ఉన్నత విద్యకు ఏ అవకాశాలు?

ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ లైవ్‌స్టాక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డైరీయింగ్‌ చదువుతున్నాను. ఈ కోర్సు తర్వాత ఉన్నత విద్యావకాశాలు ఏముంటాయి?

Updated : 21 Mar 2022 06:12 IST

ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ లైవ్‌స్టాక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డైరీయింగ్‌ చదువుతున్నాను. ఈ కోర్సు తర్వాత ఉన్నత విద్యావకాశాలు ఏముంటాయి?

- కె. స్వామి

మారుతున్న పర్యావరణ, వాతావరణ పరిస్థితుల వల్ల మానవులతోపాటు జంతువులూ ఎన్నో మార్పులకు గురి అవుతున్నాయి. ఈ కారణంగా పాడి పరిశ్రమ ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ మార్పుల దృష్ట్యా సంప్రదాయిక పశువుల పెంపకానికి ఆధునిక విజ్ఞానాన్ని జోడించి లైవ్‌స్టాక్‌ అండ్‌ డెయిరీ మేనేజ్‌మెంట్‌ కోర్సును ప్రవేశపెట్టారు. పాడి పరిశ్రమ, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సులో పదో తరగతి అర్హతతో చేరవచ్చు. పూర్తి చేసినవారికి మంచి ఉద్యోగ, ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తరువాత డిప్లొమా అర్హతతో బ్యాచిలర్‌ ఇన్‌ లైవ్‌స్టాక్‌ మేనేజ్‌మెంట్‌,  బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ లాంటి కోర్సులను ఎంచుకొని ఉన్నత విద్య అభ్యసించవచ్చు. ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే- ఈ కోర్సు పూర్తి చేసినవారికి పాల కేంద్రాల్లో, అభయారణ్యాల్లో, పశువుల పరిశోధన కేంద్రాల్లో ఉపాధి లభిస్తుంది. డెయిరీ ప్రొడక్షన్‌ మేనేజర్‌, యానిమల్‌ హజ్బెండరీ సూపర్‌ వైజర్‌, యానిమల్‌ హజ్బెండరీ క్లర్క్‌ లాంటి ఉద్యోగ అవకాశాలుంటాయి.

పాడి పరిశ్రమ, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉంటే పదో తరగతి అర్హతతో ఈ కోర్సులో చేరవచ్చు.


దూరవిద్యలో జియాలజి

జియాలజీ సబ్జెక్టును దూరవిద్యలో చదివే అవకాశం ఉందా?

- షేక్‌ సుభానీ

భూగర్భశాస్త్రం (జియాలజీ)లో భూమి ఉపరితలం, భూ వ్యవస్థ పనితీరును అధ్యయనం చేస్తారు. ఆధునిక భూగర్భ శాస్త్రం, హైడ్రాలజీ, వాతావరణ శాస్త్రాలతో పాటు ఇతర భూ శాస్త్రాల విషయాల గురించీ విపులంగా నేర్చుకొంటారు. ఈ కోర్సు చదివేవారు తరగతి బోధనతో పాటు, ప్రయోగశాలలో, క్షేత్రస్థాయిలో చాలా ప్రయోగాలు చేయాల్సివుంటుంది. ఈ రంగంలో రాణించాలంటే విషయపరిజ్ఞానంతో పాటు వివిధ రకాల ప్రాక్టికల్‌ నైపుణ్యాలను కూడా పొందవలసిన అవసరం ఉంది. ఈ ప్రత్యేక లక్షణాల దృష్ట్యా ఈ కోర్సును రెగ్యులర్‌గా చదవడమే ఉపయోగకరం. ప్రస్తుతానికైతే జియాలజీ కోర్సు దూరవిద్యలో అందుబాటులో లేదు. భవిష్యత్తులో ఎవరైనా ఈ కోర్సును దూరవిద్యలో అందిస్తామని ప్రకటిస్తే, ఆ సంస్థ విశ్వసనీయత, అది అందించే డిగ్రీల చెల్లుబాటు గురించి నిర్ధారించుకొన్న తరువాతే నిర్ణయం తీసుకోండి.


- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని