తూర్పున ఉషోదయం

గ్రేటర్‌లో నిర్మాణ రంగం నలుదిక్కులా విస్తరిస్తోంది. గత కొంత కాలం వరకు పశ్చిమ నగరంలో ఈ ఒరవడి ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు తూర్పున కూడా సానుకూల వాతావారణం కనిపిస్తోంది

Updated : 10 Feb 2024 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌ : గ్రేటర్‌లో నిర్మాణ రంగం నలుదిక్కులా విస్తరిస్తోంది. గత కొంత కాలం వరకు పశ్చిమ నగరంలో ఈ ఒరవడి ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు తూర్పున కూడా సానుకూల వాతావారణం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటువైపు రోడ్ల విస్తరణ, ప్రత్యేక టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ఆసక్తి చూపుతుండటంతో.. కొనుగోలుదారులూ అటువైపు చూస్తున్నారు. పశ్చిమంతో పోలిస్తే.. భూమి ధర తక్కువగా ఉండటం, ఖాళీ స్థలాలు భారీగా అందుబాటుతో నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపడుతున్నాయని.., నివాస సముదాయాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోందని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జారీ చేసిన అనుమతుల్లో శేరిలింగంపల్లి జోన్‌కు ఎల్బీనగర్‌ జోన్‌ గట్టి పోటీ ఇవ్వడమే అందుకు నిదర్శనమంటున్నారు. ఉప్పల్‌, పోచారం, ఎల్బీనగర్‌లోనే కాదు వనస్థలిపురం, ఘట్‌కేసర్‌లో ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయని ఉదహరిస్తున్నారు.  

మౌలిక సౌకర్యాలతో..

పని వేళలను మినహాయిస్తే.. నగరంలో సగటు వాహన వేగం పెరిగింది. పైవంతెనలు, అండర్‌పాస్‌లు, విశాలమైన రోడ్డు మార్గాలతో నగరంలోని ఏ మూల నుంచి ఏ వైపునకైనా వాహనాలు సాఫీగా వెళ్లగలుగుతున్నాయి. మిగిలిన నగరంతో పోలిస్తే.. ఈ పరిస్థితి ఎల్బీనగర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో కాస్త ఎక్కువనే చెప్పాలి. ఎల్బీనగర్‌ కూడలిలో పైవంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మాణమవడం, చుట్టుపక్కలున్న కామినేని, నాగోల్‌, బైరామల్‌గూడ కూడళ్లలోనూ పైవంతెనలు రావడం, చింతలకుంట చెక్‌పోస్టు కూడలి అండర్‌పాస్‌తో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎల్బీనగర్‌ నుంచి విజయవాడ వైపు జాతీయ రహదారిని ఎనిమిది లేన్లుగా విస్తరిస్తుండటం.. ఆ ప్రాంతానికి అదనపు లాభాన్ని చేకూర్చుతోంది. మరోవైపు.. ఉప్పల్‌ కూడలిలోనూ బహుళ స్థాయి పైవంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. నారపల్లి నుంచి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వరకు ఆరులైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం జరుగుతోంది. ఎల్బీనగర్‌, ఉప్పల్‌ కూడళ్ల నుంచి హైటెక్‌సిటీ, మియాపూర్‌ వరకు మెట్రో రైలు సదుపాయం ఎలాగూ ఉంది. ఆయా కారణాలతో.. తూర్పు నగరంలో నివాసం ఉండేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారని అధికారులు అంటున్నారు.


 జీహెచ్‌ఎంసీ వెలుపల కూడా..

కొత్త ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిని కాకుండా.. రీజినల్‌ రింగు రోడ్డును దృష్టిలో ఉంచుకుని నగరాభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తోంది. ఆయా ప్రణాళికలు ఆచరణ సాధ్యమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అందువల్ల ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ వృద్ధి కనిపిస్తోందని, మున్ముందు గ్రేటర్‌ వెలుపల అంతకంతకు విస్తరిస్తుందని అధికారుల అంచనా. ఘట్‌కేసర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్‌ వరకు నివాస కేటగిరీ ప్రాజెక్టులు రానున్నాయని వివరిస్తున్నారు.


నేడు, రేపు ప్రాపర్టీ షో

ఈనాడు, హైదరాబాద్‌ : హిందూ పత్రిక గ్రూప్‌నకు చెందిన రూఫ్‌ అండ్‌ ఫ్లోర్‌.కామ్‌ శనివారం, ఆదివారం రెండు రోజులు నగరంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. హైటెక్‌సిటీలోని మైదాన్‌ ఎక్స్‌పో సెంటర్‌లో రెండో ఎడిషన్‌ ప్రాపర్టీ షో ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థల స్టాల్స్‌తో పాటూ గృహరుణాలు మంజూరు చేసే బ్యాంకులు కొలువుదీరనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. అందరికీ ప్రవేశం ఉచితం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని