అద్దెలు 25 శాతం పెరిగాయ్‌

గృహాల అద్దెలు నాలుగేళ్లలో గణనీయంగా పెరిగాయి. నెలవారీ సగటు అద్దెలు కొవిడ్‌ ముందుతో పోలిస్తే ఎనిమిది ప్రధాన నగరాల్లో 25 నుంచి 30 శాతం పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ టెక్‌ ఫ్లాట్‌ఫాం హౌసింగ్‌.కామ్‌ తాజాగా ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 25 శాతం పెరిగాయి.

Updated : 03 Feb 2024 04:55 IST

ఈనాడు, హైదరాబాద్‌ : గృహాల అద్దెలు నాలుగేళ్లలో గణనీయంగా పెరిగాయి. నెలవారీ సగటు అద్దెలు కొవిడ్‌ ముందుతో పోలిస్తే ఎనిమిది ప్రధాన నగరాల్లో 25 నుంచి 30 శాతం పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ టెక్‌ ఫ్లాట్‌ఫాం హౌసింగ్‌.కామ్‌ తాజాగా ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 25 శాతం పెరిగాయి. మూలధన విలువల పెరుగుదల కంటే నెలవారీ సగటు అద్దె వృద్ధి ఎక్కువగా ఉందని వెల్లడించింది.

దేశీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తప్పనిసరిగా కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందిగా ఆదేశించడంతో అద్దె ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. బహుళజాతి కంపెనీలు హైబ్రిడ్‌ మోడల్‌ అనుసరిస్తున్నప్పటికీ సిటీలో నివాసం అనివార్యంగా మారింది. దీంతో కొవిడ్‌ సమయంలో ఖాళీ అయిన నివాసాలన్నీ తిరిగి భర్తీ కావడమే కాదు.. గత రెండేళ్లలో కొత్త ఉద్యోగుల రాకతో డిమాండ్‌ పెరిగింది. ఇవన్నీ కూడా అద్దెల ధరలు పెరగడానికి దోహదం చేశాయి.

స్థిరాస్తుల ధరలు పెరగడం కూడా : కొవిడ్‌ అనంతరం ఇళ్లు, భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఆ తర్వాత కూడా పెరుగుదల స్థిరంగా కొనసాగింది. ఇంటిపై వ్యయం చేసేటప్పుడు వచ్చే అద్దెలు ఎంత అనేది కూడా చూస్తారు. దీని ఆధారంగానే కొందరు పెట్టుబడి పెడుతుంటారు. ఐటీ వంటి సేవా రంగం ఆధిపత్యం ఉన్న నగరాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో అద్దెలు 30 శాతానికి మించి పెరిగాయి.

మున్ముందు ఇదే విధంగా : రాబోయే రెండు మూడేళ్లలో సిద్ధమైన ఇళ్లు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ అద్దె డిమాండ్‌ కొనసాగుతుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో నిరంతర వృద్ధి కారణంగా దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని