మంత్రి చూపిన పరిష్కారం

చంపక రాజ్యంలోని కొన్ని గ్రామాల మీదకు పక్కనున్న అడవుల నుంచి నక్కలు, తోడేళ్లు గుంపులుగా వచ్చి పశువుల్ని, కోళ్లను చంపుతున్నాయి. భయంతో జనం వణికి పోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే తమకూ అలాంటి గతి పడుతుందని భయంతో బయటకే రావడం లేదు.

Updated : 01 Aug 2022 00:21 IST

చంపక రాజ్యంలోని కొన్ని గ్రామాల మీదకు పక్కనున్న అడవుల నుంచి నక్కలు, తోడేళ్లు గుంపులుగా వచ్చి పశువుల్ని, కోళ్లను చంపుతున్నాయి. భయంతో జనం వణికి పోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే తమకూ అలాంటి గతి పడుతుందని భయంతో బయటకే రావడం లేదు. ఒకట్రెండు రోజులయితే ఫరవాలేదు కానీ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే పనులకు వెళ్లలేమని, ఆహారానికి ఇబ్బందులొస్తాయని ఆందోళన పడ్డారు గ్రామస్థులు.

ఆ గ్రామాల పెద్ద రాజుగారికి ఫిర్యాదు చేశాడు. సుశిక్షితులైన సైనికులను పంపించి జంతువుల బెడద లేకుండా చెయ్యమన్నాడు రాజు. గ్రామాల మీదకు వచ్చిన నక్కల్ని, తోడేళ్లను చంపేసి తిరిగి వెళ్లిపోయారు సైనికులు. గ్రామస్థులు సంతోషించారు.
కొన్ని రోజుల తరువాత పులుల గుంపు వచ్చి గ్రామాల మీద పడింది. అవి ఇద్దరు మనుషుల్ని కూడా ఎత్తుకుపోయాయి. ఈసారి సైన్యాధిపతిని పంపాడు రాజు. పులులన్నిటినీ చంపేసి వెళ్లాడు సైన్యాధిపతి. గ్రామస్థులు సంతోషంతో నాట్యం చేసి సైన్యాధిపతి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కొన్నాళ్ల వరకు వాళ్లకు ఏ సమస్యా రాలేదు.

హఠాత్తుగా సింహాల గుంపు వచ్చి గ్రామాల మీద దాడి చేసింది. వాళ్ల సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి మంత్రిని తీసుకుని స్వయంగా వెళ్లాడు రాజు. ముందుగా గ్రామాల మీద పడి భయానక పరిస్థితులను సృష్టించిన సింహాలన్నింటినీ చంపేశారు. మరి కొన్నింటిని అడవుల్లోకి తరిమేశారు.

గ్రామాల చుట్టూ ఉన్న పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించాడు మంత్రి. ‘ఇక్కడి సమస్యకు పరిష్కారం జంతువులను చంపినా, తరిమేసినా తీరదు. శాశ్వత పరిష్కారం ఆలోచించాలి’ అన్నాడు. ఏం చెయ్యాలో చెప్పమన్నాడు రాజు. బాగా ఆలోచించిన మంత్రి ఒక సలహా ఇచ్చాడు.

ఆ ప్రకారం గ్రామాల చుట్టూ లోతైన కందకాలను తవ్వించారు. గ్రామాల్లోని ధైర్యవంతులైన యువకులను రప్పించి క్రూర జంతువులను ఎదుర్కోవడంలో శిక్షణ ఇచ్చారు. అత్యవసర పని ఉండి రాజధానికి వెళ్లిపోయాడు రాజు. కొందరు సైనికులతో అక్కడే కొన్నాళ్లు ఉన్నాడు మంత్రి. తరువాత ఆ గ్రామస్థుల నుంచి మరే ఫిర్యాదూ రాలేదు. రాజ్యపాలనలో మునిగిపోయిన రాజు కూడా ఆ సంగతి మరిచిపోయాడు.

కొన్నేళ్ల తరువాత ఆ గ్రామాల మీదుగా రాజుగారి పరివారం వెళ్లడం చూసిన గ్రామపెద్ద రాజుగారిని కలిశాడు. ఆయనకు నమస్కరించి తమ సమస్య తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. మంత్రిగారి వైపు చూసి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడతడు. అందుకు ఆశ్చర్యపోయిన రాజు.. ‘మేమిద్దరం వచ్చినప్పుడే మీ సమస్య తీర్చాం కదా. ప్రత్యేకంగా మంత్రిగారేమైనా సహాయపడ్డారా?’ అనడిగాడు. గ్రామపెద్ద.. ‘తమరు వెళ్లిన తరువాత కూడా మంత్రిగారిక్కడ ఉన్నారు. అప్పుడాయన కొందరు యువకులతో కలసి అడవుల్లో తిరిగారు. మరిన్ని చర్యలు తీసుకున్నారు. అందుకే ఆయనకు ధన్యవాదాలు చెప్పాను’ అన్నాడు.

‘అలాగా! అవేమిటో చెప్పండి’ అని మంత్రిని అడిగాడు రాజు. ‘మనం పంపిన సైన్యం, సైన్యాధిపతి ఇక్కడకు వచ్చి చేసినట్టే మనమూ చేస్తే మళ్లీ ఆ సమస్య వస్తుందని అంచనా వేశాను. వాళ్ల సమస్య పూర్తిగా తీరాలంటే ఏం చెయ్యాలో అనుకుని అడవుల్లోకి వెళ్లాను. అక్కడొక విషయం గమనించాను. అడవిలోని చెట్లను కలప వ్యాపారులు విపరీతంగా నరికేసి తరలించడం వల్ల చెట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫలితంగా వర్షాలు తగ్గాయి. చెరువుల్లోని నీరు తొందరగా ఎండిపోయేది. చెట్లు నరకడం వల్లనే ఇక్కడి జంతువులకు స్థావరాల కొరత, తాగునీటి కొరత వచ్చి, నీటికోసం గ్రామాల్లోకి వెళ్లేవని.. అలా వెళ్లిన జింకలు, కుందేళ్లను గ్రామస్థులు ఆహారం చేసుకునేవారని తెలిసింది. సాధుజంతువులు తగ్గిపోవడంతో పులులు, తోడేళ్లు, సింహాలకు ఆహారం కొరత వచ్చిందని, అందుకే గ్రామాల మీద పడి దొరికిన వాటిని చంపేస్తున్నాయని కనిపెట్టా. ఆ సమస్యను తీర్చడం కోసం అడవుల్లో అనేక వేల మొక్కలు నాటించాను. వాటిని శ్రద్ధగా పెంచమని శిక్షణ పొందిన యువకులకు చెప్పాను. సాధు జంతువులను చంపవద్దని హితబోధ చేశాను. ఇక్కడి సైనికాధికారితో మాట్లాడి కలప అక్రమ రవాణా చేసేవారిని బంధించమన్నాను. చెరువులు తవ్వించమన్నాను. అలా చెయ్యడం వల్ల అడవి పచ్చని చెట్లతో నిండింది. సమస్యలూ తగ్గాయి. మన అధికారినడిగి ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రగతి తెలుసుకుంటున్నా’ అన్నాడు మంత్రి.

‘సమస్య తాలూకా కొమ్మల్ని కత్తిరిస్తే తాత్కాలిక విజయం దక్కుతుందే కానీ పూర్తి పరిష్కారం దొరకదని, నిశితంగా పరిశీలించి ఆలోచించినప్పుడే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని మీరు నిరూపించారు’ అన్నాడు రాజు సంతోషంతో.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని