అల్మారాలు ఏ దిక్కులో ఉండాలి

ఇంటి అలంకరణకు ప్రాధాన్యత పెరిగింది. అందంతో పాటూ సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు తాజా పోకడలకు తగ్గట్టుగా ఇంటీరియర్స్‌ చేయిస్తున్నారు. స్థలం వృథా కాకుండా అవసరాల పరంగా ఏ మాత్రం రాజీ పడకూడదని కొందరు డిజైనర్లను ఆశ్రయిస్తుంటే మరికొందరు సొంతంగా...

Published : 26 Jun 2021 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇంటి అలంకరణకు ప్రాధాన్యత పెరిగింది. అందంతో పాటూ సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు తాజా పోకడలకు తగ్గట్టుగా ఇంటీరియర్స్‌ చేయిస్తున్నారు. స్థలం వృథా కాకుండా అవసరాల పరంగా ఏ మాత్రం రాజీ పడకూడదని కొందరు డిజైనర్లను ఆశ్రయిస్తుంటే మరికొందరు సొంతంగా ఇంటిని తమకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రత్యేకించి అల్మారాలను(కప్‌బోర్డు) చేయించేటప్పుడు, బిగించేటప్పుడు వాస్తుపరంగా ఏ దిక్కులో ఉండాలనే సందేహాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కప్‌ బోర్డులను ఏర్పాటు చేసుకునేటప్పుడు వాస్తుపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పెంటపాటి.

ఇల్లు పెద్దదైనా.. చిన్నదైనా  ఇంట్లోని వస్తువులు బయటికి కనిపించకూడదు.. అదే ఇప్పటి ట్రెండ్‌. ఇల్లు శుభ్రంగా.. అందంగా కనిపించేందుకు, వస్తువులు భద్రంగా ఉండేందుకు నూతన వస్త్రాలు, పాత కాగితాలు..  కొత్త బ్యాగులు, పాత సామగ్రి,  పిల్లల బొమ్మలు, పెద్దల జ్ఞాపకాల వరకు అల్మారాలో దాచేస్తుంటారు. గది విస్తీర్ణాన్ని బట్టి ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడ కప్‌బోర్డులు బిగిస్తుంటారు. వాస్తును సైతం పరిగణనలోకి తీసుకుంటారు. 

మూల గదుల్లో ఇలా..

* పడమర, దక్షిణ దిశలు కలిసే నైరుతిలో ఉన్న గదిలో దక్షిణం వైపు నుంచి వచ్చే గాలి శ్రేష్ఠం అంటారు. కాబట్టి అల్మారాలు పడమర వైపు ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుంది.

* తూర్పు, ఉత్తర దిశలు కలిసే ఈశాన్యంలో ఉన్న గదిలో పడమర, లేదా దక్షిణం దిశలో అల్మారాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

* ఉత్తర, పడమర దిక్కులు కలిసే వాయువ్యం మూల గదిలో దక్షిణం వైపు వీలుగా ఉంటుంది.

* తూర్పు, దక్షిణం కలిసే ఆగ్నేయం మూల గదిలో ఉదయం పూట తూర్పు నుంచి వచ్చే ఎండ, గాలి, వెలుతురు తగినంతగా ఉంటుంది. వీటికి అడ్డుపడేలా కాకుండా పడమర గోడకు, దక్షిణం గోడకు అల్మారాలు శాస్త్ర ప్రకారం ఉండాలి.

ఇక దిక్కుల విషయానికొస్తే..

* తూర్పు దిశలో ఉన్న గదిలో పడమర దక్షిణం దిక్కులో అల్మారాలు, అటకలు ఏర్పాటు చేసుకోవచ్చు.

* ఉత్తరం దిక్కులో ఉన్న గదిలో దక్షిణ పడమర దిశలో కప్‌బోర్డులు ఏర్పాటు చేసుకోవచ్చు.

* దక్షిణం దిక్కు గదిలో పడమర వైపు అల్మారాల ఏర్పాటు మంచిదే.

* పడమర దిక్కులోని గదిలో దక్షిణం వైపు అల్మారాల ఏర్పాటు ఉత్తమం. 

* స్నానాల గదుల్లో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని సరైన చోట వీటిని బిగించుకోవచ్చు. 


విస్తీర్ణాన్ని బట్టి..

ప్‌బోర్డుల ఏర్పాటులో గదుల పొడవు, వెడల్పుల విషయంలో అవగాహన ఉండాలి. గదులు చిన్నగా ఉన్నప్పుడు పడక మంచాలు, ఇతర ఫర్నిచర్‌ ఎక్కడ వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అవసరం మేరకు నిపుణుల సలహాలు మేలు చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని