Updated : 16 Apr 2022 05:38 IST

నాన్న మాట!

విజయ్‌ పదో తరగతి చదువుతున్నాడు. చదువంటే అంత ఆసక్తి ఉండకపోవడంతో.. తరగతి గదిలో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవాడు. కానీ, పరీక్షలంటే మాత్రం భయం. బడి నుంచి వచ్చాక కూడా హోంవర్క్‌లాంటివి చేయకుండా  ఆటలకు వెళ్తుంటాడు. లేదంటే ఫోన్‌తో కాలక్షేపం చేసేవాడు.

వాళ్ల నాన్న సుందరం ఆటో నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పొద్దున్నే వెళ్లి, రోజంతా ఆటో నడిపి రాత్రికే ఇంటికి వస్తాడు. కొడుకు చదువు గురించి పట్టించుకునే తీరిక ఉండేది కాదు. వాళ్లమ్మ చెప్పినా విజయ్‌ పట్టించుకునేవాడు కాదు. తండ్రి వచ్చేసరికి విజయ్‌ నిద్రపోతూ కనబడతాడు. ఎప్పుడైనా మధ్యాహ్నం భోజనానికి వస్తే.. అప్పుడు బడిలో ఉంటాడు. తెల్లవారుజామునే ఆటో నడిపేందుకు వెళ్తూ.. కొడుకుని చదువుకోమని చెప్పి నిద్ర లేపుతాడు సుందరం. ‘అలాగే..’ అనేసి తండ్రి వెళ్లిపోగానే ముసుగు తన్నేస్తాడు.

విద్యార్థి జీవితానికి పదో తరగతి విలువైనదనీ, సమయం వృథా చేయవద్దని చెప్పినా పట్టించుకోని కొడుకు గురించి తల్లిదండ్రులు దిగులు పడుతుండేవారు. విజయ్‌కు చదువు మీద శ్రద్ధ పెరగాలని బడిలో ఉపాధ్యాయులు, స్నేహితులతోనూ చెప్పించారు. కానీ మార్పు రాలేదు. ‘వేకువజామున చదివితే బాగా గుర్తుంటుంది. పరీక్షల్లో చక్కగా జవాబులు రాయగలవు. బాగా చదువుకుంటే, మంచి ఉద్యోగం దొరుకుతుంది. నెలయ్యేసరికి జీతం కచ్చితంగా వస్తుంది. కాలాన్ని వృథా చెయ్యకు’ అని బామ్మ కూడా విజయ్‌కి చెబుతుండేది. ‘నువ్వూరుకో బామ్మా! ఎప్పుడూ విసిగిస్తావు. గతేడాది కరోనా వల్ల చదవకపోయినా పదో తరగతి పాసయ్యారు. ఈసారి కూడా ఏదో ఒక వైరస్‌ వస్తే నన్నూ పాసు చేస్తారులే’ అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు.

ఒకసారి సుందరం ఆటోలో రచయిత గంగారాం ప్రయాణించాడు. ఆయన్ను గుర్తుపట్టిన సుందరం మాటలు కలిపాడు. తన నేపథ్యం చెప్పిన తరవాత కొడుకు విజయ్‌ గురించి కూడా వివరించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వాడిలో మార్పు రావడం లేదని బాధపడ్డాడు.

‘రేపు ఉదయం ఒక బడిలో సమావేశానికి వెళ్తున్నాను. మీ అబ్బాయిని తీసుకుని అక్కడికి రండి’ అని అడ్రస్‌ తదితర వివరాలున్న కాగితాన్ని ఇచ్చాడు గంగారాం. మరుసటి రోజు బడికి సెలవు పెట్టించి మరీ.. కొడుకుని ఆ సమావేశానికి తీసుకెళ్లాడు సుందరం. అప్పటికే సమావేశం ప్రారంభమైంది. పిల్లలనుద్దేశించి గంగారాం మాట్లాడుతున్నాడు. చదువు ఆవశ్యకతా, భవిష్యత్తు అవకాశాలూ, ఉపాధి మార్గాలూ వివరించాడు. అందుకు ఉదాహరణగా తమ కుటుంబ విషయాన్ని కూడా ప్రస్తావించాడు.

తమ అన్నదమ్ముల్లో పెద్దవాడు తప్ప మిగతావారు బాగా చదవడం వల్ల మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుపైన అంతగా శ్రద్ధ పెట్టలేకపోయిన అన్నయ్య మాత్రం పల్లెటూరులో సాదాసీదా జీవితం గడుపుతున్నట్లు వివరించాడు.

తరవాత సుందరాన్ని చూసిన గంగారాం వేదిక మీదకు వాళ్లను రమ్మన్నాడు. తండ్రీకొడుకులిద్దరూ వెళ్లగానే.. సుందరానికి మైకు ఇచ్చి ‘నిన్న ఆటోలో వెళుతున్నప్పుడు నాతో చెప్పిన మాటల్నే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పు’ అని కోరాడు. ‘నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు రోజూ మా నాన్న వేకువనే నిద్రలేపి చదవమనేవాడు. కానీ బద్ధకించేవాణ్ని. నాన్న బయటకు వెళ్లిపోగానే మళ్లీ నిద్రపోయేవాణ్ని. ఫలితంగా బొటాబొటి మార్కులతో టెన్త్‌ పాసయ్యాను. ఇంటర్‌ ఫెయిలయ్యాను. అంతగా చదువుకోకపోవడంతో, ఇప్పుడు బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్నాను. నాన్న చెప్పినట్టు సమయం వృథా చేయకుండా.. కష్టపడితే మంచి ఉద్యోగం దొరికేది. చదువుపట్ల నిర్లక్ష్యం సరికాదు’ చెప్పాడు సుందరం.

‘ఇంతకంటే మంచి ఉదాహరణ నేను కూడా చెప్పలేను’ అంటూ సుందరాన్ని హత్తుకున్నాడు గంగారాం. పక్కనే ఉన్న విజయ్‌ ఏడ్చుకుంటూ వెళ్లి తండ్రి పాదాల మీద పడి.. ‘క్షమించండి నాన్నా. నేను చేస్తున్న పొరపాటు ఏంటో తెలిసొచ్చింది. ఈ క్షణం నుంచి మీరు చెప్పినట్లే నడుచుకుంటా. ఉదయాన్నే లేచి.. చక్కగా చదువుకుంటా’నన్నాడు. గంగారాం వైపు చూస్తూ.. నమస్కరించాడు సుందరం. ‘నువ్వే నీ కొడుకులో మార్పు తీసుకొచ్చావు’ అని విజయ్‌ భుజం తట్టాడాయన.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని