ఇంటి వ్యాయామమైనా చాలు!

కరోనా మన జీవనశైలినే మార్చేసింది. ముఖ్యంగా ఆరుబయట వ్యాయామాలు చేసేవారికి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది....

Published : 12 May 2020 00:41 IST

కరోనా మన జీవనశైలినే మార్చేసింది. ముఖ్యంగా ఆరుబయట వ్యాయామాలు చేసేవారికి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. నడక, పరుగు, ఈత, సైకిల్‌ తొక్కటం, జిమ్‌లకు వెళ్లటం వంటి వాటితో శరీర సామర్థ్యాన్ని కాపాడుకునేవారిని నాలుగ్గోడలకే పరిమితం చేసింది. అంతమాత్రాన నిరాశ పడాల్సిన పనేమీ లేదు. ఇంటి వ్యాయామాలతో శరీర సామర్థ్యాన్ని కాపాడుకోవచ్ఛు ఇది మున్ముందూ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దిగ్బంధం తొలగించినా పరిస్థితి ఇప్పుడప్పుడే పూర్తిగా సర్దుకోకపోవచ్ఛు ఇతరులకు దూరంగా ఉండే ప్రయత్నంలో నలుగురితో కలిసి నడవటం, జిమ్‌లకు వెళ్లటం వంటివి కుదరకపోవచ్ఛు ఇంటి వ్యాయామాలే ప్రత్యామ్నాయం కావొచ్ఛు కాస్త మనసు పెడితే మార్గం దొరక్కపోదు.

ఇంట్లోనే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వ్యాయామాలకు ఉపక్రమించటం సరికాదు. ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. ఉదయం పూట అయితే మరీ మంచిది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అవాంతరాలేవీ ఉండవు. వ్యాయామం చేసినప్పుడు కండరాల నుంచి వెలువడే రసాయనాలు మనసును ఉత్సాహపరుస్తాయి. ఇవి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి.

వ్యాయామం ఆరంభించటానికి ముందు కొద్ది నిమిషాల సేపు కాళ్లు, చేతులు సాగదీయటం వంటి వాటితో శరీరాన్ని సన్నద్ధం చేసుకోవటం మరవరాదు. దీంతో కండరాలు వ్యాయామానికి అనుగుణంగా సిద్ధమవుతాయి. ఉన్నట్టుండి కండరాలు పట్టేయటం, నొప్పుల వంటి ఇబ్బందులు తప్పుతాయి.

వ్యాయామ సైకిల్‌, ట్రెడ్‌మిల్‌ వంటి పరికరాలుంటే మంచిదే. కనీసం 40 నిమిషాల సేపైనా వీటిని ఉపయోగించాలి. మన బరువు, ఎంతసేపు వ్యాయామం చేశామన్నదాన్ని బట్టి కేలరీలు ఖర్చవుతాయి. సాధారణంగా గంటకు 400 కేలరీలు ఖర్చవుతాయి. వేగంగా ట్రెడ్‌మిల్‌ మీద పరుగెట్టినా, సైకిల్‌ తొక్కినా ఇంకాస్త ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవచ్చు.

వ్యాయామాలకు ఖరీదైన పరికరాలే అవసరం లేదు. ఇంట్లో గదిలో, హాలులో, బాల్కనీలో, మేడ మీద ఎక్కడైనా నడవొచ్ఛు మనసులో 8 అంకెను ఊహించుకొని గానీ నేల మీద గీసి గానీ నడిస్తే మేలు. ఇందుకు కాస్త పెద్ద గది అయినా సరిపోతుంది. కావాలంటే 15 నిమిషాల సేపు సవ్యంగా, మరో 15 నిమిషాలు అపసవ్యంగా నడవొచ్ఛు ఇలా విసుగు పుట్టకుండా ఎక్కువసేపు, ఎక్కువ దూరం నడిచేలా చూసుకోవచ్ఛు 8 అంకె ఆకారంలో నడుస్తుంటే తరచూ పక్కలకు మళ్లాల్సి ఉంటుంది. దీంతో కళ్లు, మెదడు, కాళ్ల మధ్య సమన్వయం పెంపొందుతుంది. ఇది శరీరం తూలిపోకుండా స్థిరంగా ఉండే శక్తిని ప్రసాదిస్తుంది.

మోకాళ్ల నొప్పులు లేనివారు కాస్త వేగంగా మెట్లు ఎక్కి, దిగొచ్ఛు ఒక్కో మెట్టుకు 0.2 కేలరీలు ఖర్చవుతాయి. ఇలా 20 మెట్లు ఎక్కినా 4 కేలరీల శక్తి ఖర్చవుతుంది.

శరీరాన్ని బలోపేతం చేసుకోవటమూ ముఖ్యమే. ఇందుకు బరువులెత్తే వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో డంబెల్స్‌ లేకపోతే లీటరు బాటిల్‌లో నీళ్లు నింపి చేతులతో ఎత్తొచ్ఛు ఇలా 10 సార్లు చేసినా శరీరం బలోపేతమవుతుంది.

తాడాట (స్కిప్పింగ్‌) పిల్లలకే పరిమితం కాదు. అన్ని వయసుల వారికీ మేలు చేస్తుంది. దీనికి నడక కన్నా తక్కువ చోటైనా సరిపోతుంది. తాడు లేకపోయినా ఇబ్బంది లేదు. తాడు తిప్పుతున్నట్టు నటిస్తూ గెంతినా చాలు. గంటకు 600 కేలరీలు ఖర్చవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని