అర్ధరాత్రి భయమేల?

నాకు 36 ఏళ్లు. ఐటీరంగంలో పనిచేస్తున్నాను. ఎలాంటి దురలవాట్లు లేవు. రెండు నెలల క్రితం అర్ధరాత్రి ఉన్నట్టుండి భయంతో మెలకువ వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. మర్నాడు డాక్టర్‌కు చూపించుకున్నా. అసిడిటీ మందులతో తగ్గింది.

Published : 09 Jun 2020 02:14 IST

సమస్య - సలహా

సమస్య: నాకు 36 ఏళ్లు. ఐటీరంగంలో పనిచేస్తున్నాను. ఎలాంటి దురలవాట్లు లేవు. రెండు నెలల క్రితం అర్ధరాత్రి ఉన్నట్టుండి భయంతో మెలకువ వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. మర్నాడు డాక్టర్‌కు చూపించుకున్నా. అసిడిటీ మందులతో తగ్గింది. కానీ ఎప్పుడు రాత్రిపూట మెలకువ వచ్చినా మునుపటిలాగే జరుగుతుందేమోనని భయమేస్తోంది. దీంతో పని మీద ధ్యాస కుదరటం లేదు. మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. దీనికి పరిష్కారమేంటి?

- కిశోర్‌ (ఈ మెయిల్‌ ద్వారా)

సలహా: మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే మీరు భయం పోటుతో (ప్యానిక్‌ అటాక్‌) బాధపడుతున్నారని అనిపిస్తోంది. ఇందులో అకారణంగా ఉన్నట్టుండి భయం పుట్టుకొస్తుంటుంది. గుండె దడ, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, చెమటలు పట్టటం, కాళ్లు చేతులు చల్లబడటం, తిమ్మిర్లు పట్టినట్టు అనిపించటం వంటివీ కనిపిస్తాయి. కొందరు చనిపోతామేమోననీ వణికిపోతుంటారు. ఇలాంటి భయంకర స్థితి 5-10 నిమిషాల తర్వాత తగ్గిపోతుంది. అనంతరం నీరసం ముంచుకొస్తుంది. గుండెపోటు, రక్తంలో గ్లూకోజు పడిపోవటం వంటి వాటితోనూ ఇలాంటి లక్షణాలు కనిపించొచ్చు. మీరు డాక్టర్‌కు చూపించుకున్నారు కాబట్టి అలాంటి సమస్యలేవీ లేవనే అనుకోవచ్చు. హఠాత్తుగా భయం కలగటం ఒక్కసారితోనే ఆగిపోవచ్చు. కొందరికి మళ్లీ మళ్లీ వస్తుండొచ్చు. లేదూ మళ్లీ వస్తుందేమోననే భయం వెంటాడుతూ ఉండొచ్చు (యాంటిసిపేటరీ ఆంగ్జయిటీ). దీంతో పని మీద ఆసక్తి, శ్రద్ధ తగ్గుతాయి. దేని మీదా ధ్యాస కుదరదు. బయటికి ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ఇంట్లో ఎవరూ లేనప్పుడు భయం పుడితే ఎలా? అని ఆందోళన చెందుతుంటారు. ముందుగా మీరు మానసిక నిపుణులను సంప్రదించటం మంచిది. భయానికి కారణాలేంటి? ఎప్పుడెప్పుడు వస్తోంది? అనేవి పరిశీలించి తగు పరిష్కార మార్గాలు సూచిస్తారు. భయం పోటు తగ్గటానికి మంచి మందులున్నాయి. అలాగే ఆలోచనల తీరును మార్చే చికిత్స (కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ) కూడా ఉపయోగపడుతుంది. ఇందులో భయం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి? దాని గురించి పదే పదే ఆలోచించకుండా ఉండటమెలా? అన్నవి నేర్పిస్తారు. వీటితో మంచి ఫలితం కనిపిస్తుంది. మీరు అతిగా భయపడాల్సిన పనిలేదు. విపరీతంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు.


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని