అమ్మాయా? అబ్బాయా?

మాకు 3 నెలల క్రితం పాప పుట్టింది. ఆరోగ్యంగానే ఉంది. కాకపోతే జన్యు సమస్య ఉందని, పాప శరీరంలో మగ హార్మోన్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. జననావయవమూ తేడాగా కనిపిస్తోంది. పైభాగం లోపల చిన్నగా పురుషాంగం మాదిరి అవయవం ఉంది

Updated : 03 Dec 2019 00:25 IST

సమస్య - సలహా

సమస్య: మాకు 3 నెలల క్రితం పాప పుట్టింది. ఆరోగ్యంగానే ఉంది. కాకపోతే జన్యు సమస్య ఉందని, పాప శరీరంలో మగ హార్మోన్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. జననావయవమూ తేడాగా కనిపిస్తోంది. పైభాగం లోపల చిన్నగా పురుషాంగం మాదిరి అవయవం ఉంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?
 

- ఒక పాఠకురాలు (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: మీరు పంపిన రిపోర్టులు, ఫొటోలను బట్టి చూస్తే మీరు అనుకుంటున్నట్టు మీ పాప.. అమ్మాయి కాదు. క్యారియోటైపింగ్‌ పరీక్ష ప్రకారం బిడ్డలో 46 ఎక్స్‌వై క్రోమోజోములున్నాయి. అంటే జన్యుపరంగా మగబిడ్డ అన్నమాట. సాధారణంగా పిండం ఎదిగే దశలో 6 వారాల వరకు ఆడ, మగ అన్నది తెలియదు. ఆ తర్వాతే క్రోమోజోములను బట్టి జననావయవాలు ఒక రూపానికి రావటం ఆరంభమవుతుంది. 46 ఎక్స్‌వై క్రోమోజోములు గలవారిలో 6వ వారంలో వృషణాలు ఏర్పడటం మొదలవుతుంది. వీటి నుంచి టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తయ్యి అది చురుకైన దశలోకి (డైహైడ్రోటెస్టోస్టీరాన్‌) మారి అంగం పెరిగేలా, వృషణాలు కిందికి దిగేలా, వృషణాల సంచులు ఒకటిగా కలిసిపోయేలా చేస్తుంది. ఈ ప్రక్రియ ఎక్కడ అస్తవ్యస్తమైనా అంగం, వృషణాలు ఏర్పడటం దెబ్బతింటుంది. మీ అబ్బాయి విషయంలో జరిగింది ఇదే. టెస్టోస్టీరాన్‌ తక్కువగా ఉత్పత్తి కావటం, ఉత్పత్తి అయినా అది డైహైడ్రోటెస్టోస్టీరాన్‌గా మారకపోవటం, అలా మారినా జననాంగ కణాల మీద దాన్ని గ్రహించే గ్రాహకాలు లేకపోవటం వల్ల అంగం సరిగా ఏర్పడలేదు, వృషణాల సంచి కలిసిపోలేదు. లోపల వృషణాలు కిందికి దిగాయా లేదా అన్నదీ తెలియటం లేదు. దీంతో జననాంగ బయటి భాగం అమ్మాయిలా కనిపిస్తోంది. దీన్నే మగ లింగ విభజన లోపం (మేల్‌ డీఎస్‌డీ) అంటారు. దీనికి ప్రధాన కారణం ఆండ్రోజెన్‌ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్‌ (ఏఎస్‌ఐ). ఇందులో జననాంగ కణాల మీద హార్మోన్‌కు స్పందించే గ్రాహకాలేవీ ఉండవు. దీంతో పురుషాంగం వంటివి సరిగా ఏర్పడవు. ఇలాంటివారికి హార్మోన్‌ పరీక్షలు, కటిభాగం అల్ట్రాసౌండ్‌ లేదా ఎంఆర్‌ఐ పరీక్ష, జెనిటోగ్రామ్‌, ల్యాప్రోస్కీపీ పరీక్షల వంటివన్నీ చేసి అవయవాల తీరుతెన్నులను పరిశీలించాల్సి ఉంటుంది. అప్పుడే లోపలి, బయటి జననావయవాల నిర్మాణం పూర్తిగా అవగతమవుతుంది. అనంతరమే ఎలాంటి చికిత్స చేయాలి? అబ్బాయిగా మార్చాలా ? అమ్మాయిగా మార్చాలా? అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మేల్‌ జెనటోప్లాస్టీ శస్త్రచికిత్స ద్వారా మగబిడ్డగా మార్చొచ్చు. ఫిమెనైజింగ్‌ జెనెటోప్లాస్టీ ద్వారా అమ్మాయిగా మార్చొచ్చు. ఇందులో జననాంగం బయటి భాగాన్ని ఆడవారిలో కనిపించే మాదిరిగా సరిచేస్తారు. అయితే మీ అబ్బాయిని అమ్మాయిగా మార్చటమే మంచిదని అనిపిస్తోంది. ఎందుకంటే మగబిడ్డగా మార్చాలంటే అంగం స్పష్టంగా ఉండాలి. టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌కు కణాలు స్పందించకపోవటం వల్ల మీ అబ్బాయికి అంగం పూర్తిగా ఏర్పడలేదు. అలాంటప్పుడు బయటి నుంచి టెస్టోస్టీరాన్‌ ఇచ్చినా ఉపయోగం ఉండకపోవచ్చు. అందువల్ల అమ్మాయిగా మార్చటమే తేలిక. అలా మార్చినా పెద్దయ్యాక సంతానం కలగదనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే లోపల గర్భసంచి, అండాశయాలు, ఫలోపియన్‌ గొట్టాల వంటివేవీ ఉండవు. ఇలాంటి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టే చికిత్స చేస్తారు. మీరు పిల్లల శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవచ్చు.


-డా।। ఎ.నరేంద్రకుమార్‌, పీడియాట్రిక్‌ సర్జన్‌
మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని