దుకాణానికి వెళ్తున్నారా?

కరోనా విజృంభిస్తున్న తరుణంలో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఇక ఎక్కువ మంది చేరే దుకాణాలకు, సూపర్‌ మార్కెట్లకు వెళ్లి సరుకులు కొనాలంటే? ఎంత భయం వేసినా నిత్యావసరాలను కొనక తప్పదు కదా.

Published : 07 Apr 2020 00:45 IST

కరోనా విజృంభిస్తున్న తరుణంలో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఇక ఎక్కువ మంది చేరే దుకాణాలకు, సూపర్‌ మార్కెట్లకు వెళ్లి సరుకులు కొనాలంటే? ఎంత భయం వేసినా నిత్యావసరాలను కొనక తప్పదు కదా. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
* దుకాణాలు, మాల్స్‌ వద్ద అందుబాటులో ఉన్న శానిటైజర్లను చేతులకు రాసుకోవాలి.
* వీలైనంత త్వరగా ఇంటికి రావాలి. ఇంట్లోనే సరుకుల జాబితాను రాసుకొని వెళ్తే త్వరగా కొనటం పూర్తవుతుంది. వైరస్‌ సోకే ముప్పు తగ్గుతుంది.
* బయటికి వెళ్లినప్పుడు విధిగా కనీస దూరం పాటించాలి. మనిషికీ మనిషికీ మధ్య కనీసం 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.
* ఇంటికి వచ్చిన వెంటనే, అలాగే సరుకులను సర్దిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. సరుకుల ప్యాకెట్ల మీద ఏదైనా వైరస్‌ అంటుకొని ఉంటే సమయం గడుస్తున్నకొద్దీ వాటి సంఖ్య తగ్గిపోతుంటుంది. మనం వాటిని తీసి వాడుకునేసరికి చాలావరకు చనిపోవచ్చు. ఒకవేళ వెంటనే వాడాలనుకుంటే ప్యాకెట్లపై సూక్ష్మక్రిములను చంపే ద్రావణాన్ని (డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌) చల్లి, తుడిచిన తర్వాత బయటకు తీయాలి. ఈ ద్రావణాన్ని తినే పదార్థాలకు అంటుకోకుండా చూసుకోవాలి.


పొవొడిన్‌ అయోడిన్‌ రక్ష

వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి రకరకాల సూక్ష్మక్రిముల నివారణకు పొవొడిన్‌ అయోడిన్‌ ద్రావణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందే దీన్ని చేతులకు రాసుకుంటే మంచిది. ఇది ఆరిపోయి చర్మం మీద రక్షణ పొరగా ఏర్పడుతుంది. దీంతో సూక్ష్మక్రిములేవీ మన చేతులకు అంటుకోవు. ఒకవేళ అంటుకున్నా వెంటనే నిర్వీర్యమైపోతాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్‌ తరగతికే చెందిన సార్స్‌, మెర్స్‌ వైరస్‌లతో పాటు ఎబోలా, ఫ్లూ వంటి వైరస్‌లనూ ఇది సమర్థంగా అడ్డుకుంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది. చేతులకు తడి తగిలేంతవరకు, కడుక్కునేంతవరకు పొవొడిన్‌ అయోడిన్‌ అలాగే ఉంటుంది. ఇది నోట్లోకి వెళ్లినా ఏమీ కాదు గానీ భోజనం చేయటానికి ముందు చేతులు కడుక్కుంటే మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని