వంటగది వ్యర్థాలతో కాగితం!

పండ్ల తొక్కలు.. కూరగాయల వ్యర్థాలను మనమైతే ఏం చేస్తాం?.. ఇంకేం చేస్తాం.. చెత్తబుట్టలో పడేస్తాం. మహా అయితే మొక్కలకు ఎరువుగా వాడతాం. కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా వాటితో కాగితాలే తయారు చేస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజంగా నిజం. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

Updated : 09 Jul 2021 06:08 IST

పండ్ల తొక్కలు.. కూరగాయల వ్యర్థాలను మనమైతే ఏం చేస్తాం?.. ఇంకేం చేస్తాం.. చెత్తబుట్టలో పడేస్తాం. మహా అయితే మొక్కలకు ఎరువుగా వాడతాం. కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా వాటితో కాగితాలే తయారు చేస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజంగా నిజం. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!
పదేళ్ల మాన్య హర్ష బెంగళూరులో ఆరో తరగతి చదువుతోంది. ఆ చిట్టి బుర్రలో ఎన్నో ఆలోచనలు.. ఇంకెన్నో సందేహాలు. ఏ చిన్న అనుమానం వచ్చినా ఇంట్లో వాళ్లను అడిగి మరీ తెలుసుకునేది. ఇంకా చిన్నారికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడటం కోసం ఉడతాభక్తిగా తనకు తోచిన సాయం చేస్తోంది. అందులో భాగమే వంటగది వ్యర్థాలతో కాగితం తయారీ!

తొక్కల్ని సేకరించి..

రోజూ వాళ్లమ్మ ఇంట్లో వంట చేయగా మిగిలిన వ్యర్థాలు, పండ్లు, కూరగాయల తొక్కలను సేకరిస్తుంది. వాటిని పెద్దల సాయంతో ఉడకబెడుతుంది. కొన్ని ప్రక్రియల ద్వారా వాటి నుంచి కాగితాల్ని తయారు చేస్తోంది. తను చేసే హేండ్‌మేడ్‌ వెజిటేబుల్‌ పేపర్‌ను, అచ్చం మామూలు కాగితంలాగే వాడొచ్చంట. అంత చిన్న వయసులో ఇంత గొప్ప ఆలోచన రావడం, దాన్ని అమలు పరచడం నిజంగా గొప్పే.

పర్యావరణాన్ని కాపాడదాం..

‘ఒకరోజు సరదాగా బెంగళూరు నగరం అంతా తిరుగుదాం అని కుటుంబంతో సహా బయలుదేరాను. కానీ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే నగరం.. రోడ్డు పక్కల చెత్తతో చాలా దారుణంగా కనిపించింది. నాకు చాలా బాధేసింది. దీనికి పరిష్కారం లేదా? అని ఆలోచించాను. అప్పుడే నాకు ఈ ఉపాయం తట్టింది. కాగితం చేయడానికి చెట్లను నరికే బదులు, వంటగది వ్యర్థాలను ఉపయోగిస్తే అటు పర్యావరణ కాలుష్యం ఉండదు. ఇటు భూమ్మీద చెట్లూ సురక్షితంగా ఉంటాయి కదా అనిపించింది. అదే అమలు చేశాను. ఈ ఆలోచనను మనందరం అమలు పరిస్తే ప్రకృతిని మనం కాపాడిన వారమవుతాం’ అని చెప్పుకొచ్చింది మాన్య.

పుస్తకాలూ రాసింది..

అంతేకాదు నేస్తాలూ..! మన మాన్య పర్యావరణానికి సంబంధించి ఏకంగా అయిదు పుస్తకాలనూ రాసేసింది. తనకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే స్థానిక పిల్లలతో కలిసి ‘సేవింగ్‌ వాటర్‌’ అంటూ వాక్‌థాన్‌ జరిపింది. ఇంకా.. ‘ఈచ్‌వన్‌ ప్లాంట్‌వన్‌’ పేరిట 236 మందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందినీ భాగస్వాముల్ని చేసింది. ఇలా తన కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులూ అందుకుంది. ప్రశంసలూ సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని