స్వగృహ కథ.. మళ్లీ మొదటికి!

నాగోల్‌ సమీపంలోని బండ్లగూడ రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల ఈవేలం కథ మళ్లీ మొదటికి వచ్చింది. క్లస్టర్ల వారీగా వీటిని విక్రయించేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)

Published : 26 Mar 2022 01:06 IST

క్లస్టర్లుగా ఈ-వేలానికి ముందుకు రాని వైనం

ఫ్లాట్ల వారీగా విక్రయిస్తే ప్రయోజనం

ఈనాడు, హైదరాబాద్‌: నాగోల్‌ సమీపంలోని బండ్లగూడ రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల ఈవేలం కథ మళ్లీ మొదటికి వచ్చింది. క్లస్టర్ల వారీగా వీటిని విక్రయించేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఈ-వేలానికి నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదరపు అడుగుకు రూ.2500 వరకు ఆప్‌సెట్‌ ధరను నిర్ణయించింది. గురువారం ఈ-వేలం నిర్వహించగా...నిర్ణీత సమయం ముగిసే వరకు ఏ సంస్థ కూడా వేలం ప్రక్రియలో పాల్గొనలేదు. దీంతో హెచ్‌ఎండీఏకు నిరాశే ఎదురైంది. ఇటీవల బహదూర్‌పల్లి, తొర్రూర్‌లో రాజీవ్‌ స్వగృహ లేఅవుట్లలో ప్లాట్ల విక్రయానికి కొనుగోలు దారుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రెండు లేఅవుట్లలోని భూములను ప్లాట్ల వారీగా ఈ-వేలం వేయగా...ప్రభుత్వానికి రూ.325 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ఇదే విధమైన డిమాండ్‌ రాజీవ్‌ స్వగృహ ఇళ్లకు ఉంటుందని అధికారులు తొలుత యోచించారు. అయితే ఫలితం అందుకు భిన్నంగా రావడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు.

ప్రీబిడ్‌ మీటింగ్‌ నిర్వహించినా..

బండ్లగూడలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గతంలో 15 క్లస్టర్లలో 2500 ఫ్లాట్లను నిర్మించింది. వీటిని ఎప్పటికప్పుడు విక్రయించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొనుగోలుదారుల నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. తాజాగా ఈ-వేలం వేయాలని నిర్ణయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అన్ని మౌలిక వసతులతోపాటు నగరం నడిబొడ్డున ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు, డెవలపర్లు ఈ ఫ్లాట్ల పట్ల ఆసక్తి చూపడం లేదు. ఈ మేరకు ప్రీబిడ్‌ మీటింగ్‌  నిర్వహించి అన్ని వివరాలు తెలిపినప్పటికీ స్పందన రాకపోవడంతో గమనార్హం. ముఖ్యంగా క్లస్టర్ల వారీగా ఈవేలం ప్రక్రియ చేపట్టడం వల్లే ఎవరూ ఆసక్తి చూపలేదని అంటున్నారు. మధ్యతరగతి జనం ఈ ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తితో ఉన్నప్పటికీ క్లస్టర్ల విధానం వల్ల వీలు కాలేదని అంటున్నారు. ఒక్కో క్లస్టర్‌లో 70-90 ఫ్లాట్లు ఉన్నాయి. స్థిరాస్తి సంస్థలు, డెవలపర్లు తప్పా...ఇతరులు కొనేందుకు ఆస్కారం లేదు. ఇకముందు ఫ్లాట్ల వారీగా వేలం వేస్తే...ఎలా ఉంటుందనే విషయమై అధికారులు యోచన చేస్తున్నారు. కాగా ఖమ్మంలోని రాజీవ్‌స్వగృహ ఫ్లాట్ల ఈ-వేలానికి ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడ కూడా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదని అధికారులు తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని