Updated : 18 Dec 2021 05:47 IST

వలయం చుట్టూ భూ సిరి.. అందుకో మరి

ఈనాడు, హైదరాబాద్‌

ప్రాంతీయ వలయ రహదారి కేంద్రంగా రియల్‌ వ్యాపారం ఊపందుకుంది. తొలి దశ అలైన్‌మెంట్‌ ఖరారు దశకు చేరడంతో 340 కి.మీ. వరకు వలయాకారంలో రాబోతున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు పేరుతో అటుఇటుగా వందల సంఖ్యలో ప్లాటింగ్‌ వెంచర్లు వెలిశాయి. అవుటర్‌ లోపల స్థలాల ధరలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలుదారులు అవుటర్‌ బయటి వైపు చూస్తున్నారు. ఆదివారం సైట్‌ సందర్శనలు కొద్దిరోజులుగా పెరిగాయి. భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని రియల్టర్లు అంటున్నారు. భూముల ధరలు పెరగడంతో స్థలాలు సైతం చ.అ. రూ.5వేల నుంచి రూ.15వేల ధరల శ్రేణిలో విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‌ నగరం మున్ముందు బాహ్యవలయ రహదారి బయటనే అభివృద్ధి చెందనుంది.  ప్రభుత్వం సైతం వేర్వేరు ప్రాజెక్టులను అవుటర్‌ బయటనే చేపడుతోంది.  ఫార్మాసిటీ రాబోతుంది. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్లు ఇక్కడ రాబోతున్నాయి. రక్షణ పరిశ్రమలు,  ఎలక్ట్రికల్‌ బ్యాటరీ, వాహన తయారీ సంస్థలు ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాయి. పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. గ్రోత్‌ కారిడార్‌లోనే 80వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు యాదాద్రి అభివృద్ధి పనులు పూర్తికావొచ్చాయి. మరో మార్గంలో టౌన్‌షిప్పులు రాబోతున్నాయి. ఇప్పటికే సిటీ బయటనే విమానాశ్రయం ఉంది. రైల్వే లైన్ల టర్మినళ్లు, డబ్లింగ్‌, ఎంఎంటీఎస్‌ విస్తరణతో రవాణా అనుసంధానం పెరగనుంది. ప్రాంతీయ వలయ రహదారినే కాదు సిటీకి చేరేందుకు పలు జాతీయ రహదారులు ఉండటం కలిసొచ్చే అంశం. దీంతో ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కలనే కాదు సిటీ నుంచి 80 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని పట్టణాల వరకు రియల్‌ వ్యాపారం విస్తరించింది. ఆయా పట్టణాలు ట్రిపుల్‌ ఆర్‌కు గంట ప్రయాణ దూరం మాత్రమే కావడం, సిటీకి రెండు గంటల్లో చేరుకునే సౌలభ్యం ఉండటంతో కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రిటైర్‌ అయిన వ్యక్తులు ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటే.. ఇప్పుడే వృత్తి జీవితాన్ని మొదలెట్టిన నవతరం భవిష్యత్తు దృష్ట్యా కొంటున్నట్లు రియల్‌ వర్గాలు చెబుతున్నాయి.

పెద్ద  ప్రాజెక్టులు..

ప్లాటింగ్‌ వెంచర్లు గతంలో 20 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండేవి. వందల ఎకరాల్లో చాలా అరుదుగా కనిపించేవి. ప్రస్తుతం ప్రాంతీయ వలయ రహదారి బయట వేస్తున్న వెంచర్లలో చాలావరకు పెద్దవి ఉంటున్నాయి. ఒక్కోటి 100 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల వరకు విస్తరించిన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని స్పందనను బట్టి దశలవారీగా చేపడుతున్నారు. వీటిని స్థానిక రియల్టర్లతో పాటూ పలు పేరున్న సంస్థలు అభివృద్ధి చేశాయి. క్లబ్‌ హౌస్‌, ఈతకొలను, ఆట స్థలాలు, రెస్టారెంట్లు, అతిథి గృహాల వరకు  సౌకర్యాలు కల్పిస్తున్నాయి. విశ్రాంత ఉద్యోగుల కోసం, విల్లాల కోసం, గ్రామ వాతావరణంలో ఉండేలాంటి నివాసం కోసం.. ఇలా భిన్న థీమ్‌లతో చేపడుతున్నారు.

అనుమతి  ఉన్న వాటిలోనే..

* అనుమతి ఉన్న లేఅవుట్లలోనే కొనుగోలు చేయడం మంచిది. వెంచర్లకు హెచ్‌ఎండీఏ/డీటీసీపీ అనుమతి తప్పనిసరి. సర్వే నంబరు ఆధారంగా ఆయా వెంచర్లకు అనుమతి ఉందో లేదో వెబ్‌సైట్‌లో చూసి నిర్ధారించుకోవచ్చు.
* రెరాలో నమోదైన తర్వాతనే విక్రయించాలి. సంబంధిత ప్రాజెక్ట్‌కు రిజిస్ట్రేషన్‌ ఉందో లేదో చూసుకోవాలి.
* ప్రాంతీయ వలయ రహదారికి పెద్ద ఎత్తున భూ సేకరణ చేపట్టనున్నారు. ఇందులో భూములు కోల్పోయే అవకాశం ఉంది.  కొనేటప్పుడు దీన్ని కూడా చూసుకోవాలి.

ఇక్కడ  కాస్త...

* ప్రధాన రహదారులతో అనుసంధానం ఉన్న ప్రాజెక్టుకు ఎప్పటికైనా డిమాండ్‌ అధికంగా ఉంటుంది. నివాసం ఉండేందుకు మాత్రం అంత అనుకూలం కాదు. శబ్ధ కాలుష్యం అధికం.
* పట్టణాలకు, నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న వెంచర్లు అయితే నిర్మాణాలు త్వరగా మొదలయ్యేందుకు అవకాశం ఉంటుంది. స్థలానికి డిమాండ్‌ పెరుగుతుంది.
* ఉపాధి అవకాశాలు ఎక్కువ వుండే కేంద్రాలకు సమీపంలోని వెంచర్లు వృద్ధి రేటు అధికంగా ఉంటుంది.
* గేటెడ్‌ కమ్యూనిటీల్లో అయితే దూరమైనా రక్షణ ఉంటుంది.


నగరం చుట్టూ..

సంగారెడ్డి వైపు: ఐటీ కారిడార్‌కు చేరువగా ఉండటం.. ట్రిపుల్‌ ఆర్‌ ప్రతిపాదనతో  ఇక్కడ రియల్‌ వేగం మరింత పెరిగింది.  కంది, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, సంగారెడ్డి దాటి జహీరాబాద్‌ వరకు రియల్‌ పరుగులు పెడుతోంది. ప్రాంతీయ వలయ రహదారి ఇక్కడి నుంచి మొదలవుతుండటం మరింత సానుకూలాంశమని చెబుతున్నారు.

చెవెళ్ల దారిలో: శంకర్‌పల్లి, చిలుకూరు, చెవెళ్ల, బీజాపూర్‌ రహదారి, వికారాబాద్‌ వరకు స్థలాలకు, భూములకు డిమాండ్‌ ఏర్పడింది. సిటీకి చేరువగా ఉండటంతో ఫామ్‌హౌస్‌లు కట్టుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

శ్రీశైలం మార్గంలో: ఫార్మాసిటీతో ఇదివరకే మొదలైన రియల్‌ వెంచర్లు..  ప్రాంతీయ వలయ రహదారి ప్రతిపాదనలతో మరింతగా ఊపందుకున్నాయి. మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్‌, ఆమనగల్‌, దాటేసి కల్వకుర్తి వరకు వెంచర్లు వెలిశాయి.

సాగర్‌ బాటలో: ఫార్మాసిటీ రాకతో ఇబ్రహీంపట్నం దాటేసి, యాచారం వరకు వెలిశాయి.

బెంగళూరు జాతీయ రహదారి వెంట: శంషాబాద్‌ అవతల కొత్తూరు, షాద్‌నగర్‌ వరకు ఇదివరకే వెంచర్లు వేయగా.. ప్రాంతీయ వలయ రహదారితో తిమ్మాపూర్‌, బాలానగర్‌, జడ్చర్ల వరకు మార్కెట్‌ విస్తరించింది. 

యాదాద్రి : ప్రభుత్వం గుడిని ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తుండటంతో పర్యాటకంగా వృద్ధికి అవకాశం ఉంటుందని భువనగిరి దాటేసి యాదాద్రి వరకు భారీగా వెంచర్లు వేశారు. వరంగల్‌ వెళ్లే రహదారి కావడం, కొత్తగా ప్రాంతీయ వలయ రహదారి వస్తుండటంతో ఇక్కడ సైతం కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి.

విజయవాడ వైపు.. ఇదివరకు స్థలాల లభ్యత లేక ఇక్కడ మార్కెట్‌ పెద్దగా విస్తరించలేదు. ట్రిపుల్‌ ఆర్‌ వస్తుండటంతో చౌటుప్పల్‌ చుట్టుపక్కల వెంచర్లు భారీగా వెలిశాయి. బడా సంస్థల ప్రాజెక్టులు ఇక్కడ వస్తున్నాయి.

మేడ్చల్‌ దిశలో:  ఐటీ కారిడార్‌కు అవుటర్‌తో అనుసంధానం మెరుగైంది. ఈ మార్గం నుంచి తూప్రాన్‌ వరకు, శామీర్‌పేట నుంచి గజ్వేల్‌ వరకు రహదారుల వెంట వెంచర్లు వస్తున్నాయి.


అన్ని వైపులా వృద్ధికి ఆస్కారం

‘‘ప్రాంతీయ వలయ రహదారి జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆలస్యంగానైనా వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంటుంది. సమీపంలో కొత్త జిల్లా కేంద్రాలు ఉండటం, వ్యవసాయ ఎకానమీ పెరగడంతో అక్కడి నుంచి పెట్టుబడులు, వలసలతో భవిష్యత్తులో పట్టణీకరణ విస్తరిస్తుంది. ప్రస్తుతం అక్కడ ధరలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి పెద్ద విస్తీర్ణంలో స్థలాలు కొనుక్కొనే వీలు ఉంటుంది. విశాలమైన ఇళ్లలో, కాలుష్యం లేని వాతావరణంలో నివాసం ఏర్పరచుకోవాలి అనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది.  ట్రిపుల్‌ ఆర్‌తో సిటీకి అన్నివైపులా వృద్ధికి అవకాశం ఉంది’’.

- ఆర్‌.చలపతిరావు, అధ్యక్షుడు, ట్రెడా


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని