ఇచ్చి పుచ్చుకునే సమాజం!

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎవరి ఆసక్తి మేరకు వారు పనులు, ఉద్యోగాలు చేసిడబ్బు సంపాదించుకుంటున్నారు. తమకు అవసరమైన పనులు, సేవలను ఆ సంపాదనతో కొనుక్కుంటున్నారు.

Published : 27 May 2023 04:57 IST

సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎవరి ఆసక్తి మేరకు వారు పనులు, ఉద్యోగాలు చేసిడబ్బు సంపాదించుకుంటున్నారు. తమకు అవసరమైన పనులు, సేవలను ఆ సంపాదనతో కొనుక్కుంటున్నారు. కానీ ఈ ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందక ముందు ప్రాచీన భారత సమాజంలో కులాల వారీగా వృత్తులు ఉండేవి. వాటి ప్రకారం ఉత్పత్తి చేసిన వస్తువులను లేదా సేవలను ఇతరులకు అందించి, అందుకు ప్రతిగా తమకు కావాల్సిన వస్తుసేవలను పొందేవారు. అలాంటి ఆర్థిక, సామాజిక కార్యకలాపాలన్నీ కలిసి ఒక వ్యవస్థగా రూపొందాయి. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఈ పద్ధతులు అమల్లో ఉన్నాయి. సమాజ నిర్మాణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఆ సామాజిక విధానం వివరాలను తెలుసుకోవాలి.

జజ్‌మానీ వ్యవస్థ

భారతీయ సమాజంలో ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి, పంపిణీ పద్ధతులు ఎన్నో మార్పులకు గురవుతూ వచ్చాయి. సామాజిక సంబంధాలను ప్రభావితం చేయడంలో వీటి పాత్ర కీలకం. గతంలో దేశాన్ని పాలించిన హిందూ రాజులు, ముస్లింలు, ఆంగ్లేయుల కాలంలో ఆర్థిక, సామాజిక వ్యవస్థలు పరస్పరం ప్రభావితమయ్యాయి. నేటికీ వివిధ ప్రాంతాల్లో సెమీ ఫ్యూడల్‌ వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానాల ప్రభావాలు కనిపిస్తాయి. ఒక సమాజంలో సామాజిక సంబంధాలను విశ్లేషించేటప్పుడు, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. హిందూ సమాజంలో కులానికి, వృత్తికి అవినాభావ సంబంధం ఉంది. వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయనే సిద్ధాంతం కూడా ఉంది. ఆనాటి సామాజిక వ్యవస్థలో ఒకానొక సామాజిక, ఆర్థిక విధానమే జజ్‌మానీ లేదా యజమాని వ్యవస్థ.

జజ్‌మానీ వ్యవస్థ - నిర్వచనం, స్వభావం: జజ్‌మానీ అనే పదం యజమాన్‌ అనే సంస్కృత పదం నుంచి ఏర్పడింది. గ్రామాల్లో వృత్తి కులాల కుటుంబాలు వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలకు పనిచేసి వస్తురూపేణా ప్రతిఫలం పొందే విధానాన్ని జజ్‌మానీ లేదా యజమాని పద్ధతి అంటారు.

‘హిందూ జజ్‌మానీ విధానం’ (1936) అనే గ్రంథంలో వైజర్‌ అనే సామాజికవేత్త జజ్‌మానీ విధానాన్ని తొలిసారిగా వివరించాడు. ఈ పద్ధతిలో సేవలు పొందే వ్యక్తిని ‘జటీమాన్‌’, సేవలు అందించే వ్యక్తిని ‘కామిన్‌’ అంటారు. వైజర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక గ్రామాన్ని పరిశీలించి ఈ పద్ధతి గురించి తెలుసుకున్నాడు. ‘‘ప్రతి గ్రామంలో ప్రతి కులం ఇతరులకు ప్రత్యేక సేవలు అందిస్తుంది. అలాగే సేవలు అందించే విషయంలో వివిధ కులాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రతి కులానికి సంప్రదాయం ప్రకారం ఏర్పాటైన సేవలు పొందే వ్యక్తులు ఉంటారు. ఈ విధానం తరతరాలుగా కొనసాగుతోంది.’’  అని తన రచనలో వివరించాడు.

* అన్నిరకాల పనులు, సేవలను వివిధ కులాలు నిర్వహిస్తాయి. శ్రమ విభజన, పనుల నిర్వహణ, సప్లయి, డిమాండు న్యాయాన్ని బట్టి ఉండదు.

ప్రమదనాథ్‌ బెనర్జీ


* ఉన్నత కులాలకు చెందిన భూస్వాములకు; వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, రజక లాంటి వివిధ నిమ్నకులాల వారు సేవలు చేసే విధానమే జజ్‌మానీ.

కొలెండా


* ఆస్కార్‌ ల్యూయిస్‌ ప్రకారం అనేకమంది పాశ్చాత్య శాస్త్రజ్ఞులు, మజుందార్‌, దూబే లాంటి భారతీయ సమాజ శాస్త్రజ్ఞులు జజ్‌మానీ విధానాన్ని అధ్యయనం చేశారు.

జ్‌మానీ పద్ధతిలో వ్యవసాయ సంబంధాలు ప్రధానమైనవి. వ్యవసాయ ఉత్పత్తులు పండించే రైతులకు అదే గ్రామంలో ఉన్న మిగతా కులాలవారు, వారి వృత్తులవారీగా సేవలందించి ప్రతిఫలాన్ని వస్తురూపేణా తీసుకుంటారు. అంటే కమ్మరి, కుమ్మరి, నాయీ బ్రాహ్మణులు (మంగలి), రజక, మేదరి తదితర వృత్తుల వారు వంశపారంపర్యంగా తమ సేవలను యజమానులకు అందించి పంటలో కొంతభాగాన్ని ప్రతిఫలంగా పొందుతారు. ప్రతిఫలాన్ని ధాన్యం రూపంలో యజమానులు చెల్లిస్తారు. ఇది సాధారణంగా పంట కోతలు ముగిసిన తర్వాత సంవత్సరానికి రెండు సార్లు ఉంటుంది. జజ్‌మానీ విధానాన్ని అధ్యయనం చేసిన సమాజ శాస్త్రజ్ఞులు ఆ రోజుల్లో జజ్‌మానీ పద్ధతి కొద్దిపాటి తేడాలతో దేశమంతా అమల్లో ఉండేదని పేర్కొన్నారు.

కులం, వృత్తి, మతం, గతిశీలత లేకపోవడం, కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు, వస్తుమార్పిడి పద్ధతి మొదలైన అంశాలు జజ్‌మానీ వ్యవస్థ బలపడటానికి ఆనాడు దోహదపడి ఉండవచ్చని భావించారు.

జజ్‌మానీ వ్యవస్థ - లక్షణాలు

జజ్‌మానీ పద్ధతిలో యజమాని, కామిన్‌ సంబంధాలు శాశ్వత సంబంధాలు. కామిన్‌లు నిరంతరం జజ్‌మానీకి సేవలు అందిస్తారు.

స్థిర నివాసులుగా ఉన్న కులవృత్తులవారు ఒకటి లేదా కొన్ని కుటుంబాలకు తమ సేవలను శాశ్వత ప్రాతిపదికన అందిస్తూ ఉంటారు. వీరు యాజమాన్య హక్కులు కలిగి ఉంటారు. హక్కు మార్పిడి లేదా బదలాయింపు యాజమాన్య వ్యవస్థలో లేదు.

కామిన్‌లు వంశపారంపర్యంగా తమ సేవలను జజ్‌మానీకి అందిస్తారు. యాజమాన్య హక్కులు అనువంశికంగా వర్తిస్తాయి.

కామిన్‌ను పని నుంచి తొలగించే అధికారం జజ్‌మానీకి లేదు.  
కామిన్‌లు అందించిన సేవలకు ప్రతిఫలంగా జజ్‌మానీ ధనానికి బదులు ధాన్యం రూపంలో వరి, గోధుమలు, గింజ ధాన్యాలను అందిస్తారు.

జజ్‌మానీ విధానంలో   కామిన్‌లకు భద్రత ఉంటుంది. నిరుద్యోగ సమస్య లేదు. ఉద్యోగం వెతుక్కోవాలనే ఆలోచన లేకపోవడంతో  నిరాశకు లోనుకారు. దాంతో శాంతితో తృప్తిగా జీవించగలుగుతారు.

జజ్‌మానీ వ్యవస్థ పనితీరు:  జజ్‌మానీ, కామిన్ల సంబంధాలను సమాజ శాస్త్రజ్ఞులు పలు రకాలుగా వివరించారు.

ఎస్‌.సి.దూబే (1955) తన గ్రంథం ‘భారతీయ గ్రామాలు’లో ‘‘వ్యవసాయదారులకు, ఇతర వ్యవసాయేతర ప్రజలకు వారి సామాజిక, మత సంబంధ అవసరాల కోసం కులవృత్తుల వాళ్లు అందించే సేవలకు ద్రవ్యరూపేణా చెల్లింపు ఉండదు. ప్రతిగా సంప్రదాయబద్ధంగానే తిరిగి సేవలు అందుకుంటారు. వీరివి పరస్పర ఆధారిత సేవలు’’ అని వివరించారు.

వ్యవసాయదార్లకు,   వ్యవసాయ కార్యక్రమాలతో సంబంధం ఉన్న సేవలకు చెల్లింపులు వెంటనే జరగవు.

సంబంధాలు మూడు రకాలు:  బీడల్‌ మాన్‌ (1959) జజ్‌మానీ పద్ధతిలో సంబంధాలను 3 రకాలుగా విభజించారు. భూమిపై ఆధారపడటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విభజన చేశారు.

1) భూస్వాములకు మాత్రమే సేవలందించే చేతిపనివారు. వీరిని ప్రత్యేకమైన సేవలందించే వారుగా పరిగణిస్తారు.
ఉదా: వ్యవసాయానికి సంబంధించి కొడవళ్లను కమ్మరి అందిస్తాడు.

2) భూస్వాములు, భూస్వామేతర ప్రజలకు కూడా సేవలు అందించే క్షురకులు, రజకులు, కుమ్మరులు, కమ్మరులు మొదలైనవారిని పాక్షికంగా పరోక్షమైన సేవలు అందించేవారిగా పరిగణిస్తారు.

3) స్థానికంగా వివిధ చేతివృత్తులవారు పరస్పరం సేవలు అందించుకునే సంబంధాలు పరోక్షమైన సేవలుగా లెక్కిస్తారు.

జజ్‌మానీ వ్యవస్థలో వచ్చిన మార్పులు: కొన్ని కారణాల వల్ల జజ్‌మానీ వ్యవస్థ క్షీణించిందని చెప్పవచ్చు. అవి-

ధరల పెరుగుదల

వస్తు సేవలకు నగదు రూపంలో చెల్లింపు

పట్టణాలు త్వరితంగా వృద్ధి చెందడం

పాఠశాల విద్య విస్తరించడం

నూతన ఉద్యోగావకాశాలు 

జాగిర్దారీ, జమీందారీ విధానాల రద్దు 

కుల పంచాయతీల ప్రాబల్యం తగ్గిపోవడం

కులం, వృత్తి సంబంధ విలువల్లో మార్పులు 

భూమి యాజమాన్యానికి సంబంధించి చట్టాల్లో మార్పులు 

వాణిజ్య పంటల పెరుగుదల

పారిశ్రామికీకరణ 

వ్యవసాయ ఆధునికీకరణ

లక్షణాలు: ‘సొసైటీ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో ఆచార్య మాండెల్‌ బామ్‌ ఈ వ్యవస్థ లక్షణాలను వివరించారు.

ఈ విధానం దృఢమైనది. వారసత్వంగా సంక్రమించింది.

ఈ విధానం ప్రత్యేకమైంది. అంటే ఒక జజ్‌మానీ కుటుంబానికి, ఒకే ఒక కామిన్‌ కుటుంబంతో సంబంధం ఉండాలి.

అనేక సంబంధాలు కలిగి ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధాలే కాకుండా సంతోషాలు, విషాదాలతో పాటు, మరెన్నో విధులను పంచుకునేవారు.

ఈ విధానంలో సేవలందించిన కులానికి ప్రతిఫలంగా బహుమతిని లేదా పారితోషికాన్ని సమకూరుస్తారు.
లాభాలు: ఈ వ్యవస్థలో ఆర్థికపరమైన భద్రత ఉంటుంది. ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉండవు. 

ఈ విధానం గ్రామానికి సంబంధించిన సామాజిక బీమాగా పనిచేస్తుంది.

గ్రామీణ భారతదేశంలో శాంతిని నెలకొల్పడంలో ఇది తోడ్పడుతుంది.

నష్టాలు

ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం, స్తంభన

సేవలు అందించే కులాల దోపిడీ

కులపరమైన ఉద్రిక్తతలు చెలరేగడం. అంటే కులంలో ఉద్రిక్తతలు, కులాల మధ్య ఉద్రిక్తతలు

నిరక్షరాస్యత పెరగడం

జజ్‌మానీ వ్యవస్థ అంతరించిపోవడానికి కారణాలు

కులవృత్తులు కనుమరుగవడం

కులాలన్నీ వ్యవసాయంపై దృష్టి సారించడం  

ప్రస్తుత కాలంలో ఈ వ్యవస్థ మత, వ్యక్తిగతమైన వాటికి పరిమితమవడం.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని