వేసవిలోనూ మొక్కల సోయగం

వేసవి సమీపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా.. పగటి సమయంలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపం తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఇలాంటి తరుణంలో మొక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేసవి కాలంలో టెర్రస్‌, హోమ్‌ గార్డెనింగ్‌ మొక్కలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

Published : 03 Feb 2024 03:00 IST

వేసవి సమీపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా.. పగటి సమయంలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపం తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఇలాంటి తరుణంలో మొక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేసవి కాలంలో టెర్రస్‌, హోమ్‌ గార్డెనింగ్‌ మొక్కలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే మొక్కల పూలు రాలిపోయి.. ఆకులు వాడిపోయి కళావిహీనంగా కనిపిస్తాయి. పూలు, పండ్లు, తీగజాతి మొక్కల పరిరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఎండవేడిమి తాళలేక నిర్జీవంగా మారవచ్చు. అలా జరగకుండా గార్డెన్‌ పచ్చగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఉద్యాన నిపుణులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • వేసవిలో ఇండోర్‌ మొక్కల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటి ఆకులపై నీటిని పిచికారీ చేస్తే వాడిపోకుండా తాజాగా కనిపిస్తాయి. ఫిలోడెండ్రాన్‌, పీస్‌ లిల్లీ, కాలాథియా, బ్రోమెలియాడ్‌, స్నేక్‌ ప్లాంట్‌, ఆంథోరియం ప్లాంట్‌, రెడ్‌ అగ్లోనెమా, ఆస్పరాగస్‌ ఫెర్న్‌, కలంచో వంటి ఇండోర్‌ మొక్కలకు సూర్యరశ్మి అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ, వీటిని సైతం ఉదయం 1-2 గంటలు ఎండలో పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి.
  • ఇండోర్‌ మొక్కలకు వీలైనంతలో సేంద్రియ ఎరువులను వేస్తే అవసరమైన పోషకాలు అందుతాయి. ఎందుకంటే వాటికి రసాయన ఎరువుల గాఢతను తట్టుకునే శక్తి  ఉండదు.
  • వేసవిలో మొక్కల మొదళ్ల వద్ద ఊక, చెక్క, రంపపు పొట్టు వేయాలి. ఇవి మట్టిలో తేమ శాతం తగ్గిపోకుండా చూస్తాయి. నిర్ణీత సమయంలో వీటిని మార్చుతుండాలి.. లేదంటే మొక్కలు తెగుళ్ల బారినపడే ప్రమాదం ఉంది.  
  • ఏపుగా పెరిగే మొక్కలను వేసవిలో కత్తిరించాలి. తద్వారా ఎండవేడిమి తట్టుకోవడంతో పాటు కొత్త చిగుర్లు వచ్చి మొక్క పచ్చగా ఉంటుంది. వేసవిలో గార్డెన్‌లో కొత్తగా మొక్కలు వేయాలనుకుంటే గులాబీ, బంతి, పారిజాతం, సంపంగి, మందార, కనకాంబరం, నూరు వరహాలు, నందివర్ధనం తదితర పూలమొక్కలను నాటడం మంచిది. వీటికి సూర్యరశ్మిని తట్టుకునే శక్తి ఉంటుంది.

ఎండ వేళ నీరు పోయొద్దు..: వేసవిలో మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లో నీరు అందించాలి. మధ్యాహ్నం వేళ ఎండ కారణంగా మట్టి వేడిగా ఉండటం వల్ల నీటి ఉష్ణోగ్రత సైతం పెరుగుతుంది. ఫలితంగా మొక్క వేర్లు దెబ్బతింటాయి. వేసవిలో మొక్కలను వీలైనంత వరకు మట్టికుండీల్లో పెంచాలి. మట్టి కుండీలకు నీటిని పీల్చుకొనే స్వభావం ఉంటుంది. మొక్క కింది భాగం నిత్యం తడిగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి.

కిరణ్‌, గణపతి గార్డెన్స్‌ నిర్వాహకులు, కాకినాడ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని