సరసమైన ధరలో సరుకు సరఫరా!

అనాదిగా అంతర్జాతీయ వాణిజ్యం సముద్రాల ద్వారానే సాగుతోంది. ఆధునిక కాలంలో సాంకేతికత  పెరిగి వేగవంతమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ జల రవాణా ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు.

Published : 04 May 2023 01:51 IST

ఇండియన్‌ జాగ్రఫీ

అనాదిగా అంతర్జాతీయ వాణిజ్యం సముద్రాల ద్వారానే సాగుతోంది. ఆధునిక కాలంలో సాంకేతికత  పెరిగి వేగవంతమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ జల రవాణా ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిమాణంలో సరుకు సరఫరాకు జలమార్గాలు అత్యంత అనుకూలమైనవి. మూడు వైపుల సముద్రాలు, అంతర్గతంగా అనేక నదులతో కూడిన మన దేశం ఇటీవల జల రవాణాను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇక్కడి జల మార్గాలు, ప్రధాన ఓడరేవులు, సంబంధిత ప్రాజెక్టులను సమగ్రంగా అధ్యయనం చేయాలి.

జలమార్గాలు

భారతదేశంలో రైల్వేలు ప్రవేశపెట్టకముందు జల రవాణానే ముఖ్య  పాత్ర పోషించింది. ఇందులో కాలుష్యం తక్కువ, ఉపాధి కల్పన ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఒక లీటరు ఇంధనంతో కిలోమీటరు దూరం వరకు రోడ్డుపై అయితే 24 టన్నుల సరకును తరలించవచ్చు. అదే రైలు రవాణాలో 94 టన్నులు తీసుకెళ్లవచ్చు. జలమార్గంలో ఏకంగా 215 టన్నులు రవాణా చేయవచ్చు. కానీ వేగం తక్కువ.

భారతదేశ అంతస్థలీయ జలమార్గాల అథారిటీ సంస్థ (ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) 1986లో ఏర్పాటైంది. జలమార్గాల చట్టం-2016 ప్రకారం దేశంలో 111 అంతస్థలీయ జలమార్గాలను

‘జాతీయ జలమార్గాలు’గా ప్రకటించారు. ఇందులో 106 జలమార్గాలను 2016లోనే కొత్తగా రూపొందించారు. వీటి కింద మొత్తం 20,275 కి.మీ. మార్గాన్ని గుర్తించారు.

రెండు రకాలు: జల మార్గాలు అంతర్జాతీయ, అంతస్థలీయ అని రెండు రకాలున్నాయి. భారత్‌తో సంబంధం ఉన్న అంతర్జాతీయ జలమార్గాల్లో ముఖ్యమైనవి సూయజ్‌, పనామా కాలువ మార్గాలు.

సూయజ్‌ కాలువ: భారత్‌ను ఐరోపా దేశాలతో కలుపుతుంది. మన ఎగుమతి, దిగుమతుల్లో సుమారు 75 శాతం దీని ద్వారానే జరుగుతోంది. దీని వల్ల ముంబయి - లండన్‌ల మధ్య 7,040 కి.మీ, లండన్‌ - సింగపూర్‌ మధ్య 5,336 కి.మీ, లండన్‌- కోల్‌కతా మధ్య 5,627 కి.మీ. దూరం తగ్గింది. ఆసియా, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా నుంచి ఐరోపా దేశాలకు ఇదే ప్రధాన నౌకామార్గం.

పనామా కాలువ: పసిఫిక్‌, అట్లాంటిక్‌ మహాసముద్రాలను కలుపుతుంది. ఈ కాలువ ప్రారంభంతో వివిధ దేశాల మధ్య 4 వేల కి.మీ. నుంచి 12 వేల కి.మీ. దూరం తగ్గింది. దక్షిణ అమెరికా పశ్చిమ తీర ప్రాంత దేశాలకు, ఆ ఖండానికి తూర్పున ఉన్న ఓడరేవులకు మధ్య వ్యాపారం, రాకపోకలు పెరిగాయి. దీంతో పసిఫిక్‌ మహాసముద్రంలో నౌకల రద్దీ పెరిగింది.

ముఖ్యమైన ఓడరేవులు

అంతర్జాతీయ జలరవాణాలో ఓడరేవులు లేదా నౌకాశ్రయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సముద్రాన్ని, భూభాగంతో కలిపే ముఖద్వారం ఓడరేవు. మన దేశంలోని ఓడరేవుల్లో ప్రధానమైనవి 13. వీటిలో అరేబియా తీరంలో 6, బంగాళాఖాతంలో 6, అండమాన్‌ దీవుల్లో ఒకటి ఉన్నాయి.

1) దీన్‌దయాళ్‌/ కాండ్లా ఓడరేవు: స్వాతంత్య్రానంతరం ఏర్పాటైన మొదటి ఓడరేవు ఇది. దీన్ని ‘బేబీ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌’ అని కూడా అంటారు. గుజరాత్‌లోని కచ్‌ సింధు శాఖలో 1955లో ఏర్పాటు చేశారు. దేశంలోని ఒకే ఒక టైడల్‌ ఓడరేవు.
2) ముంబయి: దేశంలోని సహజసిద్ధమైన, పెద్ద ఓడరేవు. అత్యంత రద్దీగా ఉంటుంది. 1869లో సూయజ్‌ కాలువ విస్తరణ తర్వాత దీని ప్రాధాన్యం పెరిగింది.
3) జవహర్‌లాల్‌ నెహ్రూ ఓడరేవు/ నవసేన ఓడరేవు: దీన్ని 1989లో ప్రారంభించారు. ముంబయి ఓడరేవుపై ఒత్తిడి తగ్గించడానికి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీఓటీ పద్ధతిలో నిర్మించారు. ఇక్కడి నుంచి ప్రధానంగా వస్త్రాల ఎగుమతి జరుగుతుంది.
4) మర్మగోవా: గోవాలో జువారి నదికి ఎడమవైపున ఈ ఓడరేవు ఉంటుంది. ప్రధానంగా ఇనుప ఖనిజం ఎగుమతి జరుగుతోంది. కొంకణ్ రైల్వే నిర్మాణం తర్వాత ఇక్కడి నుంచి రవాణా బాగా పెరిగింది.
5) న్యూ మంగళూరు: దీన్ని నాలుగో అతి ముఖ్య ఓడరేవుగా 1974లో ప్రకటించి, 1975లో ప్రారంభించారు. ‘గురుపుర్‌’ నది ఒడ్డున ఉన్న ఈ ఓడరేవును ‘గేట్‌ వే ఆఫ్‌ కర్ణాటక’గా పిలుస్తారు.
6) కోచి: కేరళలో ‘వెంబనాడ్‌ కాయల్‌’ వద్ద ఉంది. ‘అరేబియా సముద్ర మహారాణి’ అని అంటారు. పశ్చిమ తీరంలో అత్యంత లోతైన ఓడరేవు.
7) ట్యుటికోరిన్‌: తమిళనాడులో ఉంది.  వి.ఒ.చిదంబరం ఓడరేవు అని అంటారు. హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఏకైక ఓడరేవు.
8) చెన్నై: తూర్పుతీరంలో అతిపురాతన మానవనిర్మిత, పెద్ద ఓడరేవు. 1875లో నిర్మించారు. ఇక్కడ ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాన్ల ప్రభావం ఉంటుంది.
9) కామరాజార్‌/ఎన్నోర్‌ ఓడరేవు: దేశంలోనే ఒకే ఒక కార్పొరేట్‌ ఓడరేవు. చెన్నై ఓడరేవుపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో నిర్మించారు. 2001లో
ప్రారంభమైంది.
10) విశాఖపట్నం: తూర్పుతీరంలో సహజసిద్ధంగా ఏర్పడింది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సేవలందిస్తుంది. ఇక్కడి నుంచి జపాన్‌కు ఇనుప ఖనిజం ఎగుమతి అవుతోంది.
11) పారాదీప్‌ ఓడరేవు: కటక్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 12 మీటర్ల లోతు ఉంటుంది. ఇక్కడి నుంచి జపాన్‌కు ఇనుప ఖనిజం ఎగుమతి అవుతుంది.
12) కోల్‌కతా ఓడరేవు: నదీ (హుగ్లీ) ఆధారిత ఓడరేవు. ‘గేట్‌ వే ఆఫ్‌ ఈస్ట్‌ ఇండియా’గా పిలుస్తారు. ఇక్కడి నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు    జనపనార ఎగుమతి అవుతుంది.
13) హల్దియా ఓడరేవు: కోల్‌కతా ఓడరేవుకు ప్రత్యామ్నాయంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. హుగ్లీ, హల్దియా నదులు కలిసే ప్రదేశంలో నిర్మించారు.
* తూర్పు తీరాన ఉన్న ఓడరేవులు కోల్‌కతా, పారాదీప్‌, హల్దియా, విశాఖపట్నం, చెన్నై, ఎన్నోర్‌, ట్యుటికోరిన్‌. పశ్చిమతీరాన ఉన్నవి కోచి, న్యూ మంగళూరు, మర్మగోవా, నవసేన, దీన్‌దయాళ్‌ ఓడరేవులు. ఇవేకాకుండా దేశంలో చిన్న, మధ్యతరహా ఓడరేవులు సుమారు 200 వరకు ఉన్నాయి. ఇవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. దేశ పశ్చిమ తీర ప్రాంతంలో మహారాష్ట్రలో, తూర్పు తీరంలో తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా ఓడరేవులు ఉన్నాయి. ఎక్కువ ఓడరేవులున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసియాలోనే మొదటి గ్రీన్‌ఫీల్డ్‌ ఓడరేవు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం.

ప్రధాన ప్రాజెక్టులు

సాగర్‌ మాల పథకం: ఈ పథకం మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ కాలంలో ప్రారంభమైనప్పటికీ, 2016లో అమల్లోకి వచ్చింది. తూర్పు, పశ్చిమ తీర ఓడరేవులను రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానించడం, తీర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్‌ సిటీల ఏర్పాటు, ఓడరేవుల ఆధునికీకరణ, తీరప్రాంత సమాజాల అభివృద్ధి మొదలైనవన్నీ ఇందులో భాగం.
సేతు సముద్రం ప్రాజెక్టు: 18వ శతాబ్దంలో బ్రిటిష్‌ భూగోళ శాస్త్రవేత్త మేజర్‌ జేమ్స్‌ రెన్నెల్‌ సర్వే నిర్వహించి ఈ ప్రాజెక్టు సూచన చేశాడు. తర్వాత 1860లో నాటి నేవీ కమాండర్‌ ఏడీ టేలర్‌ కూడా ప్రతిపాదించాడు. ఈ ప్రాజెక్టు గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, పాక్‌ జలసంధిని కలుపుతుంది. భారత తూర్పు తీరం నుంచి కన్యాకుమారి చేరుకోవాలంటే శ్రీలంక చుట్టూ తిరిగి 755 నాటికల్‌ మైళ్లు ప్రయాణించాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 405 నాటికల్‌ మైళ్ల దూరం తగ్గడంతో పాటు సుమారు 30 గంటలకు పైగా సమయం ఆదా అవుతుంది.
వికాస్‌-జలమార్గం ప్రాజెక్టు:  ఇది జాతీయ జలమార్గం-1. గంగానదిపై ప్రతిపాదించారు. దీని ద్వారా వారణాసి- హల్దియా మధ్య 1380 కి.మీ. వరకు సుమారు 3 మీ. లోతులో జలమార్గం ఏర్పాటు చేశారు.
కాలదన్‌ మల్టీమోడల్‌ ట్రాన్సిట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టు:  దేశంలోని తూర్పు తీర ప్రాంతాన్ని మయన్మార్‌తో రోడ్డు, జలమార్గాల ద్వారా అనుసంధానించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కోల్‌కతా ఓడరేవును సిట్వే (మయన్మార్‌) ఓడరేవుతో అనుసంధానించి, అక్కడి నుంచి కాలదన్‌ నదీ మార్గం ద్వారా చిన్‌ రాష్ట్రంలోని పలెట్వాతో కలుపుతారు. పలెట్వా నుంచి మిజోరాం వరకు రోడ్డు మార్గంతో కలుపుతారు.

అంతస్థలీయ మార్గాలు

దేశంలోని నదులు, కాలువల ద్వారా బ్యాక్‌ వాటర్‌, సరస్సుల్లో ఈ అంతస్థలీయ జలమార్గాలు సుమారు 14,500 కి.మీ. వరకు ఉన్నాయి. దేశ రవాణాలో వీటి వాటా ఒక శాతం. జాతీయ జలమార్గాల చట్టం, 2016 ప్రకారం 111 జాతీయ జలమార్గాలను గుర్తించారు.
జాతీయ జలమార్గం-1: దీన్ని 1986లో ప్రకటించారు. హల్దియా- అహ్మదాబాద్‌ను కలుపుతుంది. గంగా - భగీరథి - హుగ్లీ నదుల మీదుగా వెళుతుంది. దీని పొడవు 1620 కి.మీ.
జాతీయ జలమార్గం-2: బ్రహ్మపుత్ర నదిపై అస్సాంలోని సాదియా నుంచి మయన్మార్‌ సరిహద్దులోని దుబ్రీ వరకు ఈ మార్గం ఉంది. 1988లో ప్రకటించారు. దీని పొడవు 891 కిలోమీటర్లు.
జాతీయ జలమార్గం-3: కేరళలో ఉంది. 1993లో ప్రకటించారు. కొట్టాపురం-కొల్లాం, కొట్టాపురం-కోజికోడ్‌ వరకు పశ్చిమ తీర కాలువ, చంపకర కాలువ, ఉద్యోగ్‌ మండల్‌ కాలువలపై ఉంది. దీని పొడవు 365 కి.మీ.
జాతీయ జలమార్గం-4: 2008లో ప్రకటించారు. ఇది కాకినాడ - పుదుచ్చేరి, గోదావరి - కృష్ణా నదుల మార్గం. మొత్తం పొడవు 1,095 కి.మీ.
జాతీయ జలమార్గం-5: 2008లో ప్రకటించారు. తాల్చేరు-ధమ్రాను కలుపుతుంది. పొడవు 623 కి.మీ.
కోచి వాటర్‌ మెట్రో: కోచి (కేరళ) పట్టణం చాలా వరకు అరేబియా సముద్రం బ్యాక్‌ వాటర్‌ మధ్య ఉంటుంది. భారత్‌లో మొదటి వాటర్‌ మెట్రో వ్యవస్థ, మొదటి సమగ్ర నీటి రవాణా వ్యవస్థ ఇక్కడే ఉంది. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును 2023, ఏప్రిల్‌ 25న ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు