Fresh Morning: హుషారు సూత్రాలు!

ఉదయం నిద్ర లేచిన తర్వాత హుషారుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ముందు రోజు వ్యాయామం చేయటం, రాత్రిపూట ఎక్కువసేపు నిద్రించటం, ఆలస్యంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు గల అల్పాహారం తినటం మీద దృష్టి పెట్టండి.

Updated : 04 Apr 2023 04:35 IST

దయం నిద్ర లేచిన తర్వాత హుషారుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ముందు రోజు వ్యాయామం చేయటం, రాత్రిపూట ఎక్కువసేపు నిద్రించటం, ఆలస్యంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు గల అల్పాహారం తినటం మీద దృష్టి పెట్టండి. వీటిల్లో ఏ ఒక్క అలవాటుతోనైనా ఉదయం పూట హుషారుగా ఉండేలా చూసుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా అధ్యయనం పేర్కొంటోంది. ఈ మూడూ ఉంటే ఇంకా మంచిది. వీటిల్లో ఏది ఎక్కువ ప్రభావం చూపుతుందనేది బయట పడలేదు గానీ అన్నీ వాటికవే ప్రత్యేకం. దేని ఉపయోగం దానిదే. ప్రతి దాంతోనూ మంచి ఫలితం కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

* త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు ఎక్కువగా గల అల్పాహారం కీడు చేస్తుంది. దీన్ని తిన్నవారు మర్నాడు త్వరగా లేవటానికి ఇబ్బంది పడుతున్నారని, చురుకుదనం తగ్గుతోందని పరిశోధకులు గుర్తించారు. వీరికి రాత్రిపూట నిద్ర పట్టటమూ కష్టమవుతోందని తేల్చారు. అదే తవుడుతో కూడిన తృణధాన్యాల వంటి ఆలస్యంగా జీర్ణమయ్యే పిండి పదార్థంతో కూడిన అల్పాహారం తీసుకున్నవారు మర్నాడు ఉదయం నిద్ర లేవటంతోనే హుషారుగా ఉంటున్నట్టు బయటపడింది.

* ఉదయం హుషారులో నిద్ర గణనీయమైన పాత్ర పోషిస్తుందనేది తెలిసిందే. మామూలుగా కన్నా కాస్త ఎక్కువ సేపు నిద్రపోయినా ఉదయం పూట హుషారు కలిగిస్తుంది. సాధారణంగా మనకు రోజుకు 7-9 గంటల నిద్ర అవసరం. రోజంతా మన శరీరంలో అడినోసిన్‌ అనే రసాయనం పోగుపడుతూ వస్తుంటుంది. ఇది సాయంత్రం అయ్యేసరికి నిద్ర భావన కలిగిస్తుంటుంది. కాసేపు ఎక్కువ నిద్రిస్తే దీన్ని తొలగించుకోవటానికి శరీరానికి మరింత సమయం లభిస్తుంది. ఫలితంగా మర్నాడు ఉదయం ఉత్సాహం చేకూరుతుంది.

* వ్యాయామంతో కంటి నిండా నిద్ర పడుతుంది. దీంతో శరీరం బడలిక నుంచి బాగా కోలుకుంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఫలితంగా సహజంగానే మర్నాడు మంచి ఉత్సాహంతో ఉంటాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని