చిట్టి చేతులు.. గట్టి చేతలు!

వారంతా బాలికలే... భారతదేశంలో వేరు వేరు ప్రాంతాలకు చెందినవారంతా ఒక్కటయ్యారు. ఇస్రో ఆధ్వర్యంలో ఓ బుజ్జి శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ‘ఆజాదీ కా అమృత్‌

Published : 05 Aug 2022 00:20 IST

వారంతా బాలికలే... భారతదేశంలో వేరు వేరు ప్రాంతాలకు చెందినవారంతా ఒక్కటయ్యారు. ఇస్రో ఆధ్వర్యంలో ఓ బుజ్జి శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ ఈ అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. మరి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందామా...!

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు... పలు ప్రాంతాల్లో చదువుతున్న బాలికలందరూ కలిసి ఎనిమిది కిలోల బరువున్న ఓ చిన్న శాటిలైట్‌ను తయారు చేశారు. దానికి ‘ఆజాదీ శాట్‌’ అని పేరు పెట్టారు. ఇస్రో సహకారంతో దీన్ని త్వరలోనే అంతరిక్షానికి పంపనున్నారు.

750 మంది.. తలా ఓ చేయి...
ఈ బుజ్జి శాటిలైట్‌ తయారీలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా.. 750 మంది పిల్లలు భాగస్వాములయ్యారు. వీరంతా వేరు వేరు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు. ఈ ప్రాజెక్టు చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా వారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ఈ పిల్లలంతా కేవలం 15 రోజుల్లోనే ‘ఆజాదీ శాట్‌’ను తయారు చేశారు. ఈ శాటిలైట్‌ భారతదేశ ఐకమత్యానికి ప్రతీక అని నిర్వాహకులు చెబతున్నారు. ఎందుకంటే ఈ విద్యార్థులు ఇంతకు ముందు ఒకరికొకరు తెలియదు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చి ఈ ప్రయోగంలో పాలు పంచుకున్నారు.

రివ్వున ఎగిసేలా...
ఇంత మంది చిట్టి చేతుల భాగస్వామ్యంతో తయారైన ఈ ‘ఆజాదీ శాట్‌’ ఆగస్టు 15న శ్రీహరికోటలోని షార్‌ నుంచి రివ్వున ఆకాశంలోకి దూసుకుపోనుంది. కానీ దీనిపై ఇంకా ఇస్రో ఛైర్మన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. బాలికల బృందం భవిష్యత్తులో మరో ప్రయోగంలోనూ పాలు పంచుకోనుందని నిర్వాహకులు చెబుతున్నారు. అది ఏంటంటే.. 20 కిలోల పేలోడ్‌ను ‘సౌండింగ్‌ రాకెట్‌’ సాయంతో అంతరిక్షంలోకి భూమి నుంచి దాదాపు 80 కిలోమీటర్ల ఎత్తులోకి పంపనున్నారు. ‘ఆజాదీ శాట్‌’ ప్రయోగం విజయవంతం కావాలని మనమూ మనసారా కోరుకుందామా మరి! జై హింద్‌!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని