నీటి ఆవు తాతయ్య... రికార్డు కొట్టాడయ్యా!

‘ఏనుగంత ఆకారం... గుండ్రని తల... పొట్టి తోక... రెండు కాళ్లు... నీటిలో ఉంటుంది... ఏమిటో చెప్పుకోండి చూద్దాం?’ అని మీ స్నేహితుల్ని అడిగితే కచ్చితంగా చెప్పలేరు. ఇలాంటి రూపం ఉండే ఆ జీవి పేరు ‘సీ కౌ’. అంటే నీటి ఆవు అన్నమాట. సముద్రాల్లో, నదుల్లో జీవించే వీటిలో ఒకటి రికార్డు సాధించింది. ఎందుకో చూద్దాం.

Updated : 08 Dec 2022 20:14 IST

అనగనగా ఓ నీటి ఆవుంది...ఒక్కసారే దానికి చాలా గుర్తింపొచ్చేసింది...ఎందుకంటే అది పెద్ద ఘనతే సాధించింది...ఆ విశేషాలేంటో చదివేద్దామా?

‘ఏనుగంత ఆకారం... గుండ్రని తల... పొట్టి తోక... రెండు కాళ్లు... నీటిలో ఉంటుంది... ఏమిటో చెప్పుకోండి చూద్దాం?’ అని మీ స్నేహితుల్ని అడిగితే కచ్చితంగా చెప్పలేరు. ఇలాంటి రూపం ఉండే ఆ జీవి పేరు ‘సీ కౌ’. అంటే నీటి ఆవు అన్నమాట. సముద్రాల్లో, నదుల్లో జీవించే వీటిలో ఒకటి రికార్డు సాధించింది. ఎందుకో చూద్దాం.

* స్నూతీ అనే ఓ నీటి ఆవు ఈమధ్య వార్తల్లోకి వచ్చింది. జనం దాన్ని చూసేందుకు, ఫొటోలు తీసుకునేందుకు తెగ ముచ్చటపడిపోతున్నారు. ఎందుకో తెలుసా? నీటి ఆవుల్లో ఇదే ఎక్కువ కాలం బతికిందట! అంటే వాటిల్లో ఇదే తాతగారన్నమాట. దీని వయసు ఏకంగా 68 ఏళ్లట. మామూలుగా అయితే నీటి ఆవులు నిండా పదేళ్లు కూడా బతకలేవు. అలాంటిది ఇది ఏకంగా ఇన్నేళ్లు బతికేయడంతో గిన్నిస్‌ పుస్తకం వాళ్లు వచ్చి పరీక్షలూ అవీ చేసి, ప్రపంచ రికార్డు ఇచ్చేసి చక్కాపోయారు.

* ఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న ‘సౌత్‌ ఫ్లోరిడా మ్యూజియం’లో ఉంది. 1949లో ఇది పదకొండు నెలల పిల్లగా ఉన్నప్పుడు మ్యూజియం వాళ్లు దీన్ని తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇది హాయిగా కాలక్షేపం చేస్తూ బతికేసింది.

మీకు తెలుసా?
* నీటి ఆవులు 15 నిమిషాలపాటు వూపిరి తీసుకోకుండా ఉండిపోగలవు.

* పిల్ల నీటి ఆవులు పుట్టిన గంటలోపే ఈత కొట్టడం నేర్చేసుకుంటాయి.

* ఇవి 13 అడుగుల వరకు పొడవు, 600 కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఇంత బరువున్నా ఇవి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈత కొట్టేయగలవు.

* నీళ్లలో పెరిగే నాచు, ఆకుల్ని తిని బొజ్జ నింపుకుంటాయి. యాంటిలియన్‌ జాతికి చెందినవి మాత్రం మాంసాహారులు. * భూమిపై జీవించే నాలుగు కాళ్ల జంతువుల నుంచే ఆరుకోట్ల ఏళ్ల క్రితం పరిణామ క్రమంలో ఇవి పుట్టుకొచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని