వాతావరణశాస్త్ర కోర్సు ఎక్కడ?

ఎమ్మెస్సీ అప్లైడ్‌ ఫిజిక్స్‌ పూర్తి చేశా. ఇప్పుడు వాతావరణశాస్త్రంలో (మీటీయొరాలజీ) పీజీ/డిప్లొమా చేయవచ్చా?

Updated : 06 Sep 2021 06:26 IST

ఎమ్మెస్సీ అప్లైడ్‌ ఫిజిక్స్‌ పూర్తి చేశా. ఇప్పుడు వాతావరణశాస్త్రంలో (మీటీయొరాలజీ) పీజీ/డిప్లొమా చేయవచ్చా?

- ఎం.సునీత

* మీటీయొరాలజీ కోర్సులో వాతావరణ పరిశీలనల రికార్డింగ్‌, వాతావరణ డేటాను విశ్లేషించడం, వాతావరణ వ్యవస్థల అంచనాకు కావాల్సిన సాంకేతికత పరికరాలపై శిక్షణ అందిస్తారు. వీటితో పాటుగా ఉష్ణమండల తుపానులు, పట్టణ వరదలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు, కరువు, భూకంపాలు, వేడి తరంగాలు, చల్లని తరంగాలు, రిమోట్‌ సెన్సింగ్‌, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్‌), వాతావరణ రాడార్లు, వాతావరణ ఉపగ్రహాల ప్రత్యేకత, రోజువారీ వాతావరణ మార్పులు, భూతాప ప్రభావాల గురించీ నేర్చు కొంటారు. మీరు డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్‌ చదివారు కాబట్టి మీటీయొరాలజీ కోర్సులో పీజీ/ డిప్లొమా చదవడానికి అర్హులే.

వాతావరణ శాస్త్రం లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను దూరవిద్యలో కాకుండా రెగ్యులర్‌గా చదవడమే మంచిది. డిప్లొమా కంటే పీజీ చదివితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. మీటీయొరాలజీలో పీజీ కోర్సు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఆంధ్ర యూనివర్సిటీ, కొచ్చిన్‌ యూనివర్సిటీ, బెర్హాంపుర్‌ లాంటిచోట్ల అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. ఎమ్మెస్సీ చదివారు కాబట్టి గేట్‌ రాసి ఎంటెక్‌ కోర్సు చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీటీయొరాలజీలో ఎంటెక్‌ కోర్సు ఐఐఎస్సీ బెంగళూర్‌, ఐఐటీ దిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ భువనేశ్వర్‌, సావిత్రిబాయి ఫూలే పుణె వర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కొచ్చిన్‌ యూనివర్సిటీలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో అందుబాటులో ఉంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని