fruits: పండ్లు తినకపోతే ఏమవుతుంది?

రకరకాల రంగు పండ్లు తినేందుకు ప్రయత్నించండి. ఆరోగ్య పరిరక్షణలో ఈ రంగులదీ కీలక పాత్రే.

Published : 30 Jan 2022 17:35 IST

అదేం ప్రశ్న, ఆమాత్రం తెలీదా...! అనుకోవచ్చు. అర్థం లేని ప్రశ్న కాకపోతే.. పండ్లు తినకపోతే ఏమవుతుంది? మనమేమైనా చచ్చిపోతామా? అనుకోవచ్చు. వినటానికి కాస్త ఆశ్చర్యకరంగా అనిపించినా అది నిజం. కేవలం తగినన్ని పండ్లు, తాజా కూరగాయలు తినకపోవటం మూలంగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 17 లక్షల మరణాలు సంభవిస్తున్నాయంటే నమ్ముతారా? ఇదేదో ఆషామాషీ లెక్క కాదు.. సాక్షాత్తూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా. పండ్లు దండిగా తింటే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. క్యాన్సర్లు దరిజేరవు.

పండ్లు - ఆరోగ్య ప్రయోజనాలు

* పండ్లు సహజమైన తీపిపదార్థాలు. అయినా వీటిలో శక్తి (క్యాలరీలు) తక్కువగా ఉంటుంది. కాబట్టి స్వీట్లు, బేకరీ పదార్థాల వంటి వాటికి పండ్లు తినటం వల్ల ఒంట్లోకి అనవసరపు క్యాలరీలు చేరిపోకుండా ఉంటాయి. ఇలా రోజూ పండ్లు తినటమన్నది బరువు నియంత్రణకు చక్కగా దోహదపడుతుంది.

* పండ్లలో క్యాలరీలే కాదు.. కొవ్వు కూడా తక్కువ. మనకు మేలు చేసే విటమిన్లు, పోషకాలు, పీచు, ఫోలిక్‌ యాసిడ్‌, సూక్ష్మపోషకాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. చక్కటి ఆరోగ్య పరిరక్షణకు ఇవన్నీ అవసరమైనవే.

* సమతులాహారంలో భాగంగా రోజూ కొన్ని పండ్లు తినటం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం నివారణలో పండ్లు మంచి పాత్ర పోషిస్తాయి. పండ్లు దండిగా తింటే చాలా రకాల క్యాన్సర్లు కూడా దరిజేరవు.

* చాలా పండ్లలో పీచు సమృద్ధిగా ఉంటుంది. ఇది కూడా అత్యంత మేలైన, జిగురులా కరిగే రకం (సాల్యుబుల్‌) ఫైబర్‌. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగకుండా చూడటంలో ఈ రకం పీచు కీలక పాత్ర పోషిస్తుంది. పీచు అధికంగా తీసుకోవటం వల్ల వూబకాయం, మధుమేహం వంటి రుగ్మతల నివారణ కూడా సాధ్యమని పరిశోధకులు గుర్తించారు. పేగులు చక్కగా పనిచేసేలా చూడటం ద్వారా ఈ పీచు మలబద్ధకానికి కూడా మంచి విరుగుడుగా పని చేస్తుంది. పైగా పీచు ఎక్కువగా ఉండే పండ్లను కొద్దిగా తినగానే పొట్ట నిండిన భావన కలుగుతుంది, దీనివల్ల మనం తీసుకునే క్యాలరీల మొత్తం తగ్గి, వూబకాయం వంటి బాధలు దరిజేరవు.

* రోజూ పొటాషియం సమృద్ధిగా ఉండే అరటి, తర్బూజా, నారింజ వంటి పండ్లు తినటం వల్ల రక్తపోటు పెరగకుండా.. అంటే హైబీపీ రాకుండా కొంత మేలు జరుగుతుంది. అలాగే వీటితో కిడ్నీల్లో రాళ్ల ముప్పు, ఎముక నష్టం వంటి సమస్యలూ దరికిరావు. పండ్లలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. రక్తపోటు విషయంలో ఇదీ మంచిదే.

* పండ్ల నుంచి సమృద్ధిగా లభ్యమయ్యే విటమిన్‌-సి గాయాలు మానటంలో, కణజాలం మరమ్మతులో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఫోలిక్‌ ఆమ్లం కొత్తగా ఎర్రరక్తకణాలు తయారు చేసుకోవటానికి సహాయపడుతుంది.

* మన శరీరంలో నిరంతరం జరుగుతుండే జీవక్రియల్లో భాగంగా ‘ఫ్రీర్యాడికల్స్‌’ అనే రకం విశృంఖల కణాలు పుట్టుకొస్తాయి. ఇవి శరీరమంతా తిరుగుతూ కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఒంట్లో వీటి స్థాయి పెరిగిన కొద్దీ మనం వ్యాధుల బారినపడే అవకాశాలు, ముఖ్యంగా క్యాన్సర్ల ముప్పు ఎక్కువ. అలాగే వీటివల్ల వృద్ధాప్య లక్షణాలూ పెరుగుతుంటాయి. అందుకే మన శరీరంలో ‘యాంటీ ఆక్సిడెంట్ల’నే రకం కణాలు... నిరంతరం వీటితో పోరాడుతూ వీటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. పండ్లలో ఈ ‘యాంటీ ఆక్సిడెంట్లు’ దండిగా లభ్యమవుతాయి. ఇవి ‘పాలీ ఫెనోలిక్‌ ఫ్లావనాయిడ్లు’, విటమిన్‌-సి, యాంథోసయనిన్స్‌ వంటి రకరకాల రూపాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరంలోని ప్రతి కణాన్నీ, కణజాలాన్నీ, అవయవాలను పునరుత్తేజితం చేస్తాయి. మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కూరగాయలు, తృణధాన్యాల వంటివాటితో పోలిస్తే ఈ యాంటీఆక్సిడెంట్ల స్థాయులు పండ్లలోనే చాలా ఎక్కువ. కాబట్టి పండ్లను ఎక్కువగా తినటం వల్ల- జుట్టు రాలటం, చర్మం ముడతలు, వృద్ధాప్య లక్షణాల వంటి చిన్నచిన్న సమస్యల నుంచి క్యాన్సర్లు, ఎముక క్షయం వంటి తీవ్ర సమస్యల వరకూ ఎన్నింటినో నివారించుకోవచ్చు. అందుకే పండ్లను ఏమాత్రం తేలికగా తీసెయ్యటానికి లేదు.

కంటికి కనబడనీయండి!

* ఇంట్లో భోజనాల బల్ల మీదో, ఓ మూల స్టాండులోనో.. ఎక్కడోచోట అందమైన చిన్న పాత్రలో పండ్లు కంటికి కనబడేలా పెట్టండి. దీనివల్ల చూడగానే తినాలని అనిపిస్తుంది, అనిపించగానే తినటానికి వీలూ ఉంటుంది.

* తరిగిన పండ్ల ముక్కలను తప్పనిసరిగా ఫ్రిజ్జులో ఉంచండి, వాటిని సాధ్యమైనంత త్వరగా తినెయ్యండి.

* ఎప్పుడూ ఆపిల్సూ, అరటిపళ్లూ.. అవేఅవే కొనుక్కోకండి. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో కొనుక్కుంటే.. అంత ఖరీదూ ఉండదు, వాటి రుచిని పూర్తిస్థాయిలో ఆస్వాదించే అవకాశమూ ఉంటుంది.

* పండ్ల రసాల కన్నా నేరుగా పండ్లనే తినటం ఉత్తమం. పండ్ల రసాల్లో పీచు పోతుంది!

* మనం రోజువారీ ఆహారం తినేటప్పుడు దానిలో కనీసం సగభాగం.. పండ్లు-కూరగాయలతో నింపగలిగితే మనం తగినన్ని పండ్లు తిన్నట్టే. రోజులో పిల్లలకు కనీసం ఒకటిన్నర కప్పు, ఓ మోస్తరు శారీరక వ్యాయామం చేసే పెద్దలు రెండు కప్పుల పండ్లు తినటం ముఖ్యం.

* రకరకాల రంగు పండ్లు తినేందుకు ప్రయత్నించండి. ఆరోగ్య పరిరక్షణలో ఈ రంగులదీ కీలక పాత్రే.

* సాధ్యమైనంత వరకూ ఉదయం అల్పాహారంతో తప్పకుండా ఒక పండు ఉండేలా చూసుకోండి. సాయంత్రం స్నాక్స్‌గా రకరకాల పండ్లను వాడుకోవచ్చు.

* రుచిని బట్టి, ఆసక్తినిబట్టి మాంసాహారంతో కూడా కొన్ని పండ్లను తినొచ్చు.

* ఇంట్లో ‘పండ్ల సంస్కృతి’ ఉండేలా చూస్తే.. పిల్లలకు ప్రత్యేకంగా పండ్లు అలవాటు చెయ్యక్కర్లేదు. పెద్దలు పండ్లకు ప్రాధాన్యం ఇస్తే.. పిల్లలు తమకు తెలియకుండానే పెద్దలను అనుకరిస్తారు. పండ్లు కొనటం నుంచి వాటిని కడగటం, ముక్కలు తరగటం వంటివన్నీ పిల్లలతో చేయించండి. దానివల్ల వారిలో ఆసక్తి, ఉత్సుకత పెరుగుతాయి.

* అందుబాటులో ఉన్నప్పుడు కొత్తకొత్త పండ్లను ప్రయత్నించండి. పండ్లను కొనగానే శుభ్రంగా కడగటం మాత్రం మరువద్దు. పండ్లను పచ్చి మాంసానికీ, చేపల వంటి వాటికి దూరంగా ఉంచండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని