Updated : 15 Mar 2022 06:03 IST

చలి చలిగా ఉన్నదా?

చుట్టుపక్కల వేడిగా ఉన్నా కొందరికి చలిగా అనిపిస్తుంటుంది. మిగతావారంతా హాయిగా ఉంటున్నా వీరికి చలి పెడుతున్నట్టే ఉంటుంది. ఈ చలి కూడా ఒళ్లంతా ఒకేలా ఉండకపోవచ్చు. కొందరికి ఒళ్లంతా చల్లగా అనిపిస్తే ఇంకొందరికి చేతులు, పాదాలు మాత్రమే చల్లగా అనిపించొచ్చు. శరీర స్వభావం రీత్యా కొందరికి ఇలా ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు జబ్బులూ కారణం కావచ్చు.

రక్తహీనత: మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసేవి ఎర్ర రక్త కణాలే. రక్తహీనత గలవారిలో ఇవి తగినంత సంఖ్యలో తయారుకావు. దీంతో శరీర భాగాలకు రక్తం సరిగా సరఫరా కాదు. దీంతో కొందరికి చలిగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా చేతులు, పాదాలు చల్లగా అనిపిస్తుంటాయి. అలసట, బలహీనత, తల తిప్పినట్టు అనిపించటం, ఆయాసం వంటి ఇబ్బందులూ తలెత్తుతాయి. రక్తహీనతకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇది ఐరన్‌, విటమిన్‌ బి12 లోపంతోనూ రావొచ్చు. రక్తం పోవటం, పోషకాహారం తినకపోవటం, శరీరం ఐరన్‌ను గ్రహించుకోలేకపోవటం వంటివి ఐరన్‌ లోపానికి దారితీస్తాయి. ఐరన్‌, విటమిన్‌ బి12 లభించే పదార్థాలు తినటం, అవసరమైతే మాత్రలు వాడుకోవటం ద్వారా వీటి లోపాన్ని తగ్గించుకోవచ్చు.

థైరాయిడ్‌ జబ్బు: మెడ వద్ద ముందు భాగాన ఉండే థైరాయిడ్‌ గ్రంథి జీవక్రియల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది తగినంతగా థైరాయిడ్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేయకపోయినా, శరీరం హార్మోన్‌ను సరిగా వినియోగించుకోకపోయినా హైపోథైరాయిడిజమ్‌ సమస్యకు దారితీస్తుంది. దీంతో జీవక్రియల వేగం మందగించి చలి పెడుతున్నట్టు అనిపిస్తుంది. జుట్టు ఊడటం, చర్మం పొడిబారటం, నిస్సత్తువ, మలబద్ధకం, బరువు పెరగటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

రేనాడ్స్‌ జబ్బు: ఇందులో చేతుల్లోని రక్తనాళాలు చలి వాతావరణానికి, ఒత్తిడికి అతిగా స్పందిస్తాయి. దీంతో రక్తసరఫరా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితి కొన్ని నిమిషాల నుంచి కొద్ది గంటల వరకు ఉండొచ్చు. చేతులు చల్లబడటంతో పాటు మొద్దుబారొచ్చు. వేళ్లు తెల్లగా లేదా నీలం రంగులోకి మారొచ్చు. రక్త సరఫరా తిరిగి మొదలుకాగానే సూదులు పొడుస్తున్నట్టు అనిపించొచ్చు. మందులతో దీని లక్షణాలను తగ్గించుకోవచ్చు. కణజాలం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

కిడ్నీ జబ్బు: మధుమేహం, అధిక రక్తపోటు కిడ్నీలు దెబ్బతినేలా చేస్తాయి. దీంతో కిడ్నీలు రక్తాన్ని సరిగా వడపోయలేవు. దీంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అప్పుడు చలి పెడుతున్నట్టు అనిపిస్తుంది. కిడ్నీ జబ్బుతో రక్తహీనత కూడా తలెత్తొచ్చు. ఇదీ చలి పెడుతున్న భావన కలిగించేదే.

రక్తనాళాల సమస్య: కాళ్లకు, చేతులకు రక్తాన్ని చేరవేసే నాళాల సమస్యలతోనూ అరచేతులు, పాదాలు చల్లగా అనిపించొచ్చు. రక్తనాళాల్లో పూడికలు, రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటం, రక్తం గడ్టకట్టే సమస్యల వంటివి ఇందుకు కారణం కావొచ్చు. వీటిల్లో చేతులు, పాదాలు చల్లబడటంతో పాటు వేళ్ల మొద్దుబారటం, సూదులు పొడిచినట్టు అనిపించటం, బలహీనత వంటివీ ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

అనొరెక్సియా నెర్వోసా: ఇదో తిండి సమస్య. శక్తినిచ్చే కేలరీలను గణనీయంగా తగ్గించుకోవటం వల్ల శరీరం బాగా సన్నబడుతుంది. ఒంట్లో కొవ్వు తగ్గటం వల్ల ఎప్పుడూ చలి పెడుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి.

నాడులు దెబ్బతినటం: కొందరికి పాదాలు చల్లగా అనిపిస్తుంటాయి గానీ తాకితే చల్లగా ఉండవు. దీనికి కారణం నాడులు దెబ్బతినటం. దీన్నే పెరిఫెరల్‌ న్యూరోపతీ అంటారు. ఇందులో చలి వేళ్ల వద్ద మొదలై పైకి పాకుతూ వస్తుంది. మధుమేహం గలవారిలో ఈ సమస్య ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ జబ్బు, కాలేయ జబ్బు, విటమిన్ల లోపం, విషతుల్య రసాయనాలు తగలటం వంటివీ దీనికి కారణం కావొచ్చు.

హైపోపిట్యుటరిజమ్‌: ఇందులో పిట్యుటరీ గ్రంథి తగినంత హార్మోన్‌ను ఉత్పత్తి చేయదు. చలిని తట్టుకోలేకపోవటం, శరీరం వెచ్చగా ఉండకపోవటం దీని ప్రధాన లక్షణాల్లో కొన్ని. ఈ సమస్య గలవారిలో రక్తహీనత, ఆకలి తగ్గటం, బరువు తగ్గటం వంటి లక్షణాలూ ఉండొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు