Updated : 04 Jun 2022 09:10 IST

ఐటీ జోష్‌.. రియల్‌ ఖుష్‌

ఈనాడు, హైదరాబాద్‌

ఐటీ రంగంలో హైదరాబాద్‌ నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయి. కొత్త కంపెనీలు నగరానికి వరస కడుతున్నాయి. పెద్ద సంస్థలు తమ రెండో అతిపెద్ద కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ స్థిరాస్తి రంగానికి కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో 80 శాతం వ్యవస్థీకృత మార్కెట్‌ వాటా పశ్చిమ హైదరాబాద్‌దే. ఇక్కడ ఎక్కువగా ఐటీ ఉద్యోగులు,  ప్రవాస భారతీయులు నివాసాలను కొనుగోలు చేస్తుంటారు. స్థిరాస్తిపై పెట్టుబడులు పెడుతుంటారు. ఇటీవల కాలంలో వేర్వేరు పరిణామాలతో మార్కెట్‌ కొంత నెమ్మదించిందని డెవలపర్లు చెబుతున్నారు. జీవో 111 ఎత్తివేత, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ప్రభావం కొంత ఉందని అంటున్నారు.  సహజంగానే ఏటా ఈ సమయంలో మార్కెట్‌ కొంత నెమ్మదిస్తుందని మరికొందరు బిల్డర్లు అంటున్నారు. అగ్రశేణి బిల్డర్ల వాదన మరోలా ఉంది. కొనుగోళ్లు బాగున్నాయని.. కొత్త ప్రాజెక్టులకు స్పందన బాగుందని చెబుతున్నారు. ఇలాంటి మిశ్రమ వాతావరణం మార్కెట్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో  మున్ముందు మార్కెట్‌ ఎలా ఉంటుందోనని పెట్టుబడిదారుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ఐటీ రంగ వార్షిక పురోగతి గణాంకాలు రియాల్టీలో సరికొత్త జోష్‌ నింపాయి. ఏడాది కాలంలో 26.14 శాతం ఐటీ ఎగుమతుల్లో వృద్ధి నమోదైంది. ఉపాధి కల్పనలో 23.48 శాతం వృద్ధితో కొత్తగా 1.50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది రెండింతలు. ఈ గణాంకాలు సహజంగానే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి భవిష్యత్తుపై భరోసానిచ్చాయి.

కార్యాలయాల  నిర్మాణాలకు..
అంతర్జాతీయంగా చూస్తే ఒక ఉద్యోగికి వంద చదరపు అడుగుల కార్యాలయ స్థలం కావాలి. గత ఏడాది లక్షన్నర మందికి ఉద్యోగాలు అంటే.. కార్యాలయాల్లో 15 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ట్రెండ్‌ నడుస్తుండటంతో తక్కువలో తక్కువ కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు అవసరం. కొవిడ్‌కు ముందు కోటి మైలురాయిని ఒకసారి హైదరాబాద్‌ చేరుకుంది. ఆ తర్వాత లాక్‌డౌన్‌, ఇంటి నుంచి పనితో కార్యాలయాలకు డిమాండ్‌ తగ్గింది. ఇప్పటికీ 80 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తుండటంతో భారీగా ఉద్యోగాలు వచ్చినా ఉన్న కార్యాలయాలు సరిపోతున్నాయి. కార్యాలయాలు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంటడంతో ఆ మేరకు ఐటీ కారిడార్‌లో గ్రేడ్‌ ఏ కార్యాలయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తాజా ఐటీ వృద్ధితో మరిన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తమ కమర్షియల్‌ ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది.

ఇళ్లకు డిమాండ్‌
ఐటీ కారిడార్‌లో గత ఏడాది 60 శాతం కొత్త ప్రాజెక్ట్‌లు వచ్చాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ కొన్ని ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. ఇక్కడే  50వేల యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉన్నాయి. మూడునాలుగేళ్ల ప్రాజెక్ట్‌లివి. వీటిలో చాలావరకు ప్రీసెల్స్‌లోనే అమ్మకాలు జరిపారు. మిగతా వాటికి కొనుగోలుదారుల నుంచి ఆ మేరకు డిమాండ్‌ ఉంటుందా అనే సందేహాలు పరిశ్రమ నుంచి కొందరు వ్యక్తం చేశారు. ఒక్క ఐటీ రంగంలో ఏడాదిలో లక్షన్నర ఉద్యోగాల కల్పనతో ఇళ్ల డిమాండుకు ఢోకా ఉండదని అంటున్నారు. వీరందరికీ ఇళ్లు సమకూర్చేందుకు తమకు పదేళ్ల సమయం పడుతుందని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి అన్నారు.


స్థిరమైన వృద్ధి

హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం ఇతర నగరాలతో పోల్చినప్పుడు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఆరేళ్లుగా వృద్ధిబాటలో కొనసాగుతోంది. మధ్యలో కొవిడ్‌ ఒడిదొడుకులు ఎదురైనా వేగంగా అందులోంచి బయటపడింది.

* క్రమంగా వృద్ధి చెందుతోన్న మార్కెట్‌ కావడంతో గృహ, కార్యాలయ స్థలాల సరఫరా అధికంగానే ఉంది. నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యతతో ఇక్కడ కొత్త కంపెనీలు ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి.

* నగరవాసులు ఇళ్లు కొనడమే కాదు.. ఇటీవల కాలంలో వాణిజ్య, కార్యాలయ నిర్మాణాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. గృహ అద్దెలతో పోలిస్తే వీటిలో అద్దెల రాబడి ఎక్కువగా ఉంటుందని ఇటువైపు క్రమంగా మొగ్గుచూపుతున్నారు. 2019లో కార్యాలయాల లీజింగ్‌లో హైదరాబాద్‌ తొలిసారి బెంగళూరు నగరాన్ని అధిగమించింది. గత ఏడాది సైతం బెంగళూరు నగరాన్ని అధిగమించిందని పురపాలక మంత్రి ఇటీవల అన్నారు.

* ఐటీ సంస్థలే ఎక్కువగా లీజుకు తీసుకున్నాయి. ఇంజినీరింగ్‌, ఉత్పత్తిరంగాల సంస్థలు ఉన్నాయి. లక్ష చదరపు అడుగుల పైనే ఈ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి. 

* కార్యాలయాల సమీపంలోని ఇళ్లకు ఇప్పటికే అధిక డిమాండ్‌ ఉంది. ఇందుకు అనుగుణంగా ఒక్కో ప్రాజెక్ట్‌లో గరిష్ఠంగా మూడు వేలపైన యూనిట్లు వస్తున్నాయి. భూమి లభ్యత తక్కువ ఉండటం, అపరిమిత ఎఫ్‌ఎస్‌ఏ కావడంతో ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నారు. అనుమతుల పరంగా చూస్తే ఇప్పటివరకు 45 అంతస్తుల వరకు గృహ నిర్మాణ ప్రాజెక్టుల పనులు మొదలెట్టారు.

* ఐటీ నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తూర్పులో పోచారంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉండగా.. ఉప్పల్‌ పారిశ్రామిక ప్రాంతాన్ని ఐటీకి నెలవుగా మారుస్తోంది. దీంతో ఇక్కడ సైతం నివాస, వాణిజ్య భవనాలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే అతిపెద్ద భవనాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని