గుండెజబ్బుకూ టీకాలు!

ప్రపంచంలో ఎక్కువ మందిని కబళిస్తున్న గుండెజబ్బు, క్యాన్సర్లకూ టీకాలు అందుబాటులోకి రానున్నాయి. అదీ మరో మరో ఏడేళ్లలోనే! కొవిడ్‌ టీకా రూపకల్పనకు తోడ్పడిన ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానమే దీన్ని సుగమం చేస్తుండటం గమనార్హం.

Published : 18 Apr 2023 00:23 IST

ప్రపంచంలో ఎక్కువ మందిని కబళిస్తున్న గుండెజబ్బు, క్యాన్సర్లకూ టీకాలు అందుబాటులోకి రానున్నాయి. అదీ మరో మరో ఏడేళ్లలోనే! కొవిడ్‌ టీకా రూపకల్పనకు తోడ్పడిన ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానమే దీన్ని సుగమం చేస్తుండటం గమనార్హం. టీకాల రూపకల్పనలో వైద్యరంగం ప్రస్తుత కాలాన్ని ‘స్వర్ణయుగం’గా పేర్కొంటోంది. అతి తక్కువ కాలంలో కొవిడ్‌కు టీకాలను అభివృద్ధి చేయటమే కాదు.. వాటి ప్రయోగ పరీక్షలనూ పూర్తి చేయటమంటే మాటలు కాదు. ప్రపంచవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్నీ అమలు చేశారు. ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానంతో రూపొందించిన కొవిడ్‌ టీకా మరో కొత్త టీకా ప్రపంచానికి దారులు తెరచింది. దీన్ని కొవిడ్‌ వంటి ఇన్‌ఫెక్షన్‌ జబ్బులకే కాదు.. ఎలాంటి వ్యాధులకైనా వర్తింపజేయొచ్చు. క్యాన్సర్లు, గుండెజబ్బులు, ఆటోఇమ్యూన్‌ జబ్బులు, అరుదైన జబ్బులు.. వేటికైనా టీకాలను తయారు చేయటానికి వాడుకోవచ్చు. ఆయా జబ్బులను నివారించటానికి లేదా వాటిని ఎదుర్కోవటానికి అనుగుణమైన ప్రొటీన్‌ను తయారుచేసుకునేలా ఎంఆర్‌ఎన్‌ఏ టీకా రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. ఇదే వినూత్న టీకాలకు ఆస్కారం కలిగిస్తోంది. కణితి ఆకృతి, లక్షణాల వంటి వాటి ఆధారంగా ఆయా క్యాన్సర్లకూ టీకాలనూ తయారు చేయొచ్చు. జన్యు మార్పులతో తలెత్తే అరుదైన జబ్బులకూ ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత చికిత్సలను వాడుకోవచ్చు. ఆయా జన్యులోపాలనూ సవరించొచ్చు. ఇప్పటికే వీటిపై అధ్యయనాలు నిర్వహించామని, వీటిల్లో మంచి ఫలితాలు కనిపించాయని కొవిడ్‌ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను రూపొందించిన మోడెర్నా సంస్థ పేర్కొంటోంది. అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవల మేలి మలుపు చికిత్సలుగా రెండు మోడర్నా టీకాలకు అనుమతిచ్చింది. ఒకటేమో వృద్ధుల్లో ఆర్‌ఎస్‌వీ (రెస్పిరేటరీ సిన్‌సీషియల్‌ వైరస్‌) నివారణకు తోడ్పడితే.. మరొకటేమో చర్మక్యాన్సర్‌ (మెలనోమా) రాకుండా చూస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు