విద్యార్థుల విహారయాత్ర!

కార్తిక మాసం వచ్చిందంటే వాడవాడలా వనభోజనాలు, పిక్నిక్‌ల హడావిడి కనిపిస్తుంటుంది. రవీంద్ర మాస్టారు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఆయన సహాయ ఉపాధ్యాయులు వాణి, రాజు. ఆదివారం విహారయాత్రకు వెళ్దామని పిల్లలతో చెప్పారు ఉపాధ్యాయులు.

Published : 05 Nov 2022 00:19 IST

కార్తిక మాసం వచ్చిందంటే వాడవాడలా వనభోజనాలు, పిక్నిక్‌ల హడావిడి కనిపిస్తుంటుంది. రవీంద్ర మాస్టారు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఆయన సహాయ ఉపాధ్యాయులు వాణి, రాజు. ఆదివారం విహారయాత్రకు వెళ్దామని పిల్లలతో చెప్పారు ఉపాధ్యాయులు. పాతికమంది మాత్రమే రావడానికి సిద్ధమయ్యారు. ఆ రోజు ఉదయాన్నే పాఠశాల నుంచి పిల్లలు బయలుదేరారు. రోడ్డు మధ్యలో వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఖాళీ ఉంచి అటు ఇటుగా రెండు వరుసల్లో పిల్లలు నడుస్తున్నారు. వారి ముందు ఉపాధ్యాయులు.. వెనక ప్రధానోపాధ్యాయులు వారిని జాగ్రత్తగా గమనిస్తున్నారు.

ఇంతలో గొర్రెల మంద ఎదురైంది. వాటికి ఎదురుగా లారీ వస్తోంది. పిల్లలంతా అటుఇటుగా వరసలో నడుస్తూ అలా ఆగిపోయారు. లారీని డ్రైవర్‌ పక్కకు ఆపడంతో.. గొర్రెల మంద ఆ వాహనానికి ఢీకొట్టుకుంటూ, వాటిలో అవే తలలు గుద్దుకుంటూ ముందుకు నడుస్తున్నాయి. పిల్లలంతా వేచి చూసి, అవి వెళ్లిపోయిన తరువాత ముందుకు కదిలి విహారయాత్రా ప్రదేశానికి చేరుకున్నారు. పిల్లలు గుంపుగా వెళుతుంటే రవీంద్ర మాస్టారు విజిల్‌ వేశారు. అది వినగానే.. పిల్లలంతా గప్‌చుప్‌ అయిపోయారు. 

‘చూడండి.. పిల్లలూ! క్యూలో నిలబడటం వల్ల అందరికీ అల్పాహారం చక్కగా అందుతుంది. ముందు క్రమశిక్షణ అలవర్చుకోండి’ అన్నారు రవీంద్ర మాస్టారు. ఉపాధ్యాయులు, పిల్లలందరూ కలిసి అల్పాహారం తిన్నారు. ‘పిల్లలూ! మీరంతా ఆ చెట్టు కింద శుభ్రం చేసి, పట్టాలు వేసుకొని కూర్చోండి. ఇప్పుడు రాజు మాస్టారు మీతో ఆటలాడిస్తారు. వాణి టీచర్‌ పాటలు పాడిస్తారు. విజేతలకు బహుమతులు ఉంటాయి’ అని రవీంద్ర మాస్టారు చెప్పారు. ఆ విధంగానే చెట్టు కింద శుభ్రం చేసిన తరువాత ఆటలాడించి, పాటలు పాడించారు. ‘భోజనం చేసే ముందు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. తిన్న తర్వాత నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఊయాలి’ అని ప్రధానోపాధ్యాయుడు చెప్పగానే.. పిల్లలందరూ తూ.చా. తప్పకుండా పాటిస్తామన్నారు. 

ఆటలయ్యాక పిల్లలందరూ తృప్తిగా భోజనాలు చేశారు. ఎక్కువమంది సినిమా పాటలు పాడినా, కొంతమంది దేశభక్తి గీతాలు కూడా ఆలపించారు. పిల్లలందరూ ఒకరితో ఒకరు పోటీపడి పాడారు. సాయంత్రం కావస్తుండగా ఉపాధ్యాయులందరూ కలిసి పిల్లలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆటలు, పాటల పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. చివరిగా ప్రధానోపాధ్యాయులు రవీంద్ర మాస్టారు.. ‘పిల్లలూ.. విహారయాత్రకు బయలుదేరిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు, మీరు గమనించిన అంశాలతోపాటు మీ అనుభవాలను తెలియజేయండి’ అని అడిగారు. వెంటనే.. గీత నిలబడి.. ‘మనం సరదాగా వచ్చాం... సరదాగా వెళుతున్నాం’ అని చెప్పింది. ‘మంచి దేశభక్తి గీతాలు పాడుకున్నాం’ అంటూ స్వరాజ్యం అంది. ‘ఆ పాటల వల్ల మనం మన దేశం గురించి తెలుసుకోవడంతోపాటు ఎందరో మహానుభావుల గొప్పతనం అందరికీ అర్థమైంది’ అన్నారు రవీంద్ర మాస్టారు.
‘ఈ పాటల పోటీ వల్ల అందరం మన ఐక్యతను చాటి చెప్పాం’ అని భరత్‌ చెప్పాడు. ‘ఇప్పటి వరకు ముగ్గురు తమ అనుభవాలు బాగా చెప్పారు. ఇంకెవరైనా నిలబడి చెప్పండి’ అని వాణి టీచర్‌ అడిగారు. ‘విద్యార్థులమంతా ఒకే వరసలో కూర్చుని సరదాగా భోజనం చేశాం’ అని తరుణ్‌ అన్నాడు.

‘అవును పిల్లలూ... ఇటువంటి కార్యక్రమాల వల్ల మనలో ఐక్యత పెరుగుతుంది’ అని వాణి టీచర్‌ చెప్పారు. తర్వాత రవీంద్ర మాస్టారు.. ‘వివేక్‌.. ఇందాక నీ అనుభవాలను నాతో పంచుకున్నావు కదా. వాటిని మరలా ఇక్కడ అందరికీ చెప్పు.. వింటారు’ అన్నారు. వివేక్‌ నిల్చుని చేతులు కట్టుకున్నాడు. ‘అందరూ జాగ్రత్తగా వినండి’ అంటూ మాస్టారు అప్రమత్తం చేశారు.

‘మనం బయలుదేరి కొంత దూరం వచ్చేసరికి, గొర్రెల మంద ఎదురైంది. ఆ గొర్రెలు ఎదురుగా వస్తున్న లారీని కూడా గమనించలేదు. దాన్ని రాసుకుంటూ, పడిపోతూ లేస్తూ నడిచాయి. అవే ఒకదాని వెనుక మరోటి వరసగా వెళితే వాటికి ఏ ఇబ్బందీ ఉండేది కాదు’ అని చెప్పాడు వివేక్‌. ‘ఇంకా?..’ ప్రశ్నార్థకంగా చూశారు మాస్టారు. ‘మనం కూర్చున్న చోట చీమలన్నీ ఒకదాని వెనుక మరోటి నడుస్తున్నాయి. శుభ్రం చేసే క్రమంలో ఆ వరస చెల్లాచెదురైంది. కానీ, కాసేపటికి.. మళ్లీ అవన్నీ వరసకట్టాయి. వాటి క్రమశిక్షణ చూసి నాకు భలే అనిపించింది’ అని వివరించాడు వివేక్‌. ‘పిల్లలూ.. బయటకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, రోడ్డు మీద ఒక పక్కగా వరసలో ఎలా నడవాలో, చీమలను చూసి క్రమశిక్షణగా ఎలా మెలగాలో తెలుసుకున్నాం’ అని రవీంద్ర మాస్టారు అనగానే పిల్లలంతా ఒకేసారి చప్పట్లు కొట్టారు. పిక్నిక్‌కు వచ్చిన పిల్లలందరికీ మంచి పెన్నులు బహూకరించారు ఉపాధ్యాయులు.

- బెహరా ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని