ఇంటి రుణ బీమా.. కుటుంబానికి ధీమా

గృహరుణంతో ఇల్లు కొనుగోలు చేసేవారే అధికం. పాతిక నుంచి యాభై లక్షల రూపాయల వరకు రుణం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం. ఆర్థిక స్థోమతను బట్టి కోట్లలో తీసుకునే వారు లేకపోలేదు.

Updated : 10 Feb 2024 10:19 IST

ఈనాడు, హైదరాబాద్‌ : గృహరుణంతో ఇల్లు కొనుగోలు చేసేవారే అధికం. పాతిక నుంచి యాభై లక్షల రూపాయల వరకు రుణం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం. ఆర్థిక స్థోమతను బట్టి కోట్లలో తీసుకునే వారు లేకపోలేదు. కుటుంబం కోసం ఈఎంఐ భారమైనా అధిక రుణం తీసుకునేందుకే ముందడుగు వేస్తుంటారు. ఇంటి కలను నెరవేర్చుకొంటుంటారు. గృహరుణానికి ధీమానిచ్చే టర్మ్‌ పాలసీ తీసుకోవడాన్ని మాత్రం చాలామంది భారంగా భావించి విస్మరిస్తుంటారు. ఇంటి పెద్ద దూరమైనప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉండే కుటుంబ సభ్యులు... ఇల్లు గడవడమే కష్టంగా భావించే సమయంలో ప్రతినెలా వేలల్లో ఈఎంఐ చెల్లించడం అంటే సాధ్యం అయ్యేపని కాదు. అదే బీమా ఉంటే కుటుంబానికి ధీమాగా ఉంటుంది. అందుకే ఇల్లు కొనుగోలు సమయంలో దీర్ఘకాలంపాటు కొనసాగే గృహ రుణానికి తగిన భద్రత కల్పించే బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గృహరుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ మార్టిగేజ్‌ రెడ్యూసింగ్‌ టర్మ్‌ అస్యూరెన్స్‌ పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.

ఆదాయానికి అనుగుణంగా ఈఎంఐ

ఇల్లు కొనాలని అనుకున్న రోజు నుంచి కొన్ని నెలలపాటు ఎన్నో ఆలోచనలు... ప్రతి విషయాన్నీ శ్రద్ధగా చూసుకుంటూ.. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటారు. అన్నీ సవ్యంగా పూర్తయితే సొంతింటి కల నెరవేరుతుంది. గృహరుణం అంటే దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగుతుంది. రుణం తీరేదాకా వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే ఇల్లు పూర్తిగా సొంతం అవుతుంది. మీ ఆదాయానికి అనుగుణంగా ఎంత ఈఎంఐ చెల్లించాలన్నది నిర్ణయిస్తారు. వచ్చిన ఆదాయంలో నుంచి  గృహరుణం వాయిదా పోను, మిగిలిన మొత్తాన్నే అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆదాయం ఉన్నన్ని రోజులూ వాయిదాల చెల్లింపు విషయంలో ఎలాంటి ఆందోళనా ఉండదు.

అనుకోనిది జరిగితే.. ఇబ్బంది లేకుండా..

కానీ, జీవితం అనూహ్యంగా ఉంటుంది. అనిశ్చితి ఏ క్షణమైనా మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అనుకోని దురదృష్టం ఇంటి యజమానిని దూరం చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? ఆదాయం ఆగిపోతుంది. వాయిదాలు చెల్లించడం కష్టం అవుతుంది. రుణ భారం ఒకవైపు, కుటుంబ ఖర్చులు మరోవైపు.. కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తాయి. ఇలాంటి కష్టకాలంలో ఈఎంఐ చెల్లించే అవకాశం లేక ఇంటిని వదిలేయాల్సిన పరిస్థితులూ ఎంతోమందికి ఎదురయ్యాయి. ఈ చిక్కులను తప్పించుకోవాలంటే.. గృహరుణం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా హోమ్‌ లోన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ తీసుకోవడం  అవసరం. దురదృష్టవశాత్తూ రుణ గ్రహీత మరణించిన సందర్భంలో బీమా కంపెనీ గృహరుణాన్ని తీర్చేస్తుంది.  

రుణానికి  తగినట్లుగా..

గృహరుణం తీసుకున్నప్పుడు రక్షణగా తీసుకునే ‘మార్టిగేజ్‌ రెడ్యూసింగ్‌ టర్మ్‌ అస్యూరెన్స్‌ (ఎంఆర్‌టీఏ)’ పాలసీ సాధారణ టర్మ్‌ పాలసీలాగానే పనిచేస్తుంది. రుణగ్రహీత మరణించినప్పుడు  రుణం మొత్తం ఇది చెల్లిస్తుంది. పాలసీ విలువ ఇంటి రుణ మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పు కొనసాగినన్ని రోజులు బీమా రక్షణా లభిస్తుంది. వాయిదాలు చెల్లిస్తున్నప్పుడు రుణం మొత్తం తగ్గుతూ వస్తుంది. ఆ మేరకు బీమా పాలసీ విలువా సర్దుబాటు అవుతుంది. రుణాన్ని ఇస్తున్నప్పుడే బ్యాంకులు లేదా గృహరుణ సంస్థలు తమ  గ్రహీతలకు ఈ పాలసీని తీసుకోవాలని సూచిస్తాయి. తమతో ఒప్పందం ఉన్న బీమా కంపెనీల నుంచి పాలసీని అందిస్తాయి.

గృహ రుణం 20 ఏళ్లకు ఉంటే.. కావాలంటే 35 ఏళ్లకు కూడా బీమాని ఎంచుకునే వెసులుబాటు ఉంది.

ప్రీమియం భారం కాకుండా ...

  • ఎంఆర్‌టీఏ పాలసీలకు ప్రీమియం కాస్త తక్కువ. రుణ బాధ్యత కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది కాబట్టి, ఈ ప్లాన్‌లో హోమ్‌ లోన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌లతో పోలిస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించే వీలూ కల్పిస్తాయివి. లేదా గృహరుణ వాయిదాలతోపాటూ నెలనెలా  చెల్లించే సౌలభ్యమూ లభిస్తుంది.
  • ఎంఆర్‌టీఏ పాలసీలు ఉమ్మడిగా తీసుకున్న రుణాలకూ వర్తిస్తాయి. రుణం ఇద్దరి పేర్ల మీద ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి రుణం తీసుకున్నప్పుడు ఒకే పాలసీతో ఇద్దరికీ వర్తించేలా బీమా సౌకర్యం పొందవచ్చు.
  • దురదృష్టవశాత్తూ రుణగ్రహీత మరణించినప్పుడు రుణదాత బీమా సంస్థను సంప్రదిస్తే.. ఆ సంస్థ ఇంటిపై ఉన్న రుణం మొత్తాన్ని చెల్లిస్తుంది. అదనంగా ఇంకా ఏమైనా మిగిలితే రుణ గ్రహీత సూచించిన నామినీకి చెల్లిస్తారు. పైన పేర్కొన్న ప్రయోజనాలే కాకుండా, బీమా కంపెనీలు విభిన్న రకాల పాలసీలను అందిస్తున్నాయి.

అనువైనది ఎంచుకోండి..

అందుబాటులో ఉన్న భిన్న పాలసీల్లో మీకు అనువైన పాలసీ ఏది అని చూసుకోవాలి. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న కంపెనీ నుంచి తీసుకోవడం ఎప్పుడూ మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని