అయ్య బాబోయ్‌.. అవాక్కై పోవాల్సిందే!

రెండు చేతులతో అయిదు రకాల రూబిక్‌ క్యూబ్స్‌ను సాల్వ్‌ చేస్తూ.. కాళ్లకు స్కేటింగ్‌ షూస్‌ ధరించి, నడుము చుట్టూ ఓ రెండు మూడు హూలాహూప్‌ రింగ్‌లను తిప్పగలరా? అసలు సాధ్యమేనా?! చేయడం సంగతి దేవుడెరుగు.. ఊహించుకోవడానికే చాలా కష్టంగా

Published : 10 Feb 2022 00:57 IST

రెండు చేతులతో అయిదు రకాల రూబిక్‌ క్యూబ్స్‌ను సాల్వ్‌ చేస్తూ.. కాళ్లకు స్కేటింగ్‌ షూస్‌ ధరించి, నడుము చుట్టూ ఓ రెండు మూడు హూలాహూప్‌ రింగ్‌లను తిప్పగలరా? అసలు సాధ్యమేనా?! చేయడం సంగతి దేవుడెరుగు.. ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది కదూ! కానీ ఓ చిరుతడు ఎంచక్కా చేసేస్తున్నాడు. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?!

కేరళరాష్ట్రం త్రిస్సూర్‌కు చెందిన హరిపాల్‌కు పట్టుమని పదేళ్లు కూడా నిండలేదు. కానీ తన విన్యాసాలతో అందరూ ‘ఔరా!’ అంటూ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. తన మల్టీ టాస్కింగ్‌తో అందరికీ మతి పోగొడుతున్నాడు.

ఏకకాలంలో ఇవన్నీనా!

కాళ్లకు రోలర్‌బ్లేడ్స్‌ ధరించి, మూడు హులాహూప్స్‌ రింగులను నడుము చుట్టూ తిప్పుతూ, అయిదు రకాల ర్యూబిక్‌ క్యూబ్స్‌ను కేవలం 1.28 నిమిషాల్లోనే మన హరిపాల్‌ సాల్వ్‌ చేయగలడు. అందుకే ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు.

‘తెర’మరుగు కావొద్దని!

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో హరిపాల్‌ సెల్‌ఫోన్‌కు బానిసయ్యాడు. ఈ వ్యసనం నుంచి బయట పడేయడానికి వాళ్లనాన్న రూబిక్‌ క్యూబ్స్‌ను ఇచ్చాడు. వాటిని మన హరిపాల్‌ చాలా తక్కువ సమయంలోనే సాల్వ్‌ చేశాడు. ఈసారి మరింత కష్టమైన రూబిక్‌ క్యూబ్స్‌ను ఇచ్చాడు. వాటినీ సాల్వ్‌ చేసేశాడు. ఇవన్నీ తనే సొంతంగా నేర్చుకున్నాడు. ప్రస్తుతం హరిపాల్‌ 20 రకాల రూబిక్‌ క్యూబ్స్‌ను సాల్వ్‌ చేయగలడు.

ఇలా మాత్రం అరుదే!

రూబిక్‌ క్యూబ్స్‌ను చాలా మంది సాల్వ్‌ చేయగలరు. కానీ ఓ వైపు వీటిని సాల్వ్‌ చేస్తూనే స్కేటింగ్‌ షూస్‌ ధరించి హూలాహూప్‌ రింగులు తిప్పడం అంటే మాత్రం మాటలు కాదంటున్నాడు హరిపాల్‌ వాళ్ల నాన్న. నిజమే మరి... చదువుతుంటే మనకే తెలుస్తోంది కదా! ఏంటీ.. మీరూ ప్రాక్టీస్‌ ప్రారంభించేస్తారా? అయితే బెస్టాఫ్‌ లక్‌! ఎంతసేపూ ఆ టీవీలకు, సెల్‌ఫోన్లకు అతుక్కుపోయే కంటే.. ఏదో ఒక యాక్టివిటీ ఉంటేనే బెటర్‌ కదా ఫ్రెండ్స్‌.. ఏమంటారు?!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని