Published : 15 Aug 2022 01:43 IST

గుగ్గిళ్లతో గుణపాఠం!

అన్నదమ్ములే అయినా శేషాచలం, గరుడాచలం ఇద్దరికీ క్షణం పడేది కాదు. పక్కపక్కనే ఇళ్లు కావడంతో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ పరస్పరం కక్షలు, కార్పణ్యాలు పెంచుకున్నారు. అన్నదమ్ములు ఇలా ఉంటే తోటి కోడళ్లు ఎలా ఉంటారు? వాళ్లూ... ఉప్పు, నిప్పులా ఉండేవారు.

అదృష్టం.. పిల్లలు మాత్రం పెద్దలకు తెలియకుండా బడిలోనూ, గుడిలోనూ కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఆడుకుంటూ ఉండేవారు. ఒకసారి శేషాచలం ఏదో తీర్థయాత్రకు సకుటుంబంగా వెళ్లాడు. అదే అదనుగా గరుడాచలం అన్న ఇంటిని తగలబెట్టాలనుకున్నాడు. ఒకరాత్రి అందరూ నిద్రపోయాక ముందు జాగ్రత్తగా తమ తాటాకు ఇంటి మీద బిందెలు బిందెలు నీళ్లు పోసి తడిపి పెట్టుకున్నారు అతనూ, అతని భార్య. ఆ తర్వాత గరుడాచలం అన్న ఇంటిపై కిరసనాయిల్‌ పోసి నిప్పంటించాడు. మంటలు బాగా పెరిగాక... ‘మంటలు బాబోయ్‌... మంటలు’ అని అమాయకుడిలా అరవడం మొదలు పెట్టాడు.

ఊర్లోవాళ్లు కొందరు పరుగున వచ్చి శేషాచలం ఇంటిపై బకెట్లతో నీళ్లు పోస్తుంటే.. ఇంకొందరు గరుడాచలం ఇంటికి మంటలు సోకకూడదని కొన్ని బిందెలతో అతని ఇంటిపైన కూడా పోయడం మొదలుపెట్టారు. ఊళ్లోవాళ్లు ఎంత ప్రయత్నించినా... శేషాచలం ఇల్లు మొత్తం సామానుతో సహా తగలబడిపోయి మొండి గోడలతో మిగిలింది.

శేషాచలం తిరిగి వచ్చేసరికి కాలి, మసి పట్టిన మొండి గోడలతో ఇల్లు దర్శనం ఇచ్చింది. శేషాచలం కుటుంబం ఒక్కసారిగా దుఃఖంతో కుప్పకూలిపోయినా... తమ్ముడు గరుడాచలం కానీ, మరదలు కానీ వచ్చి వారిని పలకరించలేదు. కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. కట్టుబట్టలతో మిగిలిపోయిన శేషాచలం, చేసేది లేక ఆ మొండి గోడల ఇంట్లోనే ఉండటం మొదలెట్టాడు. ఇది గరుడాచలం పనేనని అతని మనసు చెబుతూనే ఉంది. అందుకే ఒకరాత్రి గుట్టు చప్పుడు కాకుండా తమ్ముడు ఇంటినీ కాల్చేశాడు.

ఇప్పుడు ఇద్దరూ సమాన స్థాయికి చేరుకున్నారు. అయినా... వారి మధ్య కోపతాపాలు పెరిగాయి తప్ప తగ్గలేదు. ఇద్దరూ తమ తమ మొండి గోడల ఇళ్లలోనే కట్టుబట్టలతో జీవిస్తూ కాలం గడుపుతున్నారు. వారం రోజులు గడిచింది. మొండి గోడల మధ్యనే తాటాకులతో చెరొక గది కట్టుకున్నారు. తప్ప.. పూర్తిగా ఇంటిని నిర్మించుకోలేదు. కారణం మళ్లీ తమ్ముడు తగలబెడతాడని అన్నకు, అన్న తగలబెడతాడని తమ్ముడికి భయం.

ఓ రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. తాత్కాలికంగా కట్టుకున్న తాటాకు గదులు కొట్టుకుపోయాయి. రెండు కుటుంబాలు వానలో తడిసి ముద్దయ్యాయి. ఇది తెలిసి జాలిపడి ఊరి పెద్ద వెంకటాచలం అన్నదమ్ముల కుటుంబాలను తమ ఇంటికి పిలిచారు. వాన తగ్గేదాకా తమ వసారాలో తలదాచుకోమన్నారు. సోదరులిద్దరూ వెంకటాచలం గారి వసారాలోకి మకాం మార్చారు. అరుగులపై ముడుచుకు పడుకున్నారంతా. పిల్లలు ఆకలికి తాళ లేకుండా ఉన్నారు. పెద్దల పరిస్థితీ అదే!

ఆ సమయంలో వెంకటాచలం వసారాలోకి వచ్చి... ‘ఇవ్వాళ మా ఇంట్లో కూడా బియ్యం నిండుకున్నాయి. రేపు మిల్లు నుంచి తెప్పించాలి. పెసల గుగ్గిళ్లు చేయించాను. చెరొక అర్ధశేరు ఇస్తాను. వాటితో ఈ పూటకి ఎలాగో అలా సర్దుకోండి’ అని  చెరో పాత్రలో గుగ్గిళ్లు ఇచ్చి లోపలికి వెళ్లిపోయారు.

ఆకలికి నకనకలాడుతున్న శేషాచలం తనకిచ్చిన పాత్రలో నుంచి గుప్పెడు గుగ్గిళ్లు తీసి ఆత్రంగా నోట్లో పోసుకున్నాడు. వెంటనే... ‘ఉప్పు కషం.. ఈ గుగ్గిళ్లు... ఎవరు తింటారు’ అంటూ ఊసేశాడు. శేషాచలమే తినలేకపోతే పిల్లవాడు, భార్య ఎలా తినగలరు? వాళ్లూ ఆ పాత్రను పక్కకు పెట్టేశారు.   ‘తగిన శాస్తి జరిగింది అన్నకు’ అనుకున్నాడు తమ్ముడు ఆ సమయంలో కూడా! తమ పాత్రలోవి ఎలా ఉన్నాయోనని ఓ గుప్పెడు నోట్లో వేసుకుని ఉమ్మేశాడు. ‘చప్పగా చచ్చాయి.. ఈ కొంపలోవాళ్లకి వీటిలో కొంచెం ఉప్పు వెయ్యాలి అని కూడా తెలియదా’ అన్నాడు చిరాకుగా. రెండు కుటుంబాలకు కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయి. అలాగే అరుగుల మీద పడుకున్నారు.

అర్ధరాత్రి ఏదో అలికిడికి అన్నదమ్ములు ఇద్దరూ లేచి చూసేసరికి గరుడాచలం కొడుకు, శేషాచలం కొడుకు గుగ్గిళ్ల పాత్రలు దగ్గర పెట్టుకుని హాయిగా తింటున్నారు. ‘అవెలా తింటున్నావురా! పిచ్చి వెధవా.. అవి అసలే ఉప్పు కషంగా ఉంటేను’ అని శేషాచలం కొడుకును అరిస్తే... ‘మన గుగ్గిళ్లు చప్పగా చచ్చాయి.. కదరా?’ అని కొడుకును తిట్టాడు గరుడాచలం. అప్పుడు పిల్లలిద్దరూ నవ్వుతూ చెరొక దోసెడు గుగ్గిళ్లు తీసి అన్నదమ్ముల చేతుల్లో పోసి, తిని చూడమన్నారు. ‘అరె.. ఇప్పుడు రుచిగానే ఉన్నాయే’ అన్నారు శేషాచలం, గరుడాచలం ఏకకంఠంతో. ‘అవును నాన్నా... బాబాయి గుగ్గిళ్లు చప్పగా.. మన గుగ్గిళ్లు ఉప్పగా ఉండటంతో వాటిని మేం కలిపేశాం. అంతే... గుగ్గిళ్లు చక్కగా తినడానికి రుచిగా తయారయ్యాయి’ అన్నాడు శేషాచలం కొడుకు. అదే సమయంలో తోటి కోడళ్లు కూడా లేచారు. అందరూ మాట్లాడుకుంటూ గుగ్గిళ్లు పంచుకుని తిన్నారు. ఆకలి బాధ తప్పడంతో అందరికీ కాస్త ప్రాణాలు లేచి వచ్చాయి.

అంతలోనే వెంకటాచలం ఇంట్లో నుంచి లేచి వచ్చి.. ‘మీ పిల్లలకు ఉన్న బుద్ధి, జ్ఞానం మీ అన్నదమ్ములకు లేదయ్యా! కలిసి ఉంటేనే, కలిసి తింటేనే కుటుంబ పరువు నిలబడుతుంది. బలం పెరుగుతుంది. అది తెలియడానికే ఈ ఎత్తు వేసి మిమ్మల్ని పిలిపించాను. ఇకనైనా కలిసిమెలిసి ఉండండి’ అని చెప్పారు. అన్నదమ్ములకు తమ తప్పు తెలిసి వచ్చింది. పెద్దలకు బుద్ధి తెచ్చిన పిల్లలను ముద్దాడారు తోటికోడళ్లు. తెల్లారి ఇద్దరన్నదమ్ములు కలిసే తమ ఇళ్లకు తాటాకులు కొట్టుకు రావడానికి ఒకే బండిని కిరాయికి మాట్లాడుకుని తీసుకుని వెళ్లారు.

- చంద్ర ప్రతాప్‌ కంతేటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని