దేవుడినే దెయ్యమయ్యానా..?

తనని ఏడిపించినవాడ్ని చితక్కొట్టినప్పుడు.. హీరోనన్నారు. తన పట్ల కేర్‌ తీసుకుంటే.. దేవుడన్నారు. కానీ ఆమెని పెళ్లాడతానంటే...?

Updated : 04 Dec 2021 05:14 IST

తనని ఏడిపించినవాడ్ని చితక్కొట్టినప్పుడు.. హీరోనన్నారు. తన పట్ల కేర్‌ తీసుకుంటే.. దేవుడన్నారు. కానీ ఆమెని పెళ్లాడతానంటే...?

క్లాసులు బంక్‌ కొట్టడం.. గొడవల్లో తలదూర్చడం.. డిగ్రీలో ఇదీ నా దినచర్య. నేనో మొరటోడినని అందరి అభిప్రాయం. నా మనసెంత సున్నితమో వాళ్లకేం తెలుసు? ఓరోజు క్యాంటీన్‌ నుంచి బయటికొస్తుంటే.. ఫ్రెండ్‌ ఎదురొచ్చాడు. ‘రేయ్‌.. వీళ్లిద్దరు నా ఫ్రెండ్స్‌ ఇక నుంచి నీక్కూడా’ ఇద్దరమ్మాయిల్ని పరిచయం చేశాడు. నాకేం ఆసక్తి లేదు. కానీ మర్నాడే ఒకమ్మాయి నా దగ్గరికొచ్చింది. ‘కిషన్‌.. నన్నొకడు వెంటపడి ఏడిపిస్తున్నాడు. కాస్త ఆ సంగతి చూడవూ’ అంది. తను రాధ. ఫోన్‌ చేసి వాడికి వార్నింగ్‌ ఇచ్చా. తన పెదాలు విచ్చుకున్నాయి. మా స్నేహం చిగురించింది. అప్పుడప్పుడు పలకరింపులు.. ఎప్పుడైనా కలిసి కాఫీ తాగడం.

ఓసారి తను బస్టాప్‌లో ఉన్నప్పుడు ఆ పోకిరి మళ్లీ వెంటపడ్డాడు. అదే సమయంలో నేను క్యాజువల్‌గా ఫోన్‌ చేశా. ఏడుస్తూ చెప్పింది. బండి కిక్‌ కొట్టా. 15 నిమిషాల్లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనముందున్నా. వాడక్కడే తచ్చాడుతున్నాడు. కాలర్‌ పట్టుకొని దేహశుద్ధి చేశా. జనం పోగయ్యారు. నేను హీరోనయ్యాను. ఎందుకైనా మంచిదని రాధ వాళ్లింటిదాకా వెళ్లా. ఇంట్లో వాళ్లు ఎదురొచ్చారు. జరిగింది చెప్పాం. మా అమ్మాయిని రక్షించిన దేవుడివంటూ పొగిడారు.

నేనింటికెళ్లగానే తన ఫోన్‌. ‘ఏంటో.. నిన్ను చూస్తే నా మనసు హ్యాపీగా ఉంటోంది. నువ్వు పక్కనుంటే కొండంత ధైర్యం. ఈ ఫీలింగ్‌ జీవితాంతం ఉండేలా చూడవూ?’ సూటిగానే అడిగింది. నాకూ తనంటే ఇష్టమే. అలా మా స్నేహం ప్రేమ బాట పట్టింది. తర్వాత రాకపోకలు ఊపందుకున్నాయి. వాళ్లింట్లోనూ అడ్డు చెప్పేవారు కాదు. ఆ కుటుంబానికి చేతనైన సాయం చేస్తూనే ఉండేవాణ్ని.

మా డిగ్రీ పూర్తైంది. రాధ ఇప్పుడు నా బాధ్యత. తన లక్ష్యానికి నేనో దారి కావాలనుకున్నా. పట్టుపట్టి పీజీలో చేర్పించా. తిరుగుళ్లు, గొడవలు మానేసి నేను ఐటీ కోర్సులో చేరా. తన పీజీ పూర్తయ్యేలోపు నేను స్థిరపడాలన్నది లక్ష్యం. కానీ ఈలోపే వాళ్లింట్లో పెళ్లిచూపులన్నారు. నాకోసం మూడు సంబంధాలకి నో చెప్పింది. తర్వాత నాకో మంచి ఉద్యోగం వచ్చింది. సంతోషంగా వెళ్లి వాళ్లింట్లో చెప్పా. నా ఉద్యోగం.. జీతం.. హోదా.. మా కుటుంబం వివరాలు చెబుతుంటే వాళ్ల మొహాలు వెలిగిపోయాయి. ఆఖర్న ‘కులం’ చెప్పగానే రంగులు మారాయి. ‘మాక్కొంచెం సమయం కావాలి’ అంటూ నసిగారు. నాకు విషయం అర్థమైంది. మౌనంగా బయటికొచ్చా. కొద్దిరోజులకే హడావుడిగా తనకో సంబంధం ఖాయం చేశారు. ఎంతో బతిమాలా. కరగలేదు.

రాధది నా మాటే. కావాలనుకుంటే మేం రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకోగలం.. పారిపోయి పెళ్లి చేసుకున్నా ఆపేదెవరు? అయినా అలా చేయడం భావ్యం కాదనిపించింది. తను నాతో వచ్చేస్తే.. తనకి ఇంటి తలుపులు శాశ్వతంగా తెరుచుకోవు. నేను ఆకాశమంత ప్రేమనివ్వొచ్చు. కానీ తనని గారాబంగా పెంచిన కన్నవాళ్లు, అన్నయ్యలను కోల్పోతుంది. నా ప్రేమ కోసం వాళ్లని దూరం చేయడం సబబు కాదనిపించింది. చివరికి నేనే గుండె రాయి చేసుకున్నా. తనకి సర్దిచెప్పా. బతుక్కి, బంధాలకు, మనసులకి అడ్డుగోడలా మారిన ఆ కుల రక్కసి జాడ సమసిపోవాలని కోరుకుంటున్నా.

- కిషన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని