మంత్రి ఎవరు?

ఓ అడవిలో మృగరాజు వద్ద ‘మెరుపు’ అనే కోతి మంత్రిగా ఉండేది. ఆ వనంలోని పక్షులు, జంతువుల కష్టసుఖాలు తెలియజేయడానికి ఒక నక్కను నియమించుకుంది సింహం.

Updated : 19 Jan 2023 03:24 IST

ఓ అడవిలో మృగరాజు వద్ద ‘మెరుపు’ అనే కోతి మంత్రిగా ఉండేది. ఆ వనంలోని పక్షులు, జంతువుల కష్టసుఖాలు తెలియజేయడానికి ఒక నక్కను నియమించుకుంది సింహం. అడవిలోని జంతువులు, పక్షులన్నీ సింహానికిచ్చే గౌరవాన్నే కోతికి ఇచ్చేవి. నక్కకు అది కంటగింపుగా మారింది. ఒకరోజు నక్క కడుపుమంటతో సింహం దగ్గరకు వెళ్లి.. ‘మహారాజా! ఎల్లకాలం కోతి మాత్రమే మంత్రిగా ఎందుకుండాలి? కొంతకాలం నేనూ ఆ బాధ్యతలు చేపడతాను. కోతికి నా పనిని అప్పగించండి’ అంది. సింహం నవ్వి.. ‘రేపు సభలో నిన్ను మంత్రిగా ప్రకటిస్తాను’ అంది. మరునాడు సభ ప్రారంభమైంది. ‘నక్కను ఈ ఒక్కరోజు మంత్రిగా ప్రకటిస్తున్నాను. న్యాయం కోసం వచ్చిన మీరు, మీ సమస్యలను నక్క మంత్రికి విన్నవించండి’ అంది సింహం.

ఒక కోతి ముందుకు వచ్చి.. ‘మంత్రివర్యా! ఈ ఎలుగుబంటి నావద్ద రెండు కొబ్బరిచిప్పలు బదులుగా తీసుకుంది. ఎంతకాలమైనా తిరిగి ఇవ్వడం లేదు. పైగా ఇచ్చేశానని అబద్ధమాడుతోంది’ అంది. వెంటనే ఎలుగు.. నక్కతో, ‘మంత్రివర్యా! కోతి నాకు కొబ్బరిచిప్పలు అప్పుగా ఇవ్వడం ఎంత నిజమో.. నేను తిరిగి ఇవ్వడం కూడా అంతే నిజం’ అంది. సాక్షులు లేని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థంకాక తలపట్టుకుంది నక్క. కొద్దిసేపు ఆలోచించి ‘కోతి ఇవ్వడం, ఎలుగు తిరిగివ్వడం ఎప్పుడో జరిగిపోయింది. పాత విషయానికి ఇప్పుడు తీర్పు అవసరం లేదు’ అంది నక్క.

ఇంతలో ఒక కాకి ముందుకు వచ్చి ‘మంత్రివర్యా! ఈ కోకిల తన గుడ్లను నా గూటిలో పెట్టి పొదగమని కోరింది. బదులుగా ఏం కోరినా ఇస్తానంది. అలాగేనని ఆ కోకిల గుడ్లను నా గూటిలోనే పొదిగాను. అందుకు బదులుగా తనలా మధురంగా పాట పాడే విద్యను నేర్పమని అడిగాను. కానీ, ఇంతవరకూ నేర్పించలేదు’ అని ఫిర్యాదు చేసింది. వెంటనే నక్క, కోకిలతో ‘నీకు నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా కాకికి నీలా మధురంగా పాడటం నేర్పించు. లేదంటే కఠిన శిక్ష విధిస్తాను’ అంది. తర్వాత ఒక ఏనుగు ‘మంత్రివర్యా! అడవిలో వనమహోత్సవం నిర్వహిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. నా ఆలోచనను మిగతా అన్ని జంతువులు, పక్షులు సంతోషంగా మెచ్చుకున్నాయి. నిన్న మృగరాజును కలిసి అదే విషయం చెప్పాను. అందుకు మృగరాజు అంగీకరించలేదు. మేమంతా ఒప్పుకొన్నా, కాదనడం సమంజసమా.. మీరే తీర్పు చెప్పండి’ అని కోరింది. నేరుగా సింహం మీదే ఏనుగు ఫిర్యాదు చేయడంతో నక్కకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎంత ఆలోచించినా.. మార్గం దొరక్కపోవడంతో ‘ఓ గజమా! నీకెంత పొగరు.. నేరుగా రాజు మీదనే ఫిర్యాదు చేస్తావా? ఇప్పుడు అంతా బాగానే ఉన్నాం కదా! వనమహోత్సవం జరపకుంటే వచ్చే నష్టమేముంది?’ అని చీవాట్లు పెట్టింది నక్క.

‘ఈ సమస్యలన్నింటికీ మెరుపు కోతి ఏం తీర్పు ఇస్తుందో చూద్దాం’ అంది సింహం. కొబ్బరి చిప్పల సమస్యతో కోతి, ఎలుగు మళ్లీ ముందుకొచ్చాయి. మంత్రి కోతి.. ఎలుగుతో ‘నువ్వు కొబ్బరి చిప్పలను కోతికి తిరిగి ఇవ్వలేదని నాకు తెలుసు. ఎందుకు ఇవ్వలేక పోతున్నావో కూడా నేను ఊహించగలను. నిజమేంటో చెబితే సమస్యను పరిష్కరిస్తాను’ అంది. ‘మంత్రివర్యా! ఆకలిగా ఉంటే అప్పుగా కొబ్బరి చిప్పలను తీసుకున్నాను. కోతి ఊరిలోకి వెళ్లి ఎక్కడి నుంచైనా కొబ్బరి చిప్పలు తేగలదు. అది నాతో సాధ్యం కాదు కదా! అందుకే తిరిగివ్వలేక అబద్ధం చెప్పాను’ అంది ఎలుగు. న్యాయం కోసం వచ్చిన కోతిని.. మంత్రి కోతి తన దగ్గరకు పిలిచి ‘ఎలుగు గుణం మంచిదే. కానీ, నీలాగా కొబ్బరి చిప్పలను సంపాదించడం దానికి రాదు. తేనెను తీసుకురావడం మాత్రం దానికి వెన్నతో పెట్టిన విద్య. కొబ్బరికి బదులుగా తేనెను తెచ్చి ఇస్తుంది. అది తీసుకో..’ అని తీర్పునిచ్చింది. అందుకు కోతి, ఎలుగు సంతోషంగా ఒప్పుకొన్నాయి. సమస్యను మెరుపు కోతి పరిష్కరించిన తీరు చూసి నక్క ముఖం వెలవెలబోయింది.

మెరుపు కోతి, కాకిని పిలిచి ‘కావ్‌... కావ్‌... అనే నీ అరుపు చాలా బాగుంటుంది. దాన్ని కోకిలకు నేర్పాలి’ అంది. కాకి వినయంగా ‘మంత్రివర్యా.. నా స్వరం, నా అరుపు సహజంగా పుట్టుకతో మా జాతికి వచ్చింది. ఇతరులకు ఎలా నేర్పగలను?’ అని అనుమానంగా అడిగింది. ‘మరి.. కోకిల నీకు పాట నేర్పడం లేదని ఫిర్యాదు చేశావు కదా.. నీలాగే కోకిల స్వరం, గాత్ర మాధుర్యం కూడా పుట్టుకతో వచ్చినవి. అవి మనకెలా వస్తాయి? కోకిల గూడు కట్టుకోలేదు కాబట్టి దాని పిల్లలను అక్కున చేర్చుకున్నావు. నీకు ఏమిచ్చినా ఆ రుణం తీరదు. అందుకు బదులుగా కోకిలపాట వింటూ ఆనందాన్ని పొందితే సరి’ అంది మంత్రి కోతి. తనకోరిక సమంజసం కాదని ఒప్పుకొంది కాకి. మెరుపు కోతి తీర్పునకు నక్క నోరెళ్లబెట్టింది. ఇంతలో ఏనుగు ముందుకొచ్చింది. మెరుపు కోతి దాని వైపు చూసి.. ‘ఉత్సవాలు ఆనందాన్నిస్తాయి. మన మధ్య ఆత్మీయతను పెంచుతాయి. ఆ విషయం మృగరాజుకు తెలుసు. నాకు తెలిసి ఉత్సవాలకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండరు. మరి నీ తప్పుడు ఫిర్యాదుకు కారణం ఏంటో తెలియాలి’ అంది. ఇంతలో ‘ఆ విషయం నేను చెబుతాను’ అంటూ సింహాసనం మీదనుంచి లేచింది మృగరాజు. ‘ఏనుగు నా మీద ఫిర్యాదు చేయడం నేను ఆడించిన నాటకం. మెరుపు కోతి సమస్యలను ఎంత తెలివిగా పరిష్కరిస్తుందో నక్కకు ప్రత్యక్షంగా తెలియజేయాలనే అలా చేశాను’ అని చెప్పడంతో జంతువులన్నీ అవాక్కయ్యాయి. తన తప్పు ఏంటో తెలుసుకుంది నక్క.
డి.కె.చదువులబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని