి తెచ్చింది...

Published : 07 Nov 2021 15:18 IST

న్యూస్‌టుడే, తిరుమల: శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు సులభంగా, వేగంగా వసతి కల్పించేందుకు తితిదే ఐటీ విభాగం ఇటీవల ‘అకామిడేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ విధానాన్ని అమలులోకి తెచ్చింది. తిరుమలలో దాదాపు ఏడు వేల గదులు ఉన్నాయి. అందులో ఆరువేల వరకు భక్తులకు అందుబాటులో ఉండగా ప్రస్తుతం కొన్నింటికి మరమ్మతులు చేపట్టారు. భక్తులు తిరుమలకు వచ్చేందుకు అవసరమైన గదులను తితిదే వెబ్‌సైట్‌ ‌www.tirupatibalaji.ap.gov.in ద్వారా కానీ, గోవిందం యాప్‌ ద్వారా కానీ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో తిరుమలలో గదులను బుక్‌చేసుకున్న భక్తుల కోసం తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్‌, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లోని కౌంటర్లను ఏర్పాటు చేశారు. తిరుమలకు రోడ్డుమార్గంలో వెళ్లేవారికి 30 నిమిషాల్లో ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అలిపిరి మార్గంలోని వారికి మూడు గంటల్లో, శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్లేవారికి ఒక గంటలో ఎస్‌ఎంఎస్‌ వస్తుందని తితిదే అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో గదులు అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ చేసుకున్న భక్తులు అలిపిరిలో స్కాన్‌ చేసుకున్న వెంటనే తిరుమలలోని ఉపవిచారణ కార్యాలయం వివరాలు ఉంటాయి. భక్తులు నేరుగా ఆ కార్యాలయానికి వెళ్లి గదులు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఏసీ, నాన్‌ ఏసీ కింద గదులు బుక్‌ చేసుకోవచ్చు. అంతే మొత్తంలో కాషన్‌ డిపాజిట్‌ చెల్లించాలి.


ప్రతి గురువారం.. నేత్ర దర్శనం

తిరుమలలో నామధారణకు ఎక్కడా లేనటువంటి వైశిష్ట్యం ఉంది. సాధారణంగా వైష్ణవుల్లో వంగలై, తెంగలై అనే రెండు తెగల వారున్నారు. వంగలైకు చెందిన వైష్ణవులు ఆంగ్ల వర్ణమాలలోని ‘యు’ ఆకారంలో ఊర్థ్వపుండ్రాలుగా దిద్దుకుంటే, తెంగలై వర్గీయులు ‘వై’ ఆకారంలో తిరునామం ధరిస్తారు. వైష్ణవ తెగల మధ్య విపరీతమైన బేధభావం ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరు వారి నామాన్ని చూసి ఇట్టే గుర్తించే వీలుంటుంది. వాటికి భిన్నంగా ఓ కొత్త ఒరవడి సృష్టిస్తూ శ్రీవారి నుదుటున దిద్దే నామం ‘యు’, ‘వై’ ఆకారాలకు మధ్యస్తంగా ఉంటుంది. స్వామివారి నామాన్ని తిరుమణికాపు అంటారు. సంప్రదాయంగా మూలవిరాట్టుకు వారానికి ఒకసారి మాత్రమే కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత నామాన్ని ధరించడానికి 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులాల కస్తూరి వాడతారు. బ్రహ్మోత్సవాల సమయంలో, అంతకు ముందు వచ్చే శుక్రవారం మాత్రం 32 తులాల పచ్చకర్పూరం, మూడు తులాల కస్తూరిని వినియోగిస్తారు. ప్రతి గురువారం సడలింపు సమయంలో స్వామి కనులు కనిపించేలా నామాన్ని కొంత మేర తగ్గిస్తారు. ఈ సమయంలో స్వామిని తిలకించడాన్నే నేత్ర దర్శనంగా భక్తులు పిలుస్తారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని