Updated : 07 Jul 2022 06:49 IST

గొప్ప మనిషి!

అనగనగా రామాపురం అనే ఊరు ఒకటి ఉండేది. వర్షాల కారణంగా ఆ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలకు మూడు రోజులు సెలవులు ఇచ్చారు. దాంతో తెలుగు మాస్టారు రామరాజు విద్యార్థులకు ఒక వినూత్నమైన హోంవర్క్‌ ఇచ్చారు. ‘మీ ఊరిలో మీకు నచ్చిన గొప్ప మనిషి గురించి పదిహేను వాక్యాల్లో వ్యాసం రాసుకొని రావాలి. ఉత్తమ వ్యాసానికి మంచి బహుమతి ఉంటుంది’ అని పిల్లలందరికీ చెప్పారాయన.

ఎనిమిదో తరగతి చదివే అన్వేష్‌ బడి నుంచి ఇంటికి చేరుకోగానే, తనకు కథలు చెప్పే తాతయ్య దగ్గరికి వెళ్లి ‘మన ఊరిలో గొప్ప వ్యక్తి ఎవరు తాతయ్య?’ అని అడిగాడు. ప్రతిరోజు పాఠశాల విషయాలు వివరించి.. కథలు చెప్పమనే అన్వేష్‌ అడిగిన ప్రశ్న విని తాతయ్యనే కాదు ఇంట్లో వారందరూ ఆశ్చర్యంగా చూశారు. ‘మన ఊరి సర్పంచి చాలా గొప్పవారు. ప్రతిరోజూ ఆయన ఇంటి ముందు, వందల మంది బారులు తీరి కనిపిస్తుంటారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని కూడా.. వారందరి కష్టనష్టాలు వినేందుకే కేటాయిస్తారాయన. మొన్న మంత్రివర్యులు కూడా ఆయన ఇంట్లో భోజనం చేసి వెళ్లారు’ అంటూ అన్వేష్‌ కుతూహలాన్ని అర్థం చేసుకున్న వాళ్ల నాన్న చెప్పారు. ఆ సమాధానం అతడికి సంతృప్తినివ్వలేదు.

అమ్మ దగ్గరికెళ్లి అడిగాడు. ‘నాకు తెలిసి జమీందారు చిన్న కోడలు రాజమణి కంటే గొప్ప వారెవరూ లేరు. ఎంతమందికైనా నవ్వుకుంటూ ఆతిథ్యం ఇచ్చే మంచి మనసు ఆమెది. అంతేకాదు.. ఆమె దగ్గర పదివేల పట్టు చీరలున్నాయి. అరవై తులాల బంగారు నగలున్నాయి. పండగలప్పుడు ఆమెకు అలంకరణకే గంటల సమయం పడుతుంది’ అని అమ్మ చెప్పిందీ అన్వేష్‌కు నచ్చలేదు. నాయనమ్మ, చిన్నాన్న, పిన్ని దగ్గరికెళ్లి అడిగి చూశాడు. నాలుగు అంతస్థుల మేడ ఉన్న నారాయణ షావుకారే గొప్ప అని ఒకరూ.. రెండు వందల ఎకరాల భూమి ఉన్న గోపాలరావు గొప్ప అని మరొకరూ, యాభై ఎకరాల పండ్ల తోటలున్న జగదాంబ గొప్ప అని ఇంకొకరూ చెప్పారు. వారి మాటలన్నీ విని పెదవి విరిచాడు బాబు.

మనవడి ఆసక్తిని గమనిస్తున్న తాతయ్య మనసులో నవ్వుకొని అన్వేష్‌ను దగ్గరికి పిలిచాడు. ‘వీరందరూ చెప్పిన విషయాలు నీకు నచ్చలేదని అర్థం అవుతోంది. ఇప్పుడెలాగూ సెలవులే కదా.. రేపు నువ్వే బయటకు వెళ్లు. ఊరంతా తిరిగి బాగా గమనించు. ఎవరు గొప్ప అని ఎవ్వరినీ అడగవద్దు. మనుషుల గొప్పతనాన్ని నీ అంతట నువ్వే గ్రహించాలి’ అని తాతయ్య చెప్పిన సలహా అన్వేష్‌కి నచ్చింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా.. అని ఆలోచించుకుంటూ అన్నం తిని నిద్రపోయాడు. మూడు రోజుల అనంతరం పాఠశాలకు వెళ్లాడు అన్వేష్‌. అందరు విద్యార్థులతోపాటు తాను రాసిన వ్యాసాన్ని కూడా సమర్పించాడు. తెలుగు మాస్టారు విద్యార్థుల వ్యాసాలన్నీ పరిశీలించారు. అందరిలోకెల్లా అన్వేష్‌ రాసిందే వినూత్నంగా ఉంది. తరగతి గదిలో అందరి ముందుకు పిలిచిన మాస్టారు.. ‘మీ ఊరిలో ఎంతో మంది ఉండగా, జామకాయలమ్మే ముసలమ్మ గురించే ఎందుకు రాశావు?’ అని ప్రశ్నించారు.

‘నిజమే మాస్టారు.. మా ఊరికి చెందిన ఉన్నత ఉద్యోగులు, పెద్ద పెద్ద నాయకులు, ధనికులు, వ్యాపారవేత్తలు, భూస్వాములు, కళాకారులు చాలామంది ఉన్నారు. వారి వల్ల మా గ్రామానికి ఈ జిల్లాలోనే మంచిపేరు వచ్చింది. కానీ, వారి వల్ల మా ఊరికి జరిగిన లాభమేంటో నాకు తెలియలేదు. అయితే.. నేను బడికి వచ్చి వెళ్లే మహాత్మాగాంధీ చౌరస్తాలో జామకాయలమ్మే ఓ ముసలమ్మను ప్రతి రోజూ చూస్తూనే ఉన్నా. ఎండా కాలమైనా, వాన పడినా.. ఆమె మాత్రం బుట్ట నిండా పండ్లతో నిత్యం అక్కడే ఉంటుంది. అంత కష్టపడే ఆమె సంపాదన.. రోజుకు వంద రూపాయలు మాత్రమే. కాయలు అమ్మితేనే, పూట గడిచే ఆ ముసలమ్మ.. గత వేసవిలో నాలుగు పెద్ద మట్టికుండలు కొని ఆ చౌరస్తా దగ్గరే చలివేంద్రం ఏర్పాటు చేసింది. ఆ మార్గంలో రాకపోకలు సాగించే బాటసారుల దాహాన్ని తీర్చింది. తనకున్న అతికొద్ది సంపాదనతో తోటివారికి సహాయం చేయాలనే ముసలమ్మ సేవా గుణం నాకు బాగా నచ్చింది. పేద విద్యార్థులకు కూడా జామకాయలు ఉచితంగా ఇస్తుంటుంది. బాగా డబ్బున్న వారందరూ తమ ఆదాయంలో కొంత భాగం సామాజిక సేవకు కేటాయించినా ఈ సమాజం బాగుపడుతుంది’ అంటూ ఎంతో వినయంగా చెబుతున్న అన్వేష్‌ను చూస్తుంటే మాస్టారికి గర్వంగా అనిపించింది. వెంటనే అతడిని దగ్గరికి తీసుకుని అభినందించారు. విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య ప్రధానోపాధ్యాయుడి చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు అన్వేష్‌. బడి పూర్తయ్యాక ఇంటికి వెళ్తూ వెళ్తూ.. ఆ బహుమతిని జామకాయలమ్మే ముసలమ్మకే ఇచ్చేశాడు.

- దుర్గమ్‌ భైతి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని