lemon water: చిన్న అలవాటే గానీ...

చిన్న చిన్న అలవాట్లే కావొచ్చు. చూడటానికి తేలికగానే అనిపించొచ్చు. కొందరు అసలే పట్టించుకోకపోనూవచ్చు.

Updated : 09 Jan 2022 17:23 IST

చిన్న చిన్న అలవాట్లే కావొచ్చు. చూడటానికి తేలికగానే అనిపించొచ్చు. కొందరు అసలే పట్టించుకోకపోనూవచ్చు. కానీ అవి మన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అలాంటిదే నిమ్మరసం నీరు. ఉదయం పూట నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం.

జీర్ణశక్తి మెరుగు: మనం తిన్న ఆహారం అరగటానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వీటి స్థాయులు తగ్గుతూ వస్తుంటాయి. నిమ్మరసంలోని ఆమ్లాలు వీటికి చేదోడు వాదోడుగా నిలిచి.. ఆహారం జీర్ణం కావటానికి దోహదం చేస్తాయి.

నీటిశాతం పడిపోకుండా: మనలో చాలామంది తగినంత నీరు తాగరు. దీంతో ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ ముంచుకొస్తాయి. అదే రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు. పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండానూ కాపాడుతుంది.

జబ్బులకు కళ్లెం: నిమ్మకాయలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. సగం నిమ్మచెక్క రసం తీసుకున్నా రోజుకు అవసరమైన విటమిన్‌ సిలో ఆరో వంతుకు పైగా అందుతుంది. ఇది రోగనిరోధకశక్తిని పుంజుకునేలా చేయటంతో పాటు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. గాయాలు త్వరగా మానటానికి తోడ్పడతుంది. ఇక నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. ఇవి విశృంఖల కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచి కాపాడతాయి.

నాడులు హుషారు: నిమ్మరసంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. నాడులు-కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం. అన్ని కణాలకు పోషకాలు అందటానికి, వ్యర్థాలను బయటకు పంపటానికీ ఇది తోడ్పడుతుంది. రక్తపోటుపై ఉప్పు చూపే ప్రభావాన్ని తగ్గించటానికీ మెగ్నీషియం ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని