Updated : 08 Mar 2022 06:40 IST

ముక్కితే పేగు జారుతోంది

సమస్య: నాకు 73 ఏళ్లు. శాకాహారిని. మద్యం, పొగ అలవాట్లు లేవు. చాలాకాలంగా మలబద్ధకంతో బాధపడుతున్నాను. ముక్కితే గానీ విసర్జన కాదు. ముక్కినప్పుడు మలద్వార కండరాలు బయటకు వస్తాయి. వీటిని లోపలికి నెడితే గానీ విసర్జన కాదు. అప్పుడప్పుడు విసర్జన సాఫీగా అవటానికి మందులు వాడతాను. రోజుకు 2 లీటర్ల నీళ్లు తాగుతాను. 2 కి.మీ. నడుస్తాను. నా సమస్యకు శాశ్వత పరిష్కారమేంటి? దీంతో క్యాన్సర్‌ వచ్చే అవకాశముందా?

- మూర్తి, హైదరాబాద్‌

సలహా: వృద్ధాప్యంలో మలబద్ధకం ఎక్కువ. సరైన ఆహారం తీసుకోకపోవటం, తగినంత నీరు తాగకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి దీనికి కారణమవుతుంటాయి. మీరు శాకాహారమే తింటున్నారు. నీళ్లు బాగానే తాగుతున్నారు. వ్యాయామమూ చేస్తున్నారు. అయినా మలబద్ధకం ఉందంటే కారణమేంటన్నది గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకు ఎంఆర్‌ఐ డెఫికోగ్రామ్‌, కొలనోస్కోపీ, యానోరెక్టల్‌ మానోమెట్రీ, కొలనిక్‌ ట్రాన్సిట్‌ మార్కర్‌ స్టడీ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటితో పేగుల కదలికలేమైనా తగ్గాయా? కండరాల సమస్యలు, పేగుల్లో అడ్డంకులేవైనా ఉన్నాయా? అనేవి బయటపడతాయి. కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు సమస్యలు కలిసి ఉండొచ్చు. అప్పుడు వేర్వేరు చికిత్సలు అవసరమవుతాయి. చాలావరకు మందులతోనే మంచి ఫలితం కనిపిస్తుంది. కదలికలు మెరుగవటానికి, కండరాలు వదులు కావటానికి తోడ్పడే మందులు ఉపయోగపడతాయి. కొందరు కండరాలను వదులుగా చేయలేరు. వదులు చేసే ప్రయత్నంలో బిగుతుగా పట్టి ఉంచుతుండొచ్చు. ఇలాంటివారికి మానోమెట్రీ పరికరంతో కండరాలను వదులు చేయటాన్ని (బయో ఫీడ్‌బ్యాక్‌) నేర్పించాల్సి ఉంటుంది. ముక్కినప్పుడు మలద్వార కండరాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు. కటి భాగంలోని కండరాలు, కండర బంధనాల వంటివి పెద్దపేగు చివరిభాగానికి (రెక్టమ్‌) దన్నుగా నిలుస్తూ, దాన్ని స్థిరంగా ఉంచుతాయి. ముక్కినప్పుడు కడుపులో తలెత్తే ఒత్తిడి, వృద్ధాప్యం వంటి కారణాలతో ఇది వదులై కిందికి జారొచ్చు. పేగు మరీ ఎక్కువగా కిందికి జారితే శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే ఇది చివరి ప్రయత్నమే. చాలావరకు మందులే ఇస్తారు. మలబద్ధకం సాధారణంగా క్యాన్సర్‌కు దారితీయదు. మీరేమీ భయపడొద్దు. జీర్ణకోశ నిపుణులను సంప్రదిస్తే తగు పరీక్షలు చేసి, కారణాన్ని బట్టి చికిత్స సూచిస్తారు.

చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ,
ఈనాడు కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 
email: sukhi@eenadu.in

Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని