పెద్దల మాట చద్దన్నం మూట!

ఒక ఇంట్లో అటక మీద ఎలుకలు నివాసం ఉండేవి. అందులో కొన్ని పెద్దవి, ఇంకొన్ని చిన్నవి. పెద్ద ఎలుకలు ఎప్పుడూ పిల్ల ఎలుకలకు జాగ్రత్తగా ఉండాలని మంచి బుద్ధులు చెబుతుండేవి. కానీ అవి ఆ మాటలు ఏ మాత్రం పట్టించుకునేవి కాదు. పైగా.. ‘మీదంతా చాదస్తం. ఏ పని సరిగ్గా చేయనివ్వరు. అసలు ఎలా ఉండాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి’ అని మూర్ఖంగా మాట్లాడేవి. ఎలుకలన్నీ ఒకసారి ఆహారం కోసం బయలుదేరాయి.

Updated : 11 Feb 2024 04:11 IST


క ఇంట్లో అటక మీద ఎలుకలు నివాసం ఉండేవి. అందులో కొన్ని పెద్దవి, ఇంకొన్ని చిన్నవి. పెద్ద ఎలుకలు ఎప్పుడూ పిల్ల ఎలుకలకు జాగ్రత్తగా ఉండాలని మంచి బుద్ధులు చెబుతుండేవి. కానీ అవి ఆ మాటలు ఏ మాత్రం పట్టించుకునేవి కాదు. పైగా.. ‘మీదంతా చాదస్తం. ఏ పని సరిగ్గా చేయనివ్వరు. అసలు ఎలా ఉండాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి’ అని మూర్ఖంగా మాట్లాడేవి. ఎలుకలన్నీ ఒకసారి ఆహారం కోసం బయలుదేరాయి. వాటికి ఒక పెద్ద పెట్టె లాంటిది కనిపించడంతో ముందు, వెనక ఆలోచించకుండా అందులోకి దూకేసి.. ఇరుక్కుపోయాయి పెద్ద ఎలుకలు. అప్పుడు గానీ.. వాటికి అర్థంకాలేదు అది వాటిని పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన బోను అని. అది చూసిన పిల్ల ఎలుకలు బయట నుంచే పక పకమని నవ్వసాగాయి. ‘చూశారా.. ఇప్పుడు ఏమైందో? మాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెబుతారు. కానీ ఏం ఆలోచించకుండా వెళ్లి మీరే బోనులో చిక్కిపోయారు. ఇప్పటికైనా అర్థమైందా? తెలివితేటల్లో మేమే గొప్ప’ అంటూ వెటకారంగా మాట్లాడాయవి. అయినా పెద్ద ఎలుకలు బాధ పడలేదు.. ‘మేము ఏం చెప్పినా.. మా అనుభవంతోనే చెబుతాం. దాన్ని పాటిస్తే.. మీకే మంచిది. పెద్దల మాట చద్దన్నం మూట అని ఎప్పటికైనా మీకే తెలుస్తుంది’ అన్నాయి. కాసేటికి ఎలాగోలా అందులో నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాయవి.

ఒకరోజు.. మళ్లీ ఎలుకలన్నీ ఆహారం వెతుక్కుంటూ ఆ ఇంటి పెరట్లోకి వెళ్లాయి. అక్కడ వాటికి ఒక పెద్ద బుట్ట లాంటిది కనిపించింది. దానికి ఒక కన్నం కూడా ఉంది. ఈసారి పెద్ద ఎలుకలు కొంచెం తెలివిగా ప్రవర్తించాయి. అది చూసిన పిల్ల ఎలుకలు.. ‘ఇక్కడ ఇంత పెద్ద బుట్ట ఉంది. అందులో మనకు కావాల్సిన ఆహారం ఉన్నట్లు వాసన కూడా వస్తోంది. లోపలికి వెళ్లడానికి ఎంచక్కా కన్నం ఉంది. వెంటనే ఆ ఆహారాన్ని మనం తినేయాలి’ అంటూ ముందుకు కదిలాయి. దాంతో పెద్ద ఎలుకలు.. ‘మీరు తొందరపడకండి.. కనీసం ఇప్పుడైనా మా మాట వినండి. ఆ బుట్టకు ముందే కన్నం పెట్టి ఉందంటే కచ్చితంగా అందులో ఏదో ప్రమాదం ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మనుషులు మన కన్నా చాలా తెలివిగా ఆలోచిస్తారు. మనం ఇష్టంగా తినే ఆహారం అందులో పెట్టి, మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సులువుగా మనల్ని పట్టుకోవడానికి ఈ మధ్య ఎన్నో రకాల ఎలుకల ఉచ్చులు వచ్చాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ దూకుడు పనికిరాదు’ అని వాటిని వారించబోయాయి. ఆ మాటలకు పిల్ల ఎలుకలు ఎగతాళిగా నవ్వాయి. ‘మీ చాదస్తపు మాటలు మేం ఇక వినదలుచుకోలేదు. మీ తెలివితేటలు ఉపయోగించి ఒకసారి బోనులో ఇరుక్కున్న విషయం మర్చిపోయారా? మేం మీలా కాదు. చాలా తెలివిగా వ్యవహరిస్తాం.. చూస్తూ ఉండండి. ఇలా వెళ్లి అలా ఆహారం తిని తిరిగొస్తాం’ అని చెబుతూ.. ఆ కన్నంలోంచి లోపలికి వెళ్లాయవి. ఆ తర్వాత ఎంతసేపటికీ.. అవి బయటకు రాలేదు. దాంతో పెద్ద ఎలుకలు భయపడిపోసాగాయి. ఎలాగైనా వాటిని రక్షించాలనుకున్నాయి. కానీ వాటికి ఏం చేయాలో తోచడంలేదు. అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. కాసేపటికి అక్కడికి ఆ పెరట్లోనే ఉండే.. ఒక చిన్న కుందేలు వచ్చింది. విషయమంతా తెలుసుకుంది. పెద్ద ఎలుకలు, ఆ కుందేలు కలిసి.. చిన్న ఎలుకలను ఆ బుట్టలో నుంచి ఎలాగోలా బయటకు తీసుకువచ్చాయి. ఆ తర్వాత పిల్ల ఎలుకలు.. ‘మమ్మల్ని క్షమించండి. మీరు ఎంత చెప్పినా వినకుండా మొండిగా వాదించాం. చివరికి ఆ బుట్టలో ఇరుక్కున్నాం. ఇంకొకరి సాయం లేకుండా బయటకు రాలేకపోయాం. ఇక నుంచి మీరు చెప్పినట్లే వింటాం’ అని వినయంగా చెప్పాయి పెద్ద ఎలుకలకు. అప్పుడు అవి.. ‘మేము ఎప్పుడూ మీ మంచిని మాత్రమే కోరుకుంటాము. అన్నీ ఆలోచించే సలహాలు అందిస్తాము. మీరేం భయపడకండి.. మేము ఉన్నాం కదా!’ అన్నాయి. ఇక అన్నీ కలిసి సంతోషంగా అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లిపోయాయి.

నంద త్రినాథరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని